Ponguleti: 9 నుంచి అసెంబ్లీ
ABN , Publish Date - Nov 22 , 2024 | 02:53 AM
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిసెంబరు 7వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ఆర్వోఆర్ సహా కీలక బిల్లులను ప్రవేశపెడతాం
డిసెంబరు నుంచే కొత్త ఆర్వోఆర్ చట్టం
స్థానిక ఎన్నికల్లోపే ఆసరా పింఛన్ల పెంపు
కొండపోచమ్మ ‘భూసేకరణ’ రద్దు ఎందుకు..?
హరీశ్‌కు ఆ భూములెలా వచ్చాయో తేలుస్తాం
మీడియాతో చిట్‌చాట్‌లో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వచ్చే నెల 9వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. డిసెంబరు 7వ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో 9వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. సచివాలయంలో గురువారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా అనేక అంశాలపై ఆయన మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులను ఆమోదించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కొత్త ఆర్వోఆర్ బిల్లుకు ఆమోదం తెలిపి.. చట్టంగా తీసుకొస్తామని తెలిపారు. డిసెంబరు నుంచే కొత్త ఆర్వోఆర్ చట్టం అమల్లోకి వస్తుందన్నారు. ఇటీవల సీఎంతో జరిగిన సమావేశంలో ఆర్వోఆర్ ముసాయిదాపై స్వల్ప చర్చ జరిగిందని వెల్లడించారు. ఇప్పటికే దీనిపై తుది కసరత్తు జరిగిందని, రెండు రోజుల్లో సీఎం కూడా దీనిపై సమీక్ష నిర్వహించి.. మార్పులు చేర్పులపై సూచనలు చేసే అవకాశం ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల కన్నా ముందే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలా? లేక సమావేశాల తరువాతా? అనే అంశంపైనా కొన్ని రోజుల్లోనే స్పష్టత వస్తుందని తెలిపారు.
దీనిపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. సీఎం తలుచుకుంటే.. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వచ్చే లోపే మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపైనా ప్రభుత్వం దృష్టి సారించినట్లు చెప్పారు. ఆ ఎన్నికల కన్నా ముందే ఆసరా పింఛన్, రైతు భరోసా మొత్తాన్ని పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. బుధవారం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పిన అంశాలను ఏ మీడియా కూడా పసిగట్టలేకపోయిందని పొంగులేటి పేర్కొన్నారు. రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్‌ను బీఆర్‌ఎస్ నాయకుల ఫామ్‌హౌ్‌సల కోసమే నిర్మించారని సీఎం హింట్ ఇచ్చారన్నారు. కొండపోచమ్మ భూసేకరణకు ప్రకటన ఇచ్చిన గత ప్రభుత్వం.. ఆ తరువాత దాన్ని ఎందుకు రద్దు చేసిందో చెప్పాలన్నారు. ఈ అంశంపై తాము విచారణ చేపట్టామని, భూ అక్రమాలకు పాల్పడిన వారి వివరాలన్నీ బయటకు వస్తాయన్నారు. హరీశ్‌రావుకు భూములు ఎలా వచ్చాయో.. విచారణలో తేలిపోతుందని చెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే.. కేటీఆర్ అరెస్టుకు గవర్నర్ అనుమతి ఇప్పించాలని సవాల్ విసిరారు.