Hyderabad: మధ్యవర్తిత్వంతో చౌకగా పరిష్కారం
ABN , Publish Date - Nov 23 , 2024 | 03:15 AM
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మధ్యవర్తిత్వానికి(మీడియేషన్) వివాదంలో ఉన్న పక్షాలు పెద్ద పీట వేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్ సూచించారు.
ఇరుపక్షాలకు నచ్చిన పద్ధతుల్లో తేల్చవచ్చు
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్
మధ్యవర్తిత్వంతో కేసుల భారం తగ్గుతుంది
మీడియేషన్- ఆర్బిట్రేషన్ జాతీయ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): తక్కువ ఖర్చుతో పూర్తయ్యే మధ్యవర్తిత్వానికి(మీడియేషన్) వివాదంలో ఉన్న పక్షాలు పెద్ద పీట వేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భూషన్ రామకృష్ణ గవాయ్ సూచించారు. ఇరు పక్షాలకు ఇది లాభదాయకమన్నారు. తమకు సౌలభ్యంగా ఉండే నిబంధనల మధ్య సమస్యను త్వరగా పరిష్కరించుకునేందుకు ఇందులో వీలు ఉంటుందని చెప్పారు. మధ్యవర్తిత్వం విఫలమైతే పెద్ద మనిషి పరిష్కారం(ఆర్బిట్రేషన్) కొనసాగుతుందన్నారు. ఈ రెండు అంశాలపై శుక్రవారం నుంచి హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, శ్రీలంక సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏహెచ్‌ఎండీ నవాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, శత్రువుతో మీరు శాంతి ఒప్పందం చేసుకోవాలంటే శత్రువుతో కలిసి పని చేయాలని, ఆ క్రమంలో తనే మీ భాగస్వామి అవుతాడని నెల్సన్ మండేలా చెప్పారని ప్రస్తావించారు. మండేలా వ్యాఖ్యలు మధ్యవర్తిత్వం, పెద్ద మనిషి పరిష్కారం అంశాలకు సరిగ్గా సరిపోతాయని అన్నారు.
అత్యంత క్లిష్టమైన వ్యాజ్యాలు కూడా భాగస్వామ్య ఒప్పందాలుగా మారే అవకాశాలు లేకపోలేదని వివరించారు. అంతర్జాతీయంగా మొదటి పెద్ద మనిషి పరిష్కారం ఫ్యుజి-ఐబీఎం కంపెనీల మధ్య జరిగిందన్నారు. పెద్ద మనిషి పరిష్కారం, మధ్యవర్తిత్వం విషయంలో ఎన్నో ఉపయుక్తమైన విధానాలకు ఈ కేసు మార్గం చూపిందని చెప్పారు. గడచిన ఆర్థిక సంవత్సరంలో 1,47,513 కేసులు మధ్యవర్తిత్వంలో పరిష్కారమయ్యాయని వివరించారు. మధ్యవర్తిత్వ చట్టం చేసిన తర్వాత వెయ్యికి పైగా సుప్రీంకోర్టులోని కేసులు ప్రత్యేక లోక్ అదాలత్‌లో పరిష్కారం అయ్యాయని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ వంటి కొత్త సాంకేతికతలతో హైదరాబాద్ ఇప్పుడు భవిష్యత్ సాంకేతికతల పరంగా అంతర్జాతీయ నగరంగా వెలుగొందుతోందని చెప్పారు. సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్ రంగాల్లో హైదరాబాద్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందన్నారు. ఈ గుర్తింపు కొనసాగేందుకు ప్రభావవంతమైన రీతిలో వివాద పరిష్కార యంత్రాంగం కూడా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. పెండింగ్ కేసుల భారాన్ని తగ్గించుకోవడానికి మధ్యవర్తిత్వం లాంటి ప్రత్యామ్నాయ పరిష్కార వ్యవస్థలు అవసరమని అన్నారు. మధ్యవర్తిత్వంతో వివాదాలు సమర్థంగా పరిష్కారం అవుతాయని తెలంగాణ హైకోర్టు సీజే అలోక్ అరాధే చెప్పారు.