Share News

‘బీసీ’ నివేదికపై ప్రత్యేక కమిషన్‌ కసరత్తు!

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:55 AM

స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలన్న అంశంపై నియామకమైన ప్రత్యేక(డెడికేటెడ్‌) కమిషన్‌ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు కమిషన్‌ దృష్టికి వచ్చిన అంశాలు, జిల్లాల పర్యటనలో సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి... ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేస్తోంది.

‘బీసీ’ నివేదికపై ప్రత్యేక కమిషన్‌ కసరత్తు!

  • జిల్లాల పర్యటనలు, భేటీలు ఇప్పటికే పూర్తి

  • వివరాలతో ప్రాథమిక నివేదిక సిద్ధం

  • కులగణన వివరాలు సేకరించాక ఎంతమేర

  • రిజర్వేషన్‌ ఇవ్వాలో సూచించే అవకాశం

  • ప్రభుత్వానికి రెండు దఫాలుగా నివేదిక!

హైదరాబాద్‌, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్లను ఖరారు చేయాలన్న అంశంపై నియామకమైన ప్రత్యేక(డెడికేటెడ్‌) కమిషన్‌ నివేదికను సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు కమిషన్‌ దృష్టికి వచ్చిన అంశాలు, జిల్లాల పర్యటనలో సేకరించిన వివరాలన్నింటినీ క్రోడీకరించి... ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేస్తోంది. అనంతరం కులగణన వివరాలను కూడా కమిషన్‌ సేకరించనుంది. అన్ని వివరాలను క్రోడీకరించి.. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు కసరత్తు చేస్తోంది. తెలంగాణలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కేటాయించాల్సిన రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక కమిషన్‌ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్‌ ఏర్పాటైన వెంటనే.. రంగంలోకి దిగడంతోపాటు జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించింది. మేధావులు, ప్రజాసంఘాలు, కుల సంఘాల నుంచి విజ్ఞప్తులను సేకరించింది. దాదాపు నెల రోజుల్లోనే వివిధ వర్గాల తో సమావేశమైంది. ఆయా సమావేశాల్లో వచ్చిన వివరాల ఆధారంగా ఇప్పుడు ప్రభుత్వానికి అందించే నివేదిక రూపకల్పనలో నిమగ్నమైంది.


గ్రామాలు, మండలాల వారీగా రిజర్వేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్లపై ప్రత్యేక కమిషన్‌ క్షుణ్ణంగా పరిశీలన చేస్తోంది. ఆ మేరకే వివరాలనూ సేకరించింది. అయితే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను కేటాయించాలంటూ అటు ప్రభుత్వానికి, ఇటు కమిషన్‌కు వినతులు వచ్చాయి. అయితే, వివిధ కేసుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50శాతం కంటే పెరగకూడదు. ఈ నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్లను ఏ విధంగా కేటాయించాలన్న అంశంపై కమిషన్‌ లోతుగా అధ్యయనం చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే తరహా రిజర్వేషన్‌ కాకుండా.. ఆ గ్రామం లేదా జిల్లాలో జనాభాను బట్టి ఆయా పదవులకు రిజర్వేషన్‌ కేటాయించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లకు ఎంత మేర రిజర్వేషన్‌ కేటాయించాలి? సంబంధిత వార్డులో ఎంత మంది బీసీలు ఉన్నారు? ఒక వేళ బీసీలకు సర్పంచ్‌ పదవి ఇవ్వాలంటే గ్రామంలో ఎంతమంది బీసీలు ఉన్నారు? అనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. మండల స్థాయిలో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులు, జడ్పీ చైర్మన్‌ పదవులకు కూడా బీసీ జనాభా వాటా ప్రకారం పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా నివేదికను సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది.


రిపోర్టు రెండు దఫాల్లో..

రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టిన ప్రత్యేక కమిషన్‌,, రెండు దఫాల్లో ప్రభుత్వానికి నివేదికలు సమర్పించనున్నట్టు తెలిసింది. మొదటి దఫాలో గ్రామీణ ప్రాంతాలు, రెండో దఫాలో పట్టణ, మునిసిపాలిటీల వారీగా రిపోర్టులను ప్రభుత్వానికి ఇవ్వనుంది. ఇప్పటికే గ్రామాల్లో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయి ఏడాది అయింది. పైగా సర్పంచ్‌లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన వివిధ గ్రాంట్లు, నిధులు కూడా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో మొదట గ్రామీణ ప్రాంతాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్‌ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లపై కమిషన్‌ దృష్టి సారించింది. ఇందుకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లోని బీసీ రిజర్వేషన్లను సూచిస్తూ ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఏయే ప్రాంతాల్లో బహిరంగ విచారణ చేపట్టాలి.. అనంతరం రిజర్వేషన్ల ఖరారుకు ఎంత సమయం పడుతుంది.. వంటి అన్ని అంశాలపైనా చర్చలు జరుపుతోంది.

Updated Date - Dec 13 , 2024 | 02:55 AM