Ponnam Prabhakar: బీఆర్‌ఎస్ వల్లే అద్దె బకాయిలు: మంత్రి పొన్నం
ABN , Publish Date - Oct 18 , 2024 | 04:01 AM
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం వల్లే గురుకులాల అద్దె బకాయిలు పెరిగిపోయాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు.
జహీరాబాద్, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం వల్లే గురుకులాల అద్దె బకాయిలు పెరిగిపోయాయని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లో గురువారం ఎంపీ సురేశ్‌కుమార్ షెట్కార్ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థుల చదువులకు ఆటంకం కలిగించేలా భవన యాజమాన్యాలు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రాష్ట్రంలో కొన్ని గురుకుల భవనాలకు 30- 40 నెలల అద్దెలు పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్ అద్దెలను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం కళాశాల యాజమాన్యాలు ఆందోళనకు దిగడాన్ని మంత్రి తప్పుపట్టారు. విద్యార్థులు నష్టపోయే విధంగా వ్యవహరిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నేరవేరుస్తుందని పేర్కొన్నారు.