Share News

కనుమురుగయ్యేనా?

ABN , Publish Date - Oct 02 , 2024 | 12:30 AM

మంజూరైనా నిధులు చాలక, అదనపు నిధులు రాక, కాంట్రాక్టర్లు పనులు చేయక..ఏళ్ల తరబడి మునిసిపాలిటీల్లో అ రకొరగా సాగిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి.

కనుమురుగయ్యేనా?

అమృత్‌-2 కింద ఉమ్మడి జిల్లాలో మూడు మునిసిపాలిటీలు

యూజీడీలకు రూ.706.03కోట్లు మంజూరు

నిధులు చాలక, కాంట్రాక్టర్‌ చేయక మూలనపడ్డ పనులు

మిర్యాలగూడ, అక్టోబరు 1: మంజూరైనా నిధులు చాలక, అదనపు నిధులు రాక, కాంట్రాక్టర్లు పనులు చేయక..ఏళ్ల తరబడి మునిసిపాలిటీల్లో అ రకొరగా సాగిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు ఎట్టకేలకు ఊపందుకున్నాయి. పారిశ్రామికంగా పురోగమిస్తున్న మిర్యాలగూడ మునిసిపాలిటీలో పారిశుధ్యం, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని అం డర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు 2007లో యూజీడీ పనులు చేపట్టారు. అందుకు ప్రభుత్వం రూ.45.51 కోట్లు మంజూరు చేయగా, రాంకీ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది. ప్రతిపాదిత నిఽధులు సరిపోవడం లేదని సదరు సంస్థ పనులను మధ్యలోనే వదిలేయడంతో మరో సంస్థకు అప్పగించారు. 2014లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులకు రెండోసారి టెండర్‌ పిలవగా కృషి ఇన్‌ఫ్రా టెండర్‌ను దక్కించుకుంది. రూ.33.1కోట్ల పనులకు ప్రభుత్వం అనుమతించినా బడ్జెట్‌లో నిధులు కేటాయించకపోవడంతో పనులు నత్తనడకన సాగుతూ వచ్చాయి. ఏళ్ల తరబడి పనులు చేపట్టకపోవడంతో తొలుత ఏర్పాటు చేసిన పైప్‌లైన్లలో బురద, చెత్త పేరుకుపోయి మరమ్మతులకూ సాధ్యపడనంతగా మారా యి. 17ఏళ్లుగా నత్తనడకన సాగిన యూజీడీ పనులకు కేంద్ర ప్రభు త్వం అమృత్‌-2 పథకంలో భాగంగ ా మిర్యాలగూడ, నల్లగొండ, సూర్యాపేట మునిసిపాలిటీలకు నిధులు విడుదల చేసింది.దీంతో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు చురుకుగా సాగుతున్నాయి.

మిర్యాలగూడకు రూ.173.07కోట్లు

మిర్యాలగూడ మునిసిపాలిటీలో చేపట్టిన అండర్‌గ్రౌండ్‌ డైనేజీ నిర్మాణ పనులకు అమృత్‌-2లో రూ.173.7కోట్లు మంజూరయ్యాయి. గతంలో చేసిన పనులను అనుసంధానం చేస్తూ నూతనంగా పైప్‌లైన్లు, ఛాంబర్లు, లింకులు, ఎస్టీపీల నిర్మాణ పనులు చేపడుతున్నారు. 26కిలోమీటర్ల మేర పూడిన పాత పైప్‌లైన్లు, 14,000 జంక్షన్‌లు, 91కిలోమీటర్ల పైప్‌లైన్‌ క్లీనింగ్‌, 2,300 మ్యాన్‌హోల్స్‌ మరమ్మతుల పనులు చేపడుతున్నారు. వీటితో పాటు 110 కిలోమీటర్ల కొత్త పైప్‌లైన్‌ నిర్మాణం, 4,400 మ్యాన్‌హోల్స్‌, 18,333 జంక్షన్‌ ఛాంబర్లు, వాటర్‌ సీనరేజ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు మురుగు కష్టాలు తొలగించేందుకు పనులు ముమ్మరం చేశారు.

నల్లగొండకు రూ.216.19కోట్లు, సూర్యాపేటకు రూ.316.77కోట్లు

నల్లగొండ పురపాలికలో రూ.216.19కోట్లతో 55 కిలోమీటర్ల పాత పైప్‌లైన్‌, 2,000 మ్యాన్‌హోల్స్‌, 96కిలోమీటర్ల పైప్‌లైన్‌ క్లీనింగ్‌ పనులతో పాటు 130కిలోమీటర్లు నూతన పైప్‌లైన్‌ ఏర్పాటు చే యనున్నారు. 24,375 జంక్షన్‌ ఛాంబర్లు, 5,200 మ్యాన్‌హోల్స్‌, 3.8 ఎంఎల్‌డీ సామర్ధ్యం ఉన్న ఎస్టీపీని నిర్మించనున్నారు. సూర్యాపేట మునిసిపాలిటీలో గతంలో టీయూఎ్‌ఫఐడీ పథకం కింద రూ.140కోట్లతో సొరంగ మురుగుకాల్వల నిర్మా ణం చేపట్టగా, 50 శాతానికి పైగా పనులు పూర్తిచేసినట్లు సమాచారం. తిరిగి అమృత్‌ పథకం కింద రూ.316.77కోట్లు మంజూరు చేయడంతో 290కిలోమీటర్ల పొడవున పైప్‌లైన్ల నిర్మాణం, 11, 600 మ్యాన్‌హోల్స్‌, 18,125 ఛాంబర్లు, 54,000 జంక్షన్‌ ఛాంబర్స్‌ ఏర్పాటు చేయనున్నారు. అయి తే ఈ పనులను రెండేళ్లలో పూర్తిచేయాల్సి ఉం ది. ఉమ్మడి జిల్లాలోని మూడు మునిపాలిటీల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను కేఎన్‌ఆర్‌ సంస్థ దక్కించుకొని గత నెలలో యూజీడీ నిర్మాణ పనులు ప్రారంభించింది.

అమృత్‌-2లో పట్టణ ప్రజారోగ్యానికి ప్రాధాన్యం : కందుకూరి వెంకటేశ్వర్లు ఎస్‌ఈ, పబ్లిక్‌ హెల్త్‌

అమృత్‌-2లో పట్టణ ప్రజారోగ్యానికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. ప్రజారోగ్యశాఖ ఆధ్వర్యం లో పూర్వ నల్లగొండ జిల్లాలో మూడు మునిసిపాలిటీలో చేపట్టిన యూజీడీ పనులు రెండేళ్లలో పూర్తయ్యేలా సాగుతున్నాయి. మునిసిపాలిటీలపై భారం పడకుండా ఐదేళ్ల పాటు ప్రజారోగ్యశాఖనే యూజీడీల నిర్వహణ చేపడుతుంది.

Updated Date - Oct 02 , 2024 | 12:30 AM