111 GO: శివార్లలో హైడ్రా అలజడి!
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:58 AM
ఒకప్పుడు 111జీవో పరిధిలో ఉండి.. గత ప్రభుత్వ హయాంలో ఆంక్షలు తొలగించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది.
111 జీవో పరిధిలో విస్తరించే యోచనలో ప్రభుత్వం!..
జీవో రద్దుతో ఆ గ్రామాల్లో భూములకు పెరిగిన ధరలు
హైడ్రా పరిధిలోకి వస్తే మళ్లీ ఏం జరుగుతుందోనని ఆందోళన
స్థానిక ఎన్నికల్లో తమకు నష్టమేనంటున్న కాంగ్రెస్ నేతలు
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి)
ఒకప్పుడు 111జీవో పరిధిలో ఉండి.. గత ప్రభుత్వ హయాంలో ఆంక్షలు తొలగించిన గ్రామాల్లో ఇప్పుడు కొత్త ఆందోళన మొదలైంది. హైదరాబాద్‌లో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను.. గతంలో 111జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు కూడా విస్తరింపజేయనుందన్న ప్రచారమే ఈ ఆందోళనకు కారణం. హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జంట జలాశయాల పరివాహక ప్రాంతాల్లోని 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ 111జీవోను తీసుకువచ్చింది. దీంతో ఆ గ్రామాలన్నీ బఫర్ జోన్ కిందికి వెళ్లాయి. అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దీనిని రద్దు చేయడంతో ఆ గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఆ ప్రాంతాల్లో భూముల ధరలు కూడా పెరిగాయి. కానీ, జంట జలాశయాల పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, ఇందుకు సంబంధించిన మాస్టర్ ప్లాన్ కూడా విడుదల చేస్తామని చెప్పిన అప్పటి ప్రభుత్వం.. ఆ తరువాత దానిని పట్టించుకోలేదు. దీంతో ఆ ప్రాంతాల్లో భూముల క్రయ విక్రయాలు జరగడంతోపాటు అక్కడక్కడ నిర్మాణాలు కూడా వచ్చాయి. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ ప్రాంతాలపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో గత ప్రభుత్వ విధానాన్నే కొనసాగిస్తుందని అందరూ భావించారు.
అయితే.. చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకంటూ ప్రభుత్వం ఇటీవల హైడ్రాను ఏర్పాటు చేసింది. జీహెచ్‌ఎంసీతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాలను కలిపి తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (టీసీయూఆర్)గా పేర్కొంటూ.. వీటిని హైడ్రా పరిధిలోకి తీసుకువచ్చింది. ఆయా ప్రాంతాల్లోని చెరువులు, నాలాలు, పార్కులు, లే అవుట్‌లోని ఓపెన్ స్పేస్‌లు, ఆట స్థలాలు, రహదారులు, ఫుట్‌పాత్‌ల పరిరక్షణ, వాటిలోని ఆక్రమణల తొలగింపు బాధ్యతలను హైడ్రాకు అప్పగిస్తూ జీవో తీసుకువచ్చింది. సమర్థులైన అధికారులను నియమించింది.
ఆందోళనలో 84 గ్రామాల ప్రజలు
హైడ్రా అధికారులు వెంటనే రంగంలోకి దిగి ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు, పార్కుల్లో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తూ అక్రమార్కులకు దడ పుట్టిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హైడ్రా పరిధిని గతంలో 111జీవో పరిధిలో ఉన్న గ్రామాలకు విస్తరించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్న ప్రచారం.. 84 గ్రామాల ప్రజలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రాంతాలను హైడ్రా పరిధిలోకి తెస్తే.. ప్రస్తుతం అక్కడ ఏర్పాటైన నిర్మాణాలను ఏం చేస్తారనే దానిపై స్పష్టత లేదు. ఇటీవల ఈ ప్రాంతాల్లో పర్యావరణవేత్తల బృందం పర్యటనకు వస్తే కూడా స్థానికులు అడ్డుకున్నారు. పక్కనే ఉన్న మోకిల గ్రామంలో ఎకరా భూమి ధర రూ.20కోట్లు పలుకుతుంటే తమ గ్రామాల్లో భూములకు అందులో పదిశాతం ధర కూడా రావడం లేదని వాపోయారు. ‘‘మా జీవితాలు బాగుపడవద్దా? మా పిల్లలు ఉన్నత చదువులు చదువుకోకూడదనుకుంటున్నారా?’’ అంటూ స్థానికులు ప్రశ్నించడంతో పర్యావరణవేత్తలు వెనుదిరిగారు.
ప్రతిపక్షాలకు అస్త్రమవుతుందా?
ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న 45 గ్రామాలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదనపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై ఇప్పటికే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తాజాగా హైడ్రాను 111జీవో పరిధిలోని గ్రామాలకు విస్తరిస్తారనే ప్రచారంతో అలజడి రేగుతోంది. మరోవైపు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో రాజకీయంగా తమకు తీవ్ర నష్టం జరుగుతుందని అధికార పార్టీ నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సర్కారు నిర్ణయాలు తమ పార్టీకి తీరని నష్టం చేస్తాయని చెబుతున్నారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలు వీటిని ప్రచార అస్త్రాలుగా మలుచుకుంటే.. సర్పంచులను గెలిపించుకోవడం కష్టమవుతుందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత ఒకరు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలకు ముందు ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీకే నష్టమన్నారు. ఇప్పుడిప్పుడే 111జీవో పరిధిలోని ప్రాంతాల్లో ఽభూముల ధరలు పెరిగాయని, మళ్లీ ఇదేమిటని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారని ఆయన వాపోయారు. దీనికితోడు శివారు గ్రామాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమాలను చేపట్టేందుకు బీఆర్‌ఎస్ సమాయాత్తమవుతోంది. 111జీవో పరిధి గ్రామాల్లోకి హైడ్రాను తేవడంపైనా ఆందోళన చేయాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.