బీఆర్‌ఎస్ ఓ విఫల పార్టీ!
ABN , Publish Date - May 08 , 2024 | 04:18 AM
బీఆర్‌ఎస్ ఒక విఫల పార్టీ అని, కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు అమలు కావాలంటే ఐదు రాష్ట్రాల బడ్జెట్లు కావాలని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు.
కాంగ్రెస్ ఐదు గ్యారెంటీల అమలుకు ఐదు రాష్ట్రాల బడ్జెట్లు కావాలి: తమిళిసై
హైదరాబాద్, మే 7 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఒక విఫల పార్టీ అని, కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు అమలు కావాలంటే ఐదు రాష్ట్రాల బడ్జెట్లు కావాలని తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఒక బలమైన పార్టీ అని బీఆర్‌ఎ్‌సగా మారాక అది ఓ విఫల పార్టీగా నిలిచిపోయిందని అభిప్రాయపడ్డారు. తాను తెలంగాణ ఆడబిడ్డనని, ఈ రాష్ట్ర ప్రజలతో తన అనుబంధాన్ని ఎవరూ విడదీయలేరని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో తమిళిసై విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థను అవమానించారని, ప్రొటోకాల్ పాటించలేదని ఆరోపించారు. తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని వచ్చినా కేసీఆర్ నాడు దూరంగా ఉన్నారని విమర్శించారు.
ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ కంటే ఆరోగ్య శ్రీ పథకం మెరుగని నాడు కేసీఆర్ వాదించేవారని గుర్తుచేశారు. తమిళనాడులో ఆయుష్మాన్ భారత్ ఎలా విజయవంతమయ్యిందో తాను ఆయనకు వివరించానని చెప్పారు. ఆ తర్వాతే ఆయన తెలంగాణాలో ఆయుష్మాన్ భారత్ అమలుకు ముందుకు వచ్చారని చెప్పారు. అమలుకాని హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. రాష్ట్రంలో మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రె్‌సకు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
దివంగత నేత, మాజీ ప్రధాని వాజ్‌పేయి కూడా రిజర్వేషన్‌లను వ్యతిరేకించారని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యను తమిళిసై ఖండించారు. వాజ్‌పేయి 2001 డిసెంబరు 19న చేసిన ప్రసంగంలో రిజర్వేషన్‌లు కొనసాగించాలని అన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు మతాలను విభజించి రాజకీయం చేసిందని, ఇప్పుడు కులాల మధ్య విభజన చిచ్చుపెట్టి రాజకీయం చేస్తోందని తమిళిసై ఆగ్రహం వ్యక్తం చేశారు.