కేసీఆర్ కోసం పురాణపండతో ఒక వైపు ‘హరోం హర’, మరోవైపు ‘హరే హరే’ అంటున్న పొన్నాల లక్ష్మయ్య
ABN , Publish Date - May 07 , 2024 | 11:56 PM
‘హరే హరే’, ‘హరోం హర’ రెండు పవిత్ర గ్రంధాలు కేసీఆర్‌కి సంతోష అద్భుత ఆశ్చర్యానుభూతుల్ని పంచడం కోసమే పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో సమావేశమై ఎంతో ఎంతో భక్తి రసాత్మకంగా రూపొందించారని పొన్నాల వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు.
సికింద్రాబాద్, మే 7: ‘తెలవారే వేళలో మారేడు చెట్ల మీంచి భక్తి సంగీతపు గాలులు వీస్తున్నప్ప్పుడు ఒక సత్య శోధనలోంచి ఈ సమాజపు కొన్ని విరుద్ధమైన వ్యవస్థల్ని చీల్చుకుంటూ అందమైన ఋతు వైభవాల మధ్య శివలింగం ముందు సాష్టాంగపడుతున్న అనుభూతిని ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ పుస్తకాలు కలిగిస్తాయంటారు విఖ్యాత సినీ గేయ రచయిత వేటూరి సుందర రామమూర్తి. ఈ కోవ లోంచి చూసినప్పుడు మంగళవారం సాయంకాలం తెలంగాణ పూర్వ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్షేమం కోరుతూ జంట నగరాల్లో కొన్ని శివాలయాలకు మాజీ ఐటీ శాఖామంత్రి, ఇప్పటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య సమర్పణలో చేరిన పరమేశ్వరుని అత్యద్భుతమైన ‘హరోం హర’ గ్రంథ పసిడి వెలుగులు ఎంతగానో ఆకర్షిస్తాయి.
ఈ ‘హరోం హర’ పుస్తకం తెరిచేకొద్దీ మన మనస్సుని భక్తి ఇంకా కమ్ముకుంటోందన్నట్లుందన్నారు తెలంగాణా అర్చక పండితులు. కేసీఆర్ దంపతులు చండీయాగం చేస్తున్న పరమ పవిత్రమైన ఫోటోని పుస్తకం వెనుక ప్రచురింప చేసిన పొన్నాల లక్ష్మయ్య, ఈ ‘హరోం హర’ శైవగ్రంధంతో పాటు మరొక శ్రీవైష్ణవ గ్రంధాన్ని ‘హరే హరే’ అంటూ కూడా శ్రీ వేంకటేశ్వరుని తిరుమల మహాక్షేత్రాన్ని గుర్తు చేస్తూ కేసీఆర్ దంపతుల ఫోటో ప్రచురించి పొన్నాల తన స్నేహ గాఢతను కేసీఆర్ పట్ల ప్రకటించినట్లుండటం తెలంగాణ భవన్ హర్షం ప్రకటించడం తధ్యమంటున్నారు విశ్లేషకులు. రేపో, ఎల్లుండో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆవిష్కరించే ఈ రెండు భక్తి ప్రయోగ గ్రంథాలకు రచయిత పురాణపండ శ్రీనివాసే రచనా సంకలనకర్త కావడం గమనార్హం.
‘హరే హరే’, ‘హరోం హర’ రెండు పవిత్ర గ్రంధాలు కేసీఆర్‌కి సంతోష అద్భుత ఆశ్చర్యానుభూతుల్ని పంచడం కోసమే పొన్నాల లక్ష్మయ్య ప్రత్యేకంగా రచయిత పురాణపండ శ్రీనివాస్‌తో సమావేశమై ఎంతో ఎంతో భక్తి రసాత్మకంగా రూపొందించారని పొన్నాల వర్గీయులు బాహాటంగా చెబుతున్నారు. ఈ బుక్స్ కంటెంట్, వండర్ఫుల్ ఫొటోస్ , పురాణపండ స్పిరిట్యుయల్ కామెంటరీస్, ఆకర్షణీయ వర్ణభరితమైన ముద్రణతో వచ్చిన ఈ రెండు పుస్తకాలూ బీఆర్ఎస్‌లో ముఖ్యులందరికీ మరియు తెలంగాణలో ఆలయాలకు, మఠాలకు, పీఠాలకు పొన్నాల లక్ష్మయ్య అందజేస్తారని బీఆర్ఎస్ శ్రేణుల సమాచారం.
సహృదయ భక్తులపాలిటి కామధేనువుల్లా ఈ రెండు పుస్తకాల్ని తీర్చిదిద్దిన పురాణపండ శ్రీనివాస్ చేత గత కొన్ని సంవత్సరాలుగా పొన్నాల లక్ష్మయ్య వెలువరించిన నాలుగైదు అద్భుత గ్రంధాలు సాహితీ ప్రియుల్ని, భక్త పాఠకుల్ని, రాజకీయ పక్షాల ప్రముఖుల్ని అలరిస్తూనే ఉన్నాయని పొన్నాల సహచర అనుచరులు పేర్కొంటున్నారు. ఈ రెండు గ్రంధాల్లో పురాణపండ శ్రీనివాస్ కలం ప్రస్ఫుటంగా సాక్షాత్కరింప చేసిన పద ప్రయోగాల వ్యాఖ్యాన వైఖరీ దక్షత మహాద్భుతమంటున్నారు ఆలయాలకు చేరిన బుక్స్‌ని చదివిన ప్రధానార్చకులు.
సహజంగా వందల పద్యాలను నాల్కపై నర్తింప చేసుకునే రాజకీయ యోధుడైన కేసీఆర్ భక్తుడు కావడంతో ఈ అపురూప గ్రంధాలను ఆయన క్షేమంకోసమే ప్రచురించినట్లు పొన్నాల తన సన్నిహితులతో అన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా అతి త్వరలో నారసింహుని తేజస్సుతో కేసీఆర్ రాజకీయ వైభవం కోసం మరొక పవిత్ర ప్రత్యేక గ్రంధాన్ని పురాణపండతో పొన్నాల లక్ష్మయ్య ప్రకాశింప చేయనున్నట్లు ఇప్పటికే తెలంగాణ భవన్‌లో వార్త చక్కర్లు కొడుతోంది.