CM Revanth Reddy: ‘హైడ్రా’కు చట్టబద్ధత!
ABN , Publish Date - Sep 15 , 2024 | 03:59 AM
అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)’కు రేవంత్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయనుంది.
ఆర్డినెన్స్‌ను తీసుకురానున్న సర్కార్.. తర్వాత అసెంబ్లీలో బిల్లు.. చట్టంతో విశేషాధికారాలు
20న మంత్రిమండలి భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం
హైదరాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్న ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా)’కు రేవంత్ ప్రభుత్వం మరింత బలోపేతం చేయనుంది. సీఎం రేవంత్ అధ్యక్షతన 20న జరగనున్న మంత్రిమండలి సమావేశంలో ప్రధానంగా హైడ్రాపైనే దృష్టిపెట్టనున్నారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పించే విషయమై నిర్ణయం తీసుకోనున్నారు. హైడ్రాకు ఆర్డినెన్స్‌ను తీసుకురావడం, అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవడం వంటి అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అలాగే ధరణి కమిటీ చేసిన సిఫారసులు కూడా చర్చకు రానున్నాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్-2024 (ఆర్వోఆర్) ముసాయిదా అంశమూ చర్చకు రానుంది. కొత్త ముసాయిదాపై మంత్రిమండలి చర్చించి.. అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేయనుంది. ఇక రైతు రుణమాఫీ, రైతుభరోసాపైనా చర్చించనున్నారు.
రైతు రుణ మాఫీ పథకం కింద ఇప్పటికే ప్రభుత్వం రూ.18 వేల కోట్లను వెచ్చించింది. ఇప్పటివరకు రూ.2లక్షల వరకు ఉన్న పంట రుణాలను మాఫీ చేసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. రైతు భరోసా పథకానికి ఇంకా విధివిధానాలు ఖరారు కాలేదు. పర్యవసానంగా ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం పథకాన్ని అమలు చేయలేదు. దీనిపైనా క్యాబినెట్‌లో చర్చించనున్నారు. ఔటర్ రింగు రోడ్డును ఆనుకుని ఉన్న 51 గ్రామాలను సమీప 13 మునిసిపాలిటీల్లో విలీనం చేస్తూ ఇటీవల ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ మునిసిపాలిటీలను కూడా గ్రేటర్ హైదరాబాద్ మునిసిల్ కార్పొరేషన్‌లో విలీనం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ అంశంపై క్యాబినెట్‌లో చర్చిస్తారని సమాచారం. 20న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో బీసీ కుల గణన అంశమూ చర్చకు రానుంది. బీసీ కుల గుణన చేసి మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
ఇది పూర్తయితే తప్ప.. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. ఈ దృష్ట్యా కుల గణనను వేగవంతం చేసే అంశంపై క్యాబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిసి, వరదలు సంభవించాయి. పలు జిల్లాల్లో పంట, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇందుకోసం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని కోరుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి నష్టం వివరాలను సమర్పించారు కేంద్ర బృందం రాష్ట్రంలో ప్యటించి, వివరాలు సేకరించింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడకపోతే రాష్ట్ర ప్రభుత్వం తరపున చేపట్టాల్సిన నష్ట నివారణ చర్య లు, దాతలు ఇస్తున్న విరాళాల వ్యయం తదితర అం శాలపై చర్చించనుంది. రాష్ట్రంలో 225 కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదనకు వచ్చిన కొన్ని గ్రామాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపాదించిన మరికొన్ని గ్రామాలు కలిపి మొత్తం 225కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయాలన్నది ఆలోచన. వీటిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో క్యాబినెట్ కొత్త పంచాయతీలపై చర్చించి, తుది నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు.