Share News

బేగంపేట బెంగ తీర్చేదెవరు?

ABN , Publish Date - Oct 28 , 2024 | 12:35 AM

రాజాపేట మండలంలోని బేగంపేట వాగు ప్రవహిస్తుడంతో రాజాపేట- బేగంపేట రోడ్డు కొట్టుకుపోయింది.

బేగంపేట బెంగ తీర్చేదెవరు?

రాజాపేట, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి) ః రాజాపేట మండలంలోని బేగంపేట వాగు ప్రవహిస్తుడంతో రాజాపేట- బేగంపేట రోడ్డు కొట్టుకుపోయింది. ప్రయాణికులకు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. మండలంలోని బేగంపేట గ్రామానికి రాజాపేట మండ కేంద్రానికి రోడ్డు మార్గం లేకుండా పోయింది. బేగంపేట గ్రామస్థులు, ఏ చిన్న పనికి అయినా రాజాపేటకు రావాల్సిందే. గత నెల 24వ తేదీన మల్లన్నసాగర్‌ నుంచి గోదావరి నీళ్లు గంధమల్ల చెరువుకు రావడంతో గంధమల్ల చెరువు నిండి బేగంపేట వాగు ద్వారా నీరు కింది ప్రాంతానికి ప్రవహిస్తోంది. బేగంపేటవాగుపై వంతెన నిర్మాణం జరగుతుండటంతో తాత్కాలికంగా వేసిన రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో రాజాపేట- బేగంపేట గ్రామాల మధ్య, రవాణా సౌకర్యం నిలిచిపోయింది. నిత్యం రాజాపేట నుంచి రేణుగుంట బేగంపేట మీదుగా తుర్కపల్లి, బొమ్మలరామారం, కీసర, సికింద్రాబాద్‌లకు వందల సంఖ్యల్లో ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు. రవాణా మార్గం లేకపోవడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోంది. బేగంపేట నుంచి రాజాపేటకు ఐదు కిలోమీటర్ల దూరం ఉండగా బేగంపేట గ్రామస్థులు గంధమల్ల మీదుగా రాజాపేటకు రావాల్సి వస్తోంది. అదనంగా 5 కిలోమీటర్ల దూరం తిరగాల్సివస్తోంది. గోదావరి జలా లు గుండాల, మోత్కూర్‌ పాంత్రాల్లోని చెరువులను నింపేందుకు వదులుతుండటంతో మరికొన్ని రోజులు గ్రామస్థులకు బాధలు తప్పడం లేదు. బేగంపేట వాగుల్లో తాత్కాలిక రోడ్డు వేసి సమస్యను తీర్చాలని గ్రామస్థులు కోరుతున్నారు. కాగా ఈ విషయమై ఆర్‌అండ్‌బీ రాజాపేట ఇనచార్జి ఏఈ భరత మాట్లాడుతూ తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. రెండుమూడు రోజుల్లో వరద ఉధృతి తగ్గుతుందని తెలిపారు. తగ్గాక తాత్కాలిక రోడ్డును ఏర్పాటు చేస్తామని, డిసెంబరు కల్లా వంతెన పనులు పూర్తి అవుతాయని పేర్కొన్నారు.

రాకపోకలు నిలిచాయి

రాజాపేట నుంచి తుర్కపల్లి, సికింద్రాబాద్‌, కుషాయిగూడ వివిధ అవసరాలకు వెళుతుంటాం. ఇతర వాహనాలు, రోజు ఆరుకు పైగా బస్సుల్లో ప్రయాణికులు వెళ్లేవారు. గంధమల్ల చెరువు నిండి అలుగు పోయడంతో బేగంపేట వాగుపై రోడ్డు కొట్టుకుపోయి, రవాణా సౌకర్యం నిల్చిపోయింది. అధికారులు వెంటనే వంతెన పనులు పూర్తి చేయాలి.

-బొంగొని ఉప్పలయ్య, మాజీ సర్పంచ నర్సాపూర్‌

Updated Date - Oct 28 , 2024 | 12:35 AM