Share News

Economic recovery: అప్పులు దాటి అభివృద్ధి బాట

ABN , Publish Date - Dec 03 , 2024 | 03:48 AM

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిందేందుకు ప్రయత్నాలు చేపట్టామని.. అప్పుల పరిస్థితిని దాటి అభివృద్ధి బాట పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు.. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది.

Economic recovery: అప్పులు దాటి అభివృద్ధి బాట

  • ఆర్థిక క్రమశిక్షణకు పెద్దపీట వేస్తున్నాం

  • ఏడాది వ్యవధిలో తెచ్చిన అప్పులు రూ.52,118 కోట్లు

  • వడ్డీలు, కిస్తీల చెల్లింపులకు.. రూ. 64,516 కోట్లు

  • ప్రతిష్ఠాత్మక పథకాలకు రూ.61,194 కోట్ల వ్యయం

  • ఇప్పటివరకూ 54,520 ఉద్యోగాల భర్తీ: సీఎంవో

హైదరాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిందేందుకు ప్రయత్నాలు చేపట్టామని.. అప్పుల పరిస్థితిని దాటి అభివృద్ధి బాట పడుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈమేరకు.. ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ) సోమవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అప్పులతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తున్నామని అందులో పేర్కొంది. ‘‘2014 నుంచి 2023 వరకు.. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దాదాపు రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసింది. వాటికి చెల్లించాల్సిన వడ్డీలు, కిస్తీలు కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు అవరోధాలుగా మారాయి. వాటిని అధిగమించి, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోంది. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే.. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేశారు.


బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినట్లుగా ఇష్టారాజ్యంగా అప్పుల జోలికి వెళ్లకుండా నియంత్రణ పాటిస్తున్నాం. బడ్జెట్‌ పరిమితులకు లోబడి మార్కెట్‌ రుణాలు తీసుకుని, ప్రణాళిక, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా నిధులను సర్దుబాటు చేస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు నెలలో ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని పరిస్థితి నుంచి.. ఒకటో తేదీన జీతాలు చెల్లించే పద్ధతిని పునరుద్ధరించాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన దాదాపు రూ.లక్ష కోట్ల బిల్లులను క్రమపద్ధతిలో క్లియర్‌ చేసే విధానాన్ని అనుసరిస్తున్నాం’’ అని సీఎంవో వివరించింది. గత ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా చేసిన అప్పులు తీర్చేందుకు ప్రాధాన్యమిస్తున్నట్టు తెలిపింది. తెచ్చిన అప్పు కంటే ఎక్కువగా చెల్లింపులు చేసి.. తెలంగాణ ప్రజలపై మోపిన రుణ భారాన్ని తగ్గిస్తున్నట్లు పేర్కొంది.


  • ఇవీ లెక్కలు..

సీఎంవో విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం.. 2023 డిసెంబర్‌ నుంచి 2024 నవంబర్‌ నెలాఖరు వరకూ రాష్ట్ర ప్రభుత్వం రూ.52,118 కోట్ల మేర అప్పులు చేసింది. అదే సమయంలో వడ్డీలు, కిస్తీల కింద చేసిన చెల్లింపులు రూ.64,516 కోట్లు. అలాగే, ఇచ్చిన మాట ప్రకారం.. చేయూత, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్లలోపు ఉచిత గృహ విద్యుత్తు, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, బియ్యం సబ్సిడీ, ఉపకారవేతనాలు, డైట్‌ చార్జీల పెంపు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.61,194 కోట్లను వ్యయం చేశామని సీఎంవో తన ప్రకటనలో తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి నవంబర్‌ నాటికే దాదాపు రూ.9,888 కోట్లను ఖర్చు చేశామని వివరించింది. ఇలా ఒకవైపు అప్పులను తీరుస్తూనే.. గ్యారెంటీల అమలుకు ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు తెలిపింది. మరీ ముఖ్యంగా.. ఏక కాలంలో రైతులకు రూ.20,617 కోట్ల రుణాన్ని మాఫీ చేసి రికార్డు నెలకొల్పామని.. రాష్ట్రంలోని 25.36 లక్షల రైతు కుటుంబాలను రుణవిముక్తం చేశామని చెప్పింది.


దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఒక్క ఏడాదిలోనే.. రైతుల సంక్షేమానికి, అభివృద్ధికి దాదాపు రూ.57 వేల కోట్లు ఖర్చు చేశామని పేర్కొంది. రుణమాఫీతో పాటు రైతు భరోసా, పంటల బీమా, రైతు బీమా, పంట నష్ట పరిహారం, వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు, పంట ఉత్పత్తుల కొనుగోళ్లు, సన్న వడ్లకు బోనస్‌ కింద భారీగా నిధులను ఖర్చు చేశామని వివరించింది. రాష్ట్రంలో ఆగస్టు, సెప్టెంబర్‌లలో కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన పంటలకు పరిహారంతో పాటు, బాధితులకు సాయం అందించేందుకు రూ.260 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. అప్పులను తీరుస్తూనే మొదటి ఏడాదిలోనే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం గ్యారెంటీల అమలుకు శ్రీకారం చుట్టామని.. మహాలక్ష్మి, గృహజ్యోతితో పాటు యువ వికాసం పథకాలను అమలు చేశామని వివరించింది. అలాగే.. గతంలో నిర్లక్ష్యానికి గురైన నిరుద్యోగులకు ఉద్యోగాలపై భరోసాను కల్పించామని సీఎంవో తన ప్రకటనలోతెలిపింది. తొలి ఏడాదిలోనే వార్షిక ఉద్యోగ క్యాలెండర్‌ను విడుదల చేసి 54,520 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని పేర్కొంది.

Updated Date - Dec 03 , 2024 | 03:48 AM