TS News: ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలి: పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Jan 08 , 2024 | 10:29 PM
ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్: ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీని వేగవంతం చేయాలని తెలంగాణ పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 31వ తేదీలోగా లక్ష్యం పూర్తి చేయాలని, పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు సోమవారం సీఎస్, జిల్లా కలెక్టర్లు, పౌర సరఫరాల అధికారులతో ఆయన కాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎస్ శాంతి కుమారి, పౌర సరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్, ఇతర అధికారులతో కలిసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఈ సమీక్షను నిర్వహించారు. కస్టమ్ మిల్లింగ్‌ను వేగవంతం చేయడంపై దృష్టి సారించాలని, రైస్ మిల్లర్ల ద్వారా బియ్యం మరియు దానిని ఎఫ్‌సీఐకి అందజేయాలని పేర్కొన్నారు. పౌర సరఫరాల శాఖ నుంచి ఎఫ్‌సీఐకి పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ బియ్యంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ఢిల్లీ పర్యటనలో అక్కడ కేంద్ర ప్రభుత్వ అధికారులు పెద్ద మొత్తంలో బియ్యం కేటాయింపులు అడిగారని, అయితే డెలివరీలలో పని తీరు తక్కువగా ఉందని ఫిర్యాదు చేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తావించారు.
ఎఫ్‌సీఐకి నిర్ణీత పరిమాణంలో సీఎంఆర్ బియ్యాన్ని పంపిణీ చేయడంలో జాప్యం కారణంగా భవిష్యత్తులో తెలంగాణకు కేటాయింపులపై తీవ్ర పరిణామాలు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ఎఫ్‌సీఐకి సకాలంలో బియ్యం పంపిణీ చేసేందుకు విధానాలను మెరుగుదల, ప్రక్రియను క్రమబద్ధీకరించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.