Ponnam Prabhakar: ప్రజాపాలన ఇంటింటికీ చేరేలా హైదరాబాద్‌లో విజయోత్సవం
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:54 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికీ తెలిసేలా ప్రజాపాలన విజయోత్సవాన్ని నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేతలకు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు.
జీహెచ్‌ఎంసీలోని ముఖ్య నేతలకు పొన్నం దిశానిర్దేశం
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: దీపాదాస్ మున్షీ
హైదరాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇంటింటికీ తెలిసేలా ప్రజాపాలన విజయోత్సవాన్ని నిర్వహించాలని జీహెచ్‌ఎంసీ పరిధిలోని నేతలకు హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్వహిస్తున్న కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ముఖ్యనేతలతో హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆదివారం పొన్నం సమావేశమయ్యారు. ఏఐసీసీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేశ్, ఎమ్మెల్సీలు అమీర్‌అలీ ఖాన్ , ఎంఎస్ ప్రభాకర్, 23 మంది కార్పొరేటర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. విజయోత్సవాల్లో భాగంగా 7వ తేదీన డివిజన్ స్థాయిలో మహిళలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో నేతలు సమావేశం కావాలన్నారు. 8న అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ, ట్యాంక్‌బండ్‌పై జరిగే ర్యాలీకి పెద్ద ఎత్తున జనసమీకరణ చేపట్టాలని సూచించారు. దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో విజయం కోసం పార్టీని బలోపేతం చేయాలని, ప్రభుత్వ విజయాలను, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. మహేశ్ గౌడ్ మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ విజయాలను వివరించాలని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే కార్పొరేటర్లంతా శ్రమించాలని దిశానిర్దేశం చేశారు.