Secunderabad: లోక్‌సభ ఎన్నికలతోపాటే కంటోన్మెంట్‌కు..
ABN , Publish Date - Mar 17 , 2024 | 11:10 AM
తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.
సికింద్రాబాద్: తెలంగాణలోని 17లోక్‌సభ స్థానాలతోపాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్(Secunderabad Cantonment) అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికను నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. కంటోన్మెంట్ ఉప ఎన్నికను మే 13వ తేదీన నిర్వహించాలని శనివారం ప్రకటించింది. కంటోన్మెంట్ నుంచి బీఆర్‌ఎస్(BRS) పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న లాస్య నందిత(Lasya Nandita) నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఆవిర్భావంతో 1957, 1962 ఎన్నికల్లో బి.వి.గురుమూర్తి శాససభ్యునిగా వరుసగా విజయం సాధించారు. 1967లో ఈ అసెంబ్లీ సెగ్మెంట్ ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఆ ఎన్నికల్లో వి.రామారావు గెలిచారు. అయితే ఏడాది తర్వాత వి.రామారావు మృతితో 1969లో జరిగిన ఉప ఎన్నికలో రామారావు సతీమణి వి.మంకమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1972లో జరిగిన సాధారణ ఎన్నికల్లోనూ మంకమ్మ రెండోసారి విజయం సాధించారు. 1978లో మూడోసారి పోటీ చేసిన మంకమ్మ ఓటమి చవిచూశారు. ఆ తర్వాత కంటోన్మెంట్ నియోజకవర్గ చరిత్రలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి జి.సాయన్న రికార్డు సృష్టించారు. 1994లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి సాయన్న ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1999,2004లలో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి పి.శంకర్‌రావు చేతిలో సాయన్న ఓటమి చవిచూశారు. 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2018లో టీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే, 2023 ఫిబ్రవరిలో పదవిలో ఉండగానే అస్వస్థతకు గురై కన్నుమూశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిలోపు గడువు ఉండడంతో ఉప ఎన్నిక జరగలేదు. ఆ తర్వాత 2023 డిసెంబరులో జరిగిన సాధారణ ఎన్నికల్లో సాయన్న వారసురాలిగా ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్‌ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. మూడు నెలలు కూడా గడవకముందే ఫిబ్రవరి 23వ తేదీన లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దాంతో ప్రస్తుతం ఉప ఎన్నిక నిర్వహించవలసి వస్తోంది.
నేను రెడీ : నివేదిత
బోయినపల్లి: దివంగత శాసనసభ్యుడు జి.సాయన్న, లాస్య నందితల రాజకీయ వారసురాలిగా ఎన్నికల బరిలో దిగేందుకు సాయన్న రెండో కుమార్తె నివేదిత సిద్ధమయ్యారు. అప్పుడు సాయన్నకు కుడిభుజంగా, మొన్నటి ఎన్నికల్లో లాస్య నందితకు అన్నీ తానై వ్యవహరించిన నివేదిత తాజా ఉప ఎన్నికలో బరిలో దిగుతానని శనివారం ప్రకటించారు. తండ్రి సాయన్న ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని శనివారం జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ప్రకటించారు. నియోజకవర్గ ఉప ఎన్నిక ఏకగ్రీవం కావడానికి ఇతర పార్టీలు కూడా సహకరించాలని కోరారు. అయితే, ఈ స్థానం నుంచి బీఆర్‌ఎస్ తరఫున వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్జెల నాగేష్, ఎర్రోళ్ల శ్రీనివాస్ టికెట్ రేసులో ఉన్నారు.
కాంగ్రెస్ నుంచి వెన్నెల.. బీజేపీ నుంచి శ్రీగణేష్
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ప్రజా గాయకుడు గద్దర్ కుమార్తె వెన్నెల, బీజేపీ నుంచి పోటీ ఎన్.శ్రీగణేష్లు ఉప ఎన్నికలో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు.
ఇది రెండో ఉప ఎన్నిక
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇది రెండో ఉప ఎన్నిక. 1957లో ఆవిర్భవించిన కంటోన్మెంట్ నియోజకవర్గంలో 1969లో అప్పటి ఎమ్మెల్యే రామారావు మృతితో తొలిసారిగా ఉప ఎన్నిక జరిగింది. 2024లో ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో మే 13న రెండో ఉప ఎన్నిక జరగనుంది.