Share News

Hyderabad: గ్రూప్‌-2కు 46% హాజరు..

ABN , Publish Date - Dec 16 , 2024 | 04:36 AM

రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పేపర్‌-1కు 46.75 శాతం, పేపర్‌-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు.

Hyderabad: గ్రూప్‌-2కు 46% హాజరు..

  • పేపర్‌-1తో పోలిస్తే పేపర్‌-2 తేలిక!

  • జనగామలో అధికారుల నిర్లక్ష్యంతో

  • అవకాశం కోల్పోయిన గిరిజన అభ్యర్థిని

  • సెంటర్‌పై తప్పుడు సమాచారంతోనే..

  • నేటితో ముగియనున్న పరీక్షలు

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రూప్‌-2 పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. పేపర్‌-1కు 46.75 శాతం, పేపర్‌-2కు 46.30 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. అధికారులు పలు కేంద్రాల్లో అలస్యంగా వచ్చిన అభ్యర్థులను అనుమతించలేదు. కొన్నిచోట్ల అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకునేలా పోలీసులు తమ వాహనంలో తీసుకెళ్లి ఔదార్యం చాటుకున్నారు. జనగామలో ఓ గిరిజన అభ్యర్థినిని ముందు పరీక్షా కేంద్రంలోకి అనుమతించిన అధికారులు.. తర్వాత ఆమెది పక్కన ఉన్న కేంద్రమని గుర్తించడం.. అప్పటికే సమయం దాటిపోవడంతో ఆమె పరీక్ష రాసే అవకాశం కోల్పోయింది. వికారాబాద్‌లో ఓ అభ్యర్థి లోదుస్తుల్లో సెల్‌ఫోన్‌ పెట్టుకుని వచ్చి పట్టుబడ్డాడు. సంగారెడ్డిలో ఓ కేంద్రంలో సెల్‌ఫోన్లు, లగేజీ భద్రపరచడానికి సిబ్బంది డబ్బులు వసూలు చేయడంతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. కాగా, ఉదయం నిర్వహించిన పేపర్‌-1 జనరల్‌ స్టడీస్‌ కొంత కఠినంగా ఉందని అభ్యర్థులు చెబుతున్నారు.


ఈ పేపర్‌లో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల విధానాలు, సినీ రంగం, అంతర్జాతీయ అంశాలు, భౌతిక, రసాయన శాస్త్రాలు, రీజనింగ్‌, ఇంగ్లిషు గ్రామర్‌ నుంచి ప్రశ్నలు ఇచ్చారు. మధ్యాహ్నం జరిగిన పేపర్‌-2లో నిజాం నవాబుల కాలం, జోగిని వ్యవస్థ, సికింద్రాబాద్‌ ఉజ్జయిని ఆలయం, జాతీయ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ కమిటీలు, రిజర్వేషన్లు, రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్‌ అధికారాలు, తెలంగాణ జిల్లాలు, మహిళా రిజర్వేషన్‌ వంటి అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. పేపర్‌-1తో పోలిస్తే పేపర్‌-2 కొంత సులభంగా ఉందంటున్నారు. సోమవారం మరో రెండు పేపర్ల పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రంలో సుమారు 783 గ్రూపు-2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు. అధికారులు 1368 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం సూచించారు. హైదరాబాద్‌ బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఫలితాలను త్వరలోనే వెల్లడిస్తామని, గ్రూపు 3 కంటే గ్రూపు 2కు ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.


లోదుస్తుల్లో సెల్‌ఫోన్‌తో పట్టుబడిన అభ్యర్థి

వికారాబాద్‌: వికారాబాద్‌ శ్రీసాయి కాలేజ్‌ ఆఫ్‌ డెంటల్‌ సర్జరీ పరీక్షా కేంద్రంలో ఓ అభ్యర్థి పేపర్‌-2 పరీక్షకు లోదుస్తుల్లో ఫోల్డెడ్‌ మొబైల్‌ పెట్టుకుని వెళ్లాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన చీఫ్‌ సూపరింటెండెంట్‌ తనిఖీ చేయడంతో సెల్‌ఫోన్‌ పట్టుబడింది. అతడిని పోలీసులకు అప్పగించి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. జిల్లా కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌, ఎస్పీ నారాయణరెడ్డి, ఇతర అధికారులు చేరుకుని విచారణ నిర్వహించారు. తనిఖీ చేసిన తర్వాతే అభ్యర్థులను లోపలికి అనుమతిస్తున్నా ఈ ఘటన చోటుచేసుకోవడాన్ని ఉన్నతాధికారులు సీరియ్‌సగా పరిగణిస్తున్నారు.


సెల్‌ఫోన్‌కు రూ.50, లగేజ్‌కు రూ.100!

సంగారెడ్డి రూరల్‌: సంగారెడ్డి శివారులోని ఎంఎన్‌ఆర్‌ మెడికల్‌ కళాశాల సిబ్బంది లగేజ్‌ డిపాజిట్‌కు డబ్బులు వసూలు చేయడంతో గ్రూప్‌ 2 అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. సెల్‌ఫోన్‌కు రూ.50, లగేజీకి రూ.100 నుంచి 200 చొప్పున వసూలు చేసినట్లు అభ్యర్థులు ఆరోపించారు. డబ్బులిస్తేనే లోనికి పంపిస్తామని సిబ్బంది చెప్పడం.. పరీక్ష సమయం దగ్గర పడుతుండడంతో చేసేదేమీ లేకపోయిందన్నారు. అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఈ కేంద్రాన్ని సందర్శించి కళాశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల నుంచి తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయాలని ఆదేశించారు. ఈ కేంద్రంలో 1,182 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు.


పోలీసుల ఔదార్యం

హైదరాబాద్‌ సిటీ/రంగారెడ్డి అర్బన్‌: పోలీసులు మానవతా దృక్పథంతో అభ్యర్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా సాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఓ అభ్యర్థిని పరీక్షా కేంద్రానికి వెళ్లడానికి కొన్ని నిమిషాలే ఉండడంతో ఆందోళన చెందుతూ స్థానిక దేవి గ్రాండ్‌ ప్రాంతంలో విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ రవీందర్‌ను వేడుకోవడంతో ఆయన పెట్రోలింగ్‌ వాహనంలో ఆమెను పరీక్షా కేంద్రం వద్దకు తీసుకెళ్లారు. అలాగే ఇబ్రహీంపట్నంలో బస్సు దిగి ఇబ్బందులు పడుతున్న ఆపరేషన్‌ అయిన మహిళా అభ్యర్థిని గమనించిన ఏసీపీ కేపీవీ రాజు తన వాహనంలో వినోభా నగర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాల పరీక్షా కేంద్రానికి తీసుకెళ్లారు.

Updated Date - Dec 16 , 2024 | 04:36 AM