Share News

Hyderabad: రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు సిబ్బందిని ఎందుకు కేటాయించలేదు?

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:25 AM

రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (రెరా) ప్రాజెక్టుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సవాల్‌ చేసేందుకు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసినా..

Hyderabad: రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌కు సిబ్బందిని ఎందుకు కేటాయించలేదు?

  • మున్సిపల్‌ అధికారులపై సీఎం రేవంత్‌ ఆగ్రహం

  • తక్షణమే పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశం

  • సిబ్బందిని కేటాయిస్తూ నేడు ఉత్తర్వులు జారీ

హైదరాబాద్‌, అక్టోబరు 14(ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ నియంత్రణ సంస్థ (రెరా) ప్రాజెక్టుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సవాల్‌ చేసేందుకు అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేసినా.. దాని కార్యాచరణ ప్రారంభం కాని వైనంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ‘రెరా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ ఉన్నట్టేనా?’ అనే శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనంపై పురపాలక శాఖ ఉన్నతాధికారులను ప్రశ్నించారు. నాలుగు నెలలైనా ట్రైబ్యునల్‌కు సిబ్బందిని కేటాయించడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం.. తక్షణమే రెరా ట్రైబ్యునల్‌ పని ప్రారంభించేలా సిబ్బందిని కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌ను ఆదేశించారు.


ప్రస్తుతానికి సిబ్బంది నియామకం ఉత్తర్వులు ఇచ్చి.. వచ్చే మంత్రివర్గ సమావేశంలో దీనిపై అనుమతి తీసుకునేలా కార్యాచరణ చేయాలని సూచించారు. కాగా, రెరా ట్రైబ్యునల్‌కు కావాల్సిన సిబ్బందిని కేటాయిస్తూ సోమవారమే ప్రభుత్వం ఉత్తర్వులను సిద్ధం చేసింది. సీఎం రేవంత్‌తో పాటు పురపాలక శాఖ ఉన్నతాధికారులు పరిశ్రమ ప్రారంభానికి వెళ్లడంతో వీలు కాలేదని తెలిసింది. మంగళవారం ఉత్తర్వులు వెలువడితే ఆ వెంటనే ట్రైబ్యునల్‌ ఏర్పాటును నోటిఫై చేస్తూ ప్రకటన జారీ చేసి బుధవారం నుంచి విచారణ చేపట్టేలా ట్రైబ్యునల్‌ సన్నద్ధమైందని తెలిసింది. అప్పిలేట్‌కు వచ్చిన కేసులను దశలవారీగా విచారణ చేపట్టి పరిష్కరించనున్నారు. మరోవైపు ఇన్నాళ్లూ సిబ్బంది కావాలని ట్రైబ్యునల్‌ కోరినా.. ప్రభుత్వం నుంచి సరైన స్పందన కొరవడింది. అయితే, ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవడంతో వివిధ ప్రాజెక్టుల యజమానులు హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 15 , 2024 | 04:25 AM