పురుగుమందుల జీరో దందా
ABN , Publish Date - Nov 02 , 2024 | 01:21 AM
హుజూర్‌నగర్ కేంద్రంగా పురుగు మందుల జీరో దందా జోరుగా సాగుతోంది. దుకాణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఆంధ్రా నుంచి సరిహద్దులు దాటి పురుగు మందులు పట్టణానికి చేరుతున్నాయి.
ఆంధ్రా నుంచి సరఫరా
హుజూర్‌నగర్ కేంద్రంగా జోరుగా వ్యవహారం
వ్యవసాయాధికారుల నామమాత్రపు దాడులు
ఇలా వచ్చి అలా వెళ్లిన అధికారులు
(ఆంధ్రజ్యోతి,హుజూర్‌నగర్): హుజూర్‌నగర్ కేంద్రంగా పురుగు మందుల జీరో దందా జోరుగా సాగుతోంది. దుకాణదారులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఆంధ్రా నుంచి సరిహద్దులు దాటి పురుగు మందులు పట్టణానికి చేరుతున్నాయి. ఏటా కోట్ల రూపాయల విలువైన పురుగుమందుల జీరో దందా సాగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కీలక కంపెనీల పురుగు మందులు బిల్లులు లేకుండా విక్రయిస్తూ జీరో దందా నిర్వహిస్తున్నారు. గతంలో హుజూర్‌నగర్ పట్టణంలో కొంతమంది దుకాణదారులు ఈ జీరో దందాను నిర్వహించగా అధికారుల తనిఖీలో సరుకు పట్టుబడింది. పట్టణంలో పేరు మోసిన నలుగురు వ్యక్తులు వ్యవసాయశాఖను గుప్పెట్లో పెట్టుకుని జీరో దందాను సాగిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పలు ప్రాంతాల నుంచి పురుగు మందులు బిల్లులు లేకుండా తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారని సమాచారం. వీటితో పాటు ఆంధ్రా ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పురుగు మందులు తీసుకొచ్చి విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఏటా హుజూర్‌నగర్ ప్రాంతంలో సుమారు రూ.6కోట్లమేర జీరో దందా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా దుకాణదారులు, డీలర్ల మాత్రం ఈ దందాను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. హుజూర్‌నగర్ కేంద్రంగా డీలర్లు నిర్వహిస్తున్న ఈ జీరో దందా కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకూ పాకింది. జిల్లా ఉన్నతాధికారుల సహకారంతోనే పురుగు మందులను అక్రమంగా నిల్వచేసి రైతులకు అంటగడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. జీరో దందాతో పాటు ఆంధ్రా ప్రాంతం నుంచి నకిలీ మందులు కూడా తెచ్చి విక్రయిస్తున్నట్టు సమాచారం. కృష్ణానది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల నుంచి నకిలీ మందులు తీసుకొని వ్యాపారులు రైతులకు విక్రయిస్తున్నట్టు తెలిసింది.
జిల్లాలో 600 దుకాణాలు
జిల్లాలో సుమారు 600 ఫర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణా లు ఉన్నాయి. 60వేల టన్నుల యూరియా, లక్షన్నర టన్నుల కాంప్లెక్స్ ఎరువులు వీటి ద్వారా విక్రయిస్తున్నారు. ఏటా జిల్లాలో రూ.200 కోట్లకు పైగా వ్యాపారం సాగుతోం ది. అయితే జిల్లాలోని పలు పట్టణాల్లో జీరో దందా పెద్ద మొత్తంలో కూడా నడుస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి ఈ నకిలీ, బిల్లులు లేని మందులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి హుజూర్‌నగర్, కోదాడ మీదుగా జిల్లా వ్యాప్తంగా చేరుస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రా ప్రాంతం నుంచి అక్రమంగా తరలిస్తున్న వీటిని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు విక్రయిస్తున్నారు. ఓ వైపు జీరో దందా, మరోవైపు నకిలీ పురుగు మందులతో రైతులు నష్టపోతున్నారు. వ్యవసాయాధికారు లు నకిలీలను, జీరో దందాను అరికట్టడంలో నిర్లక్ష్యం చూపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పట్టించుకోని అధికారులు
హుజూర్‌నగర్ పట్టణంలోని కొంతమంది దుకాణదారు లు, డీలర్లు నకిలీ, జీరో దందా జోరుగా నడిపిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. కొంతకాలంగా ఈ దందా సాగుతున్నట్టు విమర్శలు రాగా, శుక్రవారం పట్టణంలోని ఒక దుకాణానికి సంబంధించిన గోదాంను వ్యవసాయశాఖ అధికారులు తనిఖీచేశారు. పట్టణంలో నకిలీ పురుగు మం దులు విక్రయిస్తున్నట్టు కొంతమైంది రైతులు సమాచారం ఇవ్వగా వ్యవసాయాధికారులు గోదాంలో తనిఖీలు నిర్వహించారు. అయితే వారు నామమాత్రంగా స్టాక్‌ను పరిశీలించి వెళ్లారనే ఆరోపణలు ఉన్నాయి. అసలు గోదాంలో ఏ కంపెనీకి చెందిన ఎన్ని పురుమందుల స్టాక్ ఉంది, దానికి సంబంధించిన బిల్లులను నామమాత్రంగా పరిశీలించినట్టు సమాచారం. తనిఖీ వివరాలను వ్యవసాయాధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని మరో నాలుగు దుకాణల్లో కూడా జీరోదందా, నకిలీ పురుగు మందులను స్టాక్ చేసినట్టు విమర్శలు ఉన్నాయి. ఇదిలా ఉండగా, పట్టణంలోని ఎరువుల గోదాంలో శుక్రవారం తనిఖీలు నిర్వహించనట్టు ఏడీఏ రమావత్ రవీందర్, ఏవో స్వర్ణ తెలిపారు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గోదాంను పరిశీలించామని, స్టాక్ వివరాలు త్వరలో తెలియజేస్తామని, గోదాంకు అనుమతి ఉందని తెలిపారు. స్టాక్ వివరాలు లెక్కించాల్సి ఉందని, ఏ కంపెనీకి చెందిన స్టాక్ ఎంత అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉందని వారు తెలిపారు.
నకిలీ మందులు విక్రయిస్తే చర్యలు :శ్రీధర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
జీరో, నకిలీ పురుగు మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. వ్యవసాయాధికారులు ఇచ్చే సలహాలు, సూచనల ప్రకారం రైతులు పురుగు మందులు కొనుగోలు చేయాలి. డీలర్ల స్వతహాయా ఇష్టానుసారంగా రైతులకు పురుగు మందులు విక్రయించవద్దు. అధికారుల సూచనల మేరకే విక్రయించాలి. జీరో దందాపై నిఘా ఉంచాం. పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటాం.