మరో 3నెలలు దొడ్డు బియ్యం!
ABN , Publish Date - Dec 03 , 2024 | 05:00 AM
సన్న బియ్యం పంపిణీని సంక్రాంతి నుంచి ఉగాదికి వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రాబోయే మూడు నెలలకు సరిపడా దొడ్డు బియ్యం సేకరణపై దృష్టి సారించింది. 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు జిల్లాలు, రైస్ మిల్లుల వారీగా కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసింది. క
6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు ఉత్తర్వులు
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): సన్న బియ్యం పంపిణీని సంక్రాంతి నుంచి ఉగాదికి వాయిదా వేసిన రాష్ట్ర ప్రభుత్వం.. రాబోయే మూడు నెలలకు సరిపడా దొడ్డు బియ్యం సేకరణపై దృష్టి సారించింది. 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం సేకరణకు జిల్లాలు, రైస్ మిల్లుల వారీగా కేటాయింపు ఉత్తర్వులు జారీ చేసింది. కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) కోటాలో రాష్ట్ర వాటా (స్టేట్ పూల్) కింద ఆ బియ్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరిస్తుంది. 2023-24 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన బియ్యాన్ని ఈ కోటాలో సేకరించనున్నారు. రైస్ మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని మర ఆడించిన తర్వాత భారత ఆహార సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. ఏ గోదాముల్లో జాగా చూపిస్తే అక్కడికి బియ్యం తీసుకెళ్లి ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆహార భద్రత కార్డులు, ఇతర సంక్షేమ పథకాలకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరమవుతాయి. మూడు నెలలకు (2025 జనవరి, ఫిబ్రవరి, మార్చి) కలిపి 6 లక్షల టన్నుల బియ్యం అవసరం ఉంటుంది.
ఈ బియ్యం సేకరణకు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డీఎస్ చౌహాన్ జారీ చేయడంతో రైస్ మిల్లర్లు ఎగిరి గంతేస్తున్నారు. ఎందుకంటే.. నాణ్యతా ప్రమాణాలకు లోబడి ఉంటేనే ఎఫ్‌సీఐ బియ్యం తీసుకుంటుంది. అయితే పౌరసరఫరాల సంస్థ కోటాలో బియ్యం ఇవ్వటానికి రైస్ మిల్లర్లు ఇష్టపడతారు. మామూళ్లు ముట్టచెబితే బియ్యం ఎలా ఉన్నా స్థానిక అధికారులు కిమ్మనరన్న నమ్మకమే కారణం. ఇదిలా ఉండగా ఎఫ్‌సీఐకి బియ్యం ఎగ్గొట్టి... పౌర సరఫరాల సంస్థకు బియ్యం కోటా కేటాయింపులు ఇప్పించినందుకు కొందరు మధ్యవర్తులు రైస్ మిల్లర్ల నుంచి డబ్బులు వసూలు చేసే ఆనవాయితీ ఉంది. టన్నులు, జిల్లాల లెక్కన, కోటా ప్రకారం... డబ్బులు వసూలు చేసి అధికారులకు ముట్టజెపుతుంటారు. వాస్తవానికి ఇప్పుడిచ్చిన 6లక్షల టన్నుల కోటాలో ఎవరి ప్రమేయం, పైరవీలు లేవు. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ అవసరాల నిమిత్తం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిని కూడా తమ ఖాతాలో వేసుకొని కొందరు మధ్యవర్తులు వనపర్తి, కామారెడ్డి, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల రైస్ మిల్లర్ల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో వనపర్తి జిల్లా నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయటంతో మధ్యవర్తులు, మిల్లర్ల మధ్య గొడవలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.