Hyderabad: యువతులతో డేటింగ్ పేరుతో మోసాలు!
ABN , Publish Date - Jun 13 , 2024 | 03:29 AM
ప్రత్యేకంగా యువతులను నియమించుకొని.. వారి ఫొటోలతో డేటింగ్ యాప్‌లలో ఖాతాలు సృష్టించి టెకీలను లక్ష్యంగా చేసుకొని వలపు వల విసరడం ద్వారా లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా దోపిడీకి ఢిల్లీ, బెంగళూరులో పబ్‌ల నిర్వాహకులు సాయం చేయడం విశేషం.
టెకీలే లక్ష్యంగా ఢిల్లీకి చెందిన ముఠా దోపిడీ
కుట్రలో హైదరాబాద్, బెంగళూరు పబ్‌లు
వలపు వలతో టెకీలను పబ్‌లకు పిలిపించుకొని
ఖరీదైన మద్యం, భోజనంతో పెద్ద ఎత్తున బిల్లులు
హైదరాబాద్‌లో బాధితుల నుంచి ఫిర్యాదు
ముఠా సభ్యులు.. పబ్‌ల నిర్వాహకుల అరెస్టు
హైదరాబాద్ సిటీ, జూన్ 12 (ఆంధ్రజ్యోతి):ప్రత్యేకంగా యువతులను నియమించుకొని.. వారి ఫొటోలతో డేటింగ్ యాప్‌లలో ఖాతాలు సృష్టించి టెకీలను లక్ష్యంగా చేసుకొని వలపు వల విసరడం ద్వారా లక్షల్లో దోపిడీకి పాల్పడుతున్న ఢిల్లీకి చెందిన ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా దోపిడీకి ఢిల్లీ, బెంగళూరులో పబ్‌ల నిర్వాహకులు సాయం చేయడం విశేషం. గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో కేసు వివరాలను డీసీపీ వినీత్ వెల్లడించారు. ఢిల్లీకి చెందిన ఆకాశ్, సూరజ్, అక్షత్ నరులా, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్.. ఢిల్లీలో ‘‘డెవిల్స్ నైట్ క్లబ్’’ను నిర్వహించారు. నష్టాలు రావడంతో మోసాలకు తెరతీశారు.
ఉద్యోగాలిప్పిస్తామని ప్రకటనలిచ్చి ఢిల్లీ, యూపీకి చెందిన ఆరుగురు యువతులను నియమించుకున్నారు. వారి ఫొటోలతో, తప్పుడు పేర్లతో టిండర్, బంబుల్ వంటి డేటింగ్ యాప్‌లలో ఖాతాలు తెరిచారు. ముఠాలోని సూరజ్, డేటింగ్ యాప్‌లలో ఐటీ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని అమ్మాయిల పేర్లతో చాటింగ్ చేసేవాడు. వారితో పరిచయం పెంచుకునేవాడు. ముందుగా వారిని కాఫీ షాపుకు పిలిచేవారు అక్కడికి యువతులను పంపేవారు. తర్వాత చాటింగ్‌లో పబ్‌లో కలుద్దామంటూ మాయమాటలు చెప్పి ఒప్పించేవారు. తాము సూచించిన పబ్‌కు వచ్చాక పథకంలో భాగంగా తమ యువతితోనే వచ్చిన టెకీల కోసం ఖరీదైన మద్యం, భోజనం ఆర్డర్ చేయించి రూ. 15 వేల నుంచి రూ. 40 వేల దాకా బిల్లులు వసూలు చేస్తున్నారు. ఇలా ఢిల్లీ, బెంగళూరులోని పబ్‌ల నిర్వాహకుల సాయంతో పలువురిని మోసం చేశారు.
వసూలు చేసిన డబ్బును పంచుకునేవారు. ఈ ముఠా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లలో పలువురిని మోసం చేసింది. నగరంలోని మోష్ పబ్‌లో ఈ తరహా ఘటనలు జరగడంతో, బాధితుల ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ముఠాలోని ఆకాష్, సూరజ్, అక్షత్ నరులా, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్‌తోపాటు మోష్ పబ్ ఈవెంట్ మేనేజర్ చెరుకుపల్లి సాయికుమార్, నిర్వాహకులు తరుణ్, జగదీశ్‌లను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 40 లక్షల విలువైన 8 మొబైల్స్, థార్, కియా కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోష్ పబ్‌లో ఏప్రిల్ 17 నుంచి మే 30 వరకు 50 నుంచి 60 మంది యువకుల నుంచి 30 లక్షల వరకు వసూలు చేశారు. ఈ ముఠా సభ్యులు 6 వారాలకు మించి ఒకనగరంలో ఉండరని, నాగపూర్‌లో మోసాలు చేసేందుకు వెళ్లినట్లు గుర్తించి అరెస్ట్ చేశామని డీసీపీ తెలిపారు.