బీఆర్‌ఎ్‌సలో సంస్థాగతమెప్పుడో?
ABN , Publish Date - Dec 23 , 2024 | 12:57 AM
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భారతీయ రాష్ట్ర సమతి (బీఆర్‌ఎస్) ప్రయత్నాలు ప్రారంభించింది.
జిల్లా అధ్యక్షుల ప్రకటనతోనే సరి
కార్యవర్గంతో పాటు అనుబంధ కమిటీలు నియమించని వైనం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పూర్తిస్థాయి కమిటీలు ఏర్పడేనా?
(ఆంధ్రజ్యోతి, యాదాద్రి): స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటాలని భారతీయ రాష్ట్ర సమతి (బీఆర్‌ఎస్) ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగా పార్టీ సంస్థాగత ఎన్నికలపై అధిష్ఠానం దృష్టిసారించి జిల్లా, అనుబంధ కమిటీలు నియమించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.
టీఆర్‌ఎ్‌సగా ఉన్నప్పుడు 2014కు ముందు పార్టీ సంస్థాగతంగా కీలకంగా వ్యవహరించి, ఎప్పటికప్పుడు పదవులు కేటాయిస్తూ, పర్యవేక్షిస్తూ ఉండేది. జిల్లా కమిటీలు బలోపేతంపై నిరంతరం అధ్యయనం చేసేది. అయితే అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యేలకు పూర్తి అధికారాలు బదలాయించి, ఇప్పటివరకు సంస్థాగతంగా జిల్లా కమిటీలను ఏర్పాటు చేయలేదు. బీఆర్‌ఎస్ అధికారాన్ని కోల్పోయి ఏడాది గడిచింది. ఈ నేపథ్యంలో సంస్థాగత ఎన్నికలపై పార్టీ అధిష్ఠానం దృష్టిసారించి జిల్లా, అనుబంధ కమిటీలు నియమించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతం చేసే దిశగా పార్టీ అడుగులు వేస్తోంది.
జిల్లా అధ్యక్షులతోనే సరి
టీఆర్‌ఎ్‌సను భారతీయ రాష్ట్ర సమితీ (బీఆర్‌ఎ్‌స)గా మారుస్తూ, జాతీయ రాజకీయాల్లోకి పార్టీ అరగేంట్రం చేసింది. జాతీయ పార్టీగా ఆవిర్భవించిన అనంతరం సంస్థాగత పదవులపై బీఆర్‌ఎస్ నేతల్లో ఆశలు రేకెత్తాయి. 2022 జనవరి 26న అధిష్ఠానం 33 జిల్లాలకు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. యాదాద్రి జిల్లా అధ్యక్షుడిగా కంచర్ల రామకృష్ణారెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా దేవేరకొండ నాటి ఎమ్మెల్యే రవీంద్రనాయక్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా నాటి రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ను అధిష్ఠానం పార్టీ నియమించింది. అయితే జిల్లా అధ్యక్షులకే పరిమితం చేసిన అధిష్ఠానం జిల్లా, పార్టీ అనుబంధ సంఘాలకు పూర్తిస్థాయి కార్యవర్గాన్ని నియమించలేదు. మూడేళ్లుగా సంస్థాగత పదవుల కోసం పార్టీ నాయకులు ఎదురుచూస్తున్నారు.
రాష్ట్రస్థాయిలోనూ పాత కార్యవర్గమే
పార్టీ అధిష్ఠానం 2017లో అప్పటి టీఆర్‌ఎస్ మహాసభల్లో ప్రకటించిన రాష్ట్ర కార్యవర్గమే నేటికీ కొనసాగుతోంది. పార్టీ బీఆర్‌ఎ్‌సగా మారినా రాష్ట్ర కార్యవర్గాన్ని ఏర్పాటుచేయలేదు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో నూతన కార్యవర్గాల ఏర్పాటుపై పార్టీ నేతల్లో జోరుగా చర్చ జరుగుతోం ది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో అధిష్ఠానం సంస్థాగతంగా నూతన కమిటీలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. బీఆర్‌ఎస్ 2021 సెప్టెంబరు 2 నుంచి సంస్థాగత ఎన్నికలు నిర్వహించింది. సెప్టెంబరు 2 నుం చి 12వ తేదీ వరకు 15మంది సభ్యులతో గ్రామస్థాయిలో ప్రధా న కమిటీలు ఏర్పాటు చేసింది. ప్రతీ గ్రామంలో విద్యార్థి, యువజన, మహిళ, కార్మిక, తదితర 14 అనుబంధ సంఘాలను నియమించింది. 13 నుంచి 20వ తేదీ వరకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసింది. 2022 జనవరి 26న ముఖ్యమంత్రి పార్టీ జిల్లా అధ్యక్షులను ప్రకటించారు. అయితే నాటి నుంచి ఇప్పటివరకు కార్యవర్గాలను, పార్టీ అనుబంధ కమిటీలను నియమించలేదు. ప్రస్తుతం స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో పార్టీ సంస్థాగతంగా పదవులను భర్తీ చేసే ఆలోచనలో ఉన్నట్టు స్థానికంగా నేతల్లో జోరుగా చర్చ సాగుతోంది.
పునరుద్ధరణకు నోచుకోని కమిటీలు
జిల్లాల్లో అన్ని రాజకీయ పార్టీలకు సంస్థాగతంగా కమిటీలు ఉన్నాయి. ఏడేళ్ల క్రితం టీఆర్‌ఎస్ అధిష్ఠానం జిల్లా కమిటీలను రద్దు చేసింది. పార్లమెంట్ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర కార్యదర్శులకు పార్టీ వ్యవహారాలను అప్పగించింది. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా తీసుకునే కీలక నిర్ణయాలపై సర్వ అధికారాలు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలకు అప్పగించింది. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో పొసగని పలువురు సీనియర్ నేతలు కొంతకాలంగా రాజకీయపరంగా నిశ్శబ్దంగా ఉన్నారు. జిల్లాలో నియోజకవర్గాల్లో నిర్వహించే పలు పార్టీ కార్యక్రమాలకు హాజరవుతూ, పార్టీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న ద్వితీయ శ్రేణి నేతలకు రాజకీయంగా తీసుకునే నిర్ణయాల్లో అవకాశం కల్పించకపోవడంతో, వారు ఎదగలేకపోయారని అధిష్ఠానం గ్రహించింది. పార్టీలో సంస్థాగతంగా ఉన్న విభేదాలు సమసిపోవాలంటే పార్టీని జిల్లా కమిటీలకే అప్పగించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో సంస్థాగతంగా జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామ కమిటీలను పునురుద్ధరించనున్నట్టు గతంలోనే బీఆర్‌ఎస్ ప్రకటించింది. సంస్థాగతంగా పార్టీ తరపున తీసుకునే నిర్ణయాలు, కార్యకలాపాలు కూడా జిల్లా కమిటీలకే పూర్తి బాధ్యత ఇచ్చింది. జిల్లాస్థాయిలో ఏర్పాటుచేసిన కమిటీలు అధిష్ఠానం సూచన మేరకు పనిచేస్తాయని, స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీల ఒత్తిడి, పెత్తనం ఉండదని గతంలో పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. జిల్లాలో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన సీనియర్ నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు జిల్లా అధ్యక్షులుగా అధిష్ఠానం ప్రకటించింది. అయితే కార్యవర్గం లేకుండానే సుమారు రెండేళ్లుగా ఏకపక్షంగా అధ్యక్షుడు, మండల కమిటీలతోనే పార్టీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
అనుబంధ కమిటీలు ప్రకటించని వైనం
బీఆర్‌ఎస్ 2022 జనవరి 26న జిల్లా అధ్యక్షులను ప్రకటించింది. జిల్లా అధ్యక్షుల నియామకాలను సైతం చాలా కాలం వాయిదా వేసి జనవరి 26న పార్టీ అధినేత కేసీఆర్ ఎట్టకేలకు 33 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించారు. ఆ తర్వాత పూర్తిస్థాయి కార్యవర్గం లేదు. పార్టీ జిల్లా అధ్యక్షులు బాధ్యతలు తీసుకున్న అనంతరం పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తున్న పలు సందర్భాల్లో జిల్లా కార్యవర్గాన్ని పూర్తిస్థాయిలో నియమించాలని, లేనిపక్షంలో కనీసం పార్టీ అనుబంధ జిల్లా అధ్యక్షులను ప్రకటించాలని అధినేతను కోరారు. అయితే అధిష్టానం మాత్రం ఇంతకాలం జిల్లా అధ్యక్షుడితోనే నెట్టుకొని వచ్చింది. బీఆర్‌ఎ్‌సగా అవతరించిన అనంతరం కూడా సంస్థాగత పదవులు పొందలేకపోయామని ఇంతకాలం పార్టీలో ఉన్న నేతల్లో అసంతృప్తి ఉంది. అయితే త్వరలోనే పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ నిర్ణయించినట్టు తెలిసింది.