Hyderabad: ఘనంగా కేంద్రీయ విద్యాలయ వార్షికోత్సవం
ABN , Publish Date - Dec 10 , 2024 | 02:45 PM
కేరళ డాన్స్, మైమ్ షో, అస్సామీ డాన్స్, పంజాబి డాన్స్, ప్యూజన్ డాన్స్‌లు భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాయి. కేరళలోని పాలక్కడ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఎఎస్ అధికారి డాక్టర్ మోహనప్రియ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా..
ఉప్పల్‌లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం 49వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభంమైన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఈవీ రమణ స్వాగతోపన్యాసం చేశారు. కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా విచ్చేసిన డాక్టర్ ఇందిరా గాంధీ, జిఎస్‌ఎన్ రెడ్డి విద్యార్థులకు, అధ్యాపకులకు బహుమతి ప్రదానం చేశారు. తదనంతరం కేరళ డాన్స్, మైమ్ షో, అస్సామీ డాన్స్, పంజాబి డాన్స్, ప్యూజన్ డాన్స్‌లు భిన్నత్వంలో ఏకత్వం అనే భారతీయ సంస్కృతిని ప్రతిబింబించాయి. కేరళలోని పాలక్కడ్ అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఎఎస్ అధికారి డాక్టర్ మోహనప్రియ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత ఆమె ఈ విద్యాలయ పూర్వ విద్యార్థిగా తన గత స్మృతులను నెమరువేసుకున్నారు. విద్యార్థుల సర్వతోముఖ వికాసానికి కేంద్రీయ విద్యాలయం చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తారని, చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసానికి ఈ విద్యాలయాల్లో ఎంతో ప్రాధాన్యత ఇస్తారన్నారు. కేంద్రీయ విద్యాలయాల గొప్పతనాన్ని ఆమె వివరించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
విభిన్న రంగాల్లో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు ఏ విధంగా సత్తా చాటుతున్నారో వార్షిక నివేదికలో పేర్కొన్నారు. జాతీయస్థాయి పోటీలో విద్యాలయ విద్యార్థులు ఎన్నో స్వర్ణ పతకాలు సాధించడంతో పాటు, సీబీఎస్‌ఈ పదో తరగతి, ప్లస్ టు తరగతులలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల వివరాలను వార్షిక నివేదికలో పొందుపర్చారు. ఉప్పల్‌లోని కేంద్రీయ విద్యాలయం వార్షికోత్సవం సందర్భంగా సమర్పించిన వార్షిక నివేదిక ఇక్కడి విద్యార్థు విజయపరంపరతో పాటు సమగ్ర వికాసానికి అద్దంపట్టింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థుల స్వాగతనృత్యం, కవాలీ తెలుగు నృత్యం, రాజస్థానీ డాన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. శ్రీకృష్ణుడు, సత్యభామ, హనుమంతుడు తదితర పౌరాణిక పాత్రలతో ప్రదర్శించిన హిందీ లఘు నాటిక అహంకారం అనర్థదాయకమనే సందేశాన్ని అందించి అందరి మన్ననలను చూరగొన్నది. వైస్ ప్రిన్సిపాల్ ప్రియారాణి వందన సమర్పణతో వార్షికోత్సవ కార్యక్రమం వైభవంగా ముగిసింది. కార్యక్రమంలో హెచ్‌ఎం సంతోషి, సీనియర్ టీచర్స్ ఖలీల్, చంద్రశేఖర్ రెడ్డి, ఎంటి రాజు, సీసీఎ కన్వీనర్ యోగేష్ సైనీతో పాటు విద్యాలయ అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here