Share News

Sundilla: సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు!

ABN , Publish Date - Aug 24 , 2024 | 04:02 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని, కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) మాజీ ఎస్‌ఈ మహ్మద్‌ అబ్దుల్‌ ఫజల్‌ తెలిపారు.

Sundilla: సుందిళ్ల నిర్మాణ స్థలాన్ని పరిశీలించలేదు!

  • సీఈ సమాచారం ఆధారంగా డిజైన్లు/డ్రాయింగ్‌లు

  • ఎన్‌ఐటీ నివేదిక మేరకే సీకెంట్‌పైల్స్‌

  • కాళేశ్వరం కమిషన్‌కు తెలిపిన

  • మాజీ ఎస్‌ఈ మహ్మద్‌ అబ్దుల్‌ ఫజల్‌

హైదరాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సుందిళ్ల బ్యారేజీ కట్టిన స్థలాన్ని తాము పరిశీలించలేదని, కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ (సీఈ) నల్లా వెంకటేశ్వర్లు ఇచ్చిన సమగ్ర సమాచారం ఆధారంగా డిజైన్లు సిద్ధం చేశామని నీటిపారుదల శాఖలోని సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌(సీడీవో) మాజీ ఎస్‌ఈ మహ్మద్‌ అబ్దుల్‌ ఫజల్‌ తెలిపారు. శుక్రవారం కాళేశ్వరం విచారణ కమిషన్‌ నిర్వహించిన ఓపెన్‌కోర్టులో ఆయన విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం చీఫ్‌ ఇంజనీర్‌ (రామగుండం) సాంకేతిక అనుమతి, హైపవర్‌ కమిటీ సిఫారసుల ప్రకారం సుందిళ్ల బ్యారేజీ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. వరంగల్‌ ఎన్‌ఐటీ జియో టెక్నికల్‌ నివేదిక ఆధారంగా షీట్‌పైల్స్‌ ప్రతిపాదన పక్కనపెట్టి, సీకెంట్‌ పైల్స్‌ను సుందిళ్ల నిర్మాణంలో వినియోగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. బ్యారేజీకి అదనపు వెంట్‌లపై నిర్ణయం తీసుకున్నది ఎవరని కమిషన్‌ ఆరా తీయగా.. బ్యారేజీకి 58 గేట్లతో పాటు 10 స్లూయి్‌సల కోసం మాత్రమే తాము డిజైన్లు/డ్రాయింగ్‌లు చేశామని బదులిచ్చారు. అదనపు వెంట్‌ ప్రతిపాదన కానీ, దానికి డిజైన్లు సిద్ధం చేయాలనే ఫైలు ఏదీ కూడా తమకు రాలేదని, అదనపు వెంట్‌ నిర్మాణంపై నిర్ణయం క్షేత్రస్థాయిలోని అధికారులే తీసుకున్నారన్నారు. 2డీ నమూనా అధ్యయనాల ఆధారంగానే బ్యారేజీ డిజైన్లు/డ్రాయింగ్‌లు సిద్ధం చేశామని చెప్పారు. డిజైన్లు, నిర్మాణానికి సంబంధం లేదన్నారు. డిజైన్లు చేయడానికే సీడీవో విభాగం పరిమితమవుతుందని, నిర్మాణంలో నిర్ణయాలన్నీ క్షేత్రస్థాయి అధికార వ్యవస్థలవేనని తెలిపారు.


హరిరామ్‌ లేఖను అందించిన మాజీ ఈఎన్‌సీ

కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ)కి డిజైన్లను పంపించే ముందు కాళేశ్వరం డీపీఆర్‌లోని చెక్‌ లిస్ట్‌లోని హైడ్రాలజీ, ఇన్వెస్టిగేషన్లకు సంబంధించిన అంశాల బాధ్యత తనదేనని కాళేశ్వరం(హైదరాబాద్‌) సీఈ బి.హరిరామ్‌ 2017 ఫిబ్రవరి 20న రాసిన లేఖను శుక్రవారం కాళేశ్వరం కమిషన్‌కు మాజీ ఈఎన్‌సీ (సీడీవో) ఎ.నరేందర్‌రెడ్డి అందించారు. గురువారం విచారణ క్రమంలో మిగిలిపోయిన కొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని శుక్రవారం కమిషన్‌కు అందజేశారు. గేట్లను మెకానికల్‌గా 2 మీటర్లకు మించి లేపడానికి వీల్లేదనే సమాచారం నిజమేనా అని కమిషన్‌ కోరగా ఆ సమాచారానికి సంబంధించిన పత్రాలు కూడా ఇచ్చారు. కాగా, తదుపరి విచారణ ప్రక్రియ ఈ నెల 27న జరగనుంది.

Updated Date - Aug 24 , 2024 | 04:02 AM