Share News

12వ బెటాలియన్‌లో అసలేం జరుగుతోంది?

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:56 AM

జిల్లా కేంద్ర సమీపంలోని 12వ బెటాలియన్‌లో పోలీసుల కుటుంబ సభ్యు లు సమస్యల పరిష్కారం కోరుతూ పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం నాడు అనూహ్యంగా రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది.

12వ బెటాలియన్‌లో అసలేం జరుగుతోంది?

పోలీస్‌ కుటుంబ సభ్యులు రోడ్డెక్కడంతో సర్వత్రా చర్చ

కొందరుకానిస్టేబుళ్లపై చర్యలు!

విచారణలో గోప్యత పాటిస్తున్న అధికారులు

(ఆంధ్రజ్యోతి,నల్లగొండ): జిల్లా కేంద్ర సమీపంలోని 12వ బెటాలియన్‌లో పోలీసుల కుటుంబ సభ్యు లు సమస్యల పరిష్కారం కోరుతూ పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవం నాడు అనూహ్యంగా రోడ్డెక్కడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రభుత్వంలోని అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు సమ్మెకు దిగే అవకాశం ఉన్నా, పోలీ్‌సశాఖలో మాత్రం ఆ అవకాశం ఉండదు. అయితే బెటాలియన్‌లో పనిచేస్తున్న పోలీసుల కుటుంబ సభ్యులు రో జులుగా ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రాస్తారో చేశారు.

నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై 12వ బెటాలియన్‌ ఎదుట పోలీస్‌ కుటుంబ సభ్యులు ఈ నెల 21న ప్లకార్డులు పట్టి ధర్నా నిర్వహించారు. సెలవుల విధానాన్ని మార్చాలని, పనిభారం తగ్గించాలని డిమాండ్‌ చేయడంతో పాటు పలు సమస్యలపై నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు. తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మాదిరిగా రాష్ట్రంలోనూ అదే తరహా వ్యవస్థను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. కొత్తగా అమలులోకి వచ్చే రికార్డు పద్ధతిని ఉపసంహరించుకోవాలని, పనిభారాన్ని 8గంటలకు తగ్గించాలని కోరారు. బెటాలియన్‌ వ్యవస్థలోనూ ఐదేళ్ల వరకు ఒకే ప్రాంతంలో పోస్టింగ్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అయితే ఇదే తరహా ఆందోళన మంగళవారం వరంగల్‌ జిల్లాలోని మామునూర్‌ 4వ బెటాలియన్‌ పోలీసు కుటుంబాలు సైతం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో రిజర్వ్‌లో ఉన్న పోలీసు కుటుంబ సభ్యుల బాధను అర్థం చేసుకోవాలన్న డిమాండ్‌ సర్వత్రా వ్యక్తమవుతోంది.

అధికారుల ఆగ్రహం

బెటాలియన్‌ కుటుంబ సభ్యులు ఆందోళన చేసిన నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆగ్రహంగా ఉన్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 12వ బెటాలియన్‌ కమాండెంట్‌ సత్య శ్రీనివా్‌సరావు ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తున్నారు. ఆందోళన వెనక కొందరు కానిస్టేబుళ్లు ఉన్నారని భావిస్తూ, వారిపై శాఖాపర చర్యలు తీసుకునేందుకు ఉపక్రమిస్తున్నట్టు సమాచారం. ఆరుగురు కానిస్టేబుళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్టు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఇంకా విచారణ సాగుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగితే కానిస్టేబుళ్లపై చర్యలు ఎలా తీసుకుంటున్నారనే ప్రశ్న వస్తోంది. బెటాలియన్‌లో పనిచేసే పోలీసులపై పనిభారం పెట్టడమేగాక, వారిని ఒత్తిడికి గురిచేసేలా చర్యలు తీసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. కొందరు పోలీసులపై విచారణ విషయమై బెటాలియన్‌ కమాండెంట్‌ సత్య శ్రీనివాసరావును ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, విచారణ నిర్వహిస్తున్నామని, విచారణ అనంతరం శాఖాపర చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉంటే బెటాలియన్‌ ఎదుట జరిగిన ఆందోళన అనంతరం, విచారణ వ్యవహారంపై అధికారులు గోప్యత పాటించడం గమనార్హం.

ఆందోళనలో ఆ ఆరుగురి కుటుంబ సభ్యులు

బెటాలియన్‌లో పనిచేసే కుటుంబ సభ్యులు తాము ఎదుర్కొంటున్న కష్టాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా పరిష్కారమవుతాయని భావించి ధర్నాకు దిగారు. తొలుత 12వ బెటాలియన్‌ ఎదుట ధర్నా అనంతరం ఇదే తరహాలో వరంగల్‌ జిల్లాలో ఆందోళన జరిగింది. దీంతో ఆగ్రహంగా ఉన్న అధికారులు ఈ ధర్నా వెనక ఆరుగురు కానిస్టేబుళ్లు ఉన్నట్లు భావిస్తున్నారు. వారిని సస్పెండ్‌ చేసేందుకు ఉత్తర్వులు రూపొందించి వారి కుటుంబ సభ్యులకు, లేదంటే వారికే నేరుగా అందజేయాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. అయితే ఈ సస్పెండ్‌ ఉత్తర్వులు నేరుగా వారికి అందించారా లేదా అనేది ఉన్నతాధికారులు ధ్రువీకరించడం లేదు. బెటాలియన్‌ కమాండెంట్‌ సత్య శ్రీనివాసరావు పూర్తి వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఆరుగురు కానిస్టేబుళ్లే కారణమని సోమవారం సాయంత్రం నుంచి వారిని టార్గెట్‌ చేసేలా ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బెటాలియన్‌లో పనిచేసే కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగితే కేవలం ఆరుగురు కుటుంబ సభ్యులను టార్గెట్‌ ఎందుకు చేశారని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరుగురు కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులతో పాటు మిగతా వారు సైతం సోమవారం అర్ధరాత్రి వరకు ఆందోళన నిర్వహించారు. ఆ రాత్రి నుంచి ఇప్పటి వరకు ఆ కానిస్టేబుళ్ల ఆచూకీ లేదని, విచారణ పేరుతో ఎక్కడికి తీసుకెళ్లారో తెలియడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులను బెటాలియన్‌ దాటకుండా కట్టడి చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

Updated Date - Oct 23 , 2024 | 12:56 AM