Share News

Crime Rates: నేరాల్లేని నగరం సియోల్‌!

ABN , Publish Date - Oct 25 , 2024 | 03:21 AM

ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం. నేరాలు దాదాపు ఉండవు. తుపాకీ సంస్కృతిపై కఠినంగా నిషేధం.. ఇవి దక్షిణ కొరియా ప్రత్యేకతలు.

Crime Rates: నేరాల్లేని నగరం సియోల్‌!

  • ఏదైనా కేసు నమోదైతే అదే పెద్ద వార్త

  • తుపాకుల వినియోగంపై కఠిన నిషేధం

  • 65 ఏళ్లు దాటిన వృద్ధులకు భారీ రాయితీలు

  • రిటైర్‌మెంట్‌ వయస్సు 75కి పెంచే యోచన

  • పెళ్లిళ్లకు దూరంగా జీవించే వారే ఎక్కువ

  • ఒంటరితనమే కొరియాలో పెద్ద సమస్య

  • ఆత్మహత్యలను తగ్గించేందుకు చర్యలు

(సియోల్‌ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి) : ప్రపంచంలోనే అత్యంత సురక్షిత దేశం. నేరాలు దాదాపు ఉండవు. తుపాకీ సంస్కృతిపై కఠినంగా నిషేధం.. ఇవి దక్షిణ కొరియా ప్రత్యేకతలు. ప్రపంచవ్యాప్తంగా నేరాలు, తుపాకీ సంస్కృతి విపరీతంగా పెరుగుతుంటే, ఇక్కడ మాత్రం తుపాకుల వినియోగాన్ని ప్రభుత్వం కఠినంగా నిషేధిస్తోంది. 2021లో ఓ అంతర్జాతీయ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే దక్షిణ కొరియాలో నేరాలు దాదాపు లేవనే చెప్పాలి. ఇతర నగరాల్లో చిన్నాచితకా నమోదవుతున్నా రాజధాని సియోల్‌తో పాటు ప్రముఖ నగరాలు బూసాన్‌, ఇంచియాన్‌లో పోలీసులకు పనే ఉండదు. అక్కడ కేసు నమోదు చేస్తే పెద్ద వార్త అవుతుంది. అందుకే, దక్షిణ కొరియాను అత్యంత సురక్షిత దేశంగా పేర్కొంటారు. నేరాలకు పాల్పడితే జైలుశిక్ష విధించడం చాలా అరుదు. నేరాలను బట్టి జరిమానాలు ఉంటాయి. 16 అతి క్రూరమైన నేరాలకు మరణ శిక్ష అమల్లో ఉన్నప్పటికీ 1998 నుంచి తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది.


  • 65కి రిటైర్‌మెంట్‌ వద్దంటున్న వృద్ధులు

వాహనాలు వినియోగించే వారు హారన్‌ కొట్టడమే ఉండదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడినా.. వాహనాల రద్దీ ఉన్నా.. వాహన వినియోగదారులు వేచి ఉంటారు తప్ప హారన్‌ కొట్టరు.. హారన్‌ కొట్టడం ఇక్కడి పౌరులు తప్పుగా భావిస్తారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులను సీనియర్‌ సిటిజన్లుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. వీరికి మెట్రోలో ఉచిత ప్రయాణంతో పాటు పెన్షన్‌, ఆరోగ్య బీమా లాంటి అనేక పథకాలు అమలు చేస్తోంది. వీరి సంక్షేమానికి ప్రభుత్వం ఏటా 30 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేస్తోంది. ఇక్కడ జననాల రేటు ప్రపంచంలోనే తక్కువ.. సగటు జీవిత వయస్సు 85 సంవత్సరాలు.


కొత్త వారు లేకపోవడం.. ఉన్న వారు 65కి రిటైర్‌ అవుతుండటంతో పని చేసేందుకు సరిపడా కార్మిక శక్తి కొరత ఏర్పడుతుంది. దీని ప్రభావం ఆర్థిక వ్యవస్థ పైనా పడుతోంది. దీంతో రిటైర్‌మెంట్‌ వయస్సు 65ను ఏటా ఏడాది పెంచుకుంటూ పోతూ పదేళ్లకు 75 చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. పనిచేస్తాం, రిటైర్‌మెంట్‌ వద్దు అనే వృద్ధుల సంఖ్య కూడా పెరుగుతోంది. 75 వరకు తాము ఏ పనైనా చేసేందుకు సిద్ధమని అక్కడి వృద్ధులంటున్నారు. మెరుగైన జీవన విధానం, ఆరోగ్యం కారణంగా దేశంలో ఇప్పటికే సీనియర్‌ సిటిజన్ల సంఖ్య కోటికి చేరింది. 2050 నాటికి రెండు కోట్లకు పెరుగుతుందని అంచనా.


  • ఒంటరి పౌరులకు కాల్‌ సెంటర్‌.. 120

చాలామంది పౌరులు వివాహాలకు దూరం. ఒంటరిగానే ఉండేందుకు ఇష్టపడతారు. ఒంటితనమే వారికి శాపంగా మారుతోంది. ఆత్మహత్యలు చేసుకునే మద్య వయస్కుల సంఖ్య పెరుగుతుండటంతో.. ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఒంటరి పౌరులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు, వారి కష్ట సుఖాలను వినేందుకు 24 గంటల కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేసింది. 120 నంబరుకు డయల్‌ చేసి, సేవలు పొందవచ్చు. అలాగే ఆత్మహత్యల నివారణ లక్ష్యంగా రాజధాని సియోల్‌లో ప్రత్యేకంగా నాలుగు కౌన్సెలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒంటరితనంతో బాధ పడుతున్న మధ్య వయస్కులను ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏటా 329 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేస్తోంది.


అలాగే రాజధాని సియోల్‌లో మైండ్‌ కన్వీనియన్స్‌ స్టోర్స్‌ ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఇందులో ఒంటరితనంతో బాధ పడుతున్న ఎవరైనా రావచ్చు.. ఇక్కడి వారితో కలుసుకోవచ్చు. ఇక్కడ ఆహారం, ఇతరాలు పూర్తిగా ఉచితం. ఒంటరితనంతో బాధపడే వారికి వచ్చే ఐదేళ్లలో 451 బిలియన్‌ వాన్‌ (అక్కడి కరెన్సీ) ఖర్చు చేయాలని నిర్ణయించామని రాజధాని సియోల్‌ మెట్రోపాలిటన్‌ గవర్నమెంట్‌ తాజాగా ప్రకటించింది. ఒంటరితనం, ఏకాకిగా ఉండటం అనేది తమ ప్రభుత్వానికి అతిపెద్ద సవాలని, దీనిని సమాజంతో కలిసే పరిష్కరించాలని సియోల్‌ మేయర్‌ ఒహ్‌ సే హూన్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో అన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 07:01 AM