Share News

Palla Rajeswar Reddy: రేవంత్ ఇచ్చిన హామీలు కొండంత.. అమలు చేస్తున్నవి రవ్వంత

ABN , Publish Date - Aug 22 , 2024 | 01:21 PM

ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. ఆదాని అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు దిగితే.. రైతుల రుణమాఫీ విషయమై బీఆర్ఎస్ ధర్నాలు చేస్తోంది.

Palla Rajeswar Reddy: రేవంత్ ఇచ్చిన హామీలు కొండంత.. అమలు చేస్తున్నవి రవ్వంత

సిద్దిపేట: ఇవాళ అధికార కాంగ్రెస్ పార్టీ, విపక్ష బీఆర్ఎస్ పార్టీలు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నాయి. ఆదాని అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ ధర్నాలకు దిగితే.. రైతుల రుణమాఫీ విషయమై బీఆర్ఎస్ ధర్నాలు చేస్తోంది. రైతులకు షరతులు లేకుండా పంట రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేర్యాల మండల కేంద్రంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో చేర్యాల, మద్దూర్, కొమురవెళ్లి, దూల్మిట్ట మండలాల బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ దొంగ మాటలను గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులే నమ్మని పరిస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు 2లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీతో పలు సభల్లో హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. కేసీఆర్ 1లక్ష రూపాయలే రుణమాఫీ చేస్తే.. 18వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయని... కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేస్తే 18వేల కోట్లు ఖర్చు కూడా కాలేదని పల్లా రాజేశ్వరరెడ్డి పేర్కొన్నారు.


ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు కొండంత అని.. అమలు చేస్తున్నవి రవ్వంత అని ఎద్దేవా చేశారు.. పూటకో మాట చెబుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారని విమర్శించారు. నేటికీ హరీష్ రాజీనామాపై ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని... దేవుళ్ళ సాక్షిగా ప్రమాణాలు చేసి దేవుళ్లను సైతం మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డికి దక్కుతుందన్నారు. మొదట రుణమాఫీకి 48వేల కోట్లు ఖర్చు అవుతాయని చెప్పి.. మరోసారి 31వేల కోట్లు చేస్తున్నాం అని చెప్పి.. 17వేల కోట్ల రుణమాఫీ చేసినం అని గొప్పలు చెప్పుకుంటున్నారని పల్లా రాజేశ్వర రెడ్డి పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు పక్కనబెట్టి తిట్ల పురాణం అందుకున్నారని విమర్శించారు. భట్టి విక్రమార్క బ్యాంకర్లతో జరిపిన మీటింగులో 17వేల కోట్లు బ్యాంకులకు పంపిస్తే కేవలం 7500 కోట్లు రుణమాఫీ చేసినం అని చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు రుణమాఫీ చేసేందుకు అడ్డురాని ఆంక్షలు సన్నకారు రైతులకు రుణమాఫీ చేసేందుకు అడ్డు వస్తున్నాయా? అని నిలదీశారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఏ గ్రామంలోనూ 30శాతంకి పైగా రుణమాఫీ కాలేదన్నారు. ఏ గ్రామంలోనైన కనీసం 60శాతం పైన రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే ఏ సవాల్ కైనా సిద్ధమేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, అధికారులకు ఏం రోగం వచ్చిందని జనగామ నియోజకవర్గంలోని ఏ ఒక్క చెరువును నింపడం లేదని పల్లా రాజేశ్వరరెడ్డి ప్రశ్నించారు. చెరువుల్లో నీరు లేక నార్లు ఎండిపోయి రైతన్నలు అరగోసలు పడుతున్నా ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తలేదన్నారు. అధికారులకు రెండు రోజుల టైం ఇస్తున్నామని.. రెండు రోజుల్లో చెరువులు నింపకపోతే రైతులతో కలిసి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడించి చెరువులను నింపుకుంటామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఒకటే పంట సాగు చేసే పోడు రైతులకు సైతం రెండు పంటలకు రైతు బంధు ఇచ్చామని పేర్కొన్నారు. ట్యాక్స్ పేయర్ల పేరుతో రైతు బంధు వేయకుండా రైతులను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులను రాజులుగా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను బిచ్చగాళ్లను చేస్తోందని పల్లా రాజేశ్వరరెడ్డి విమర్శించారు.

Updated Date - Aug 22 , 2024 | 01:21 PM