CM Revanth Reddy: అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:39 PM
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో స్పందించారు.
హైదరాబాద్, నవంబర్ 25: ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమి అదానీపై వివాదానికి, తెలంగాణ ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంబానీ, అదానీ, టాటా ఎవరికైనా తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారం చేసుకునే హక్కు ఉందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు.. ముఖ్యమంత్రి, మంత్రులకు ఇచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ప్రకటించిన.. రూ.100 కోట్లు స్వీకరించ కూడదని తమ ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్బంగా ఆయన ప్రకటించారు. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు బదిలీ చేయవద్దని.. అదానీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ సైతం రాసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
అనవసర వివాదాల్లోకి లాగ వద్దు..
గత కొన్ని రోజులుగా అదానీ అంశంపై తీవ్ర దుమారం రేగుతోందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం.. నిధులు సేకరించినట్లు ప్రచారం జరుగుతోందన్నారు. అయితే చట్టబద్ధంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయని ఆయన చెప్పారు. నిబంధనల మేరకే టెండర్లు పిలిచి ప్రాజెక్టులు ఇస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగ వద్దని ఈ సందర్బంగా ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
తహతహలాడుతున్న కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారన్నారు. జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని కేటీఆర్ భావిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. కేసీఆర్ కుటుంబం నుంచి ఇప్పటికే కవిత జైలుకు వెళ్లారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. జైలుకెళ్లినవాళ్లు సీఎం అయ్యేదుంటే.. ముందు కల్వకుంట్ల కవిత అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో సీఎం సీటు కోసం పోటీ ఎక్కువగా ఉందన్నారు.
ఢిల్లీ టూర్‌పై క్లారిటీ..
తన తాజా ఢిల్లీ టూర్ పర్యటనపై సైతం సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమే ఈ ఢిల్లీ పర్యటన అని ఆయన స్పష్టం చేశారు. ఈ ఢిల్లీ పర్యటనతో రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేదని ఆయన ప్రకటించారు. పార్లమెంట్ సమావేశాలపై మంగళవారం పార్టీ ఎంపీలతో చర్చిస్తామని ఆయన తెలిపారు. అందుబాటులో ఉన్న మంత్రులను కలిసి.. రాష్ట్ర సమస్యలను వారికి వివరిస్తామని చెప్పారు.
అవసరమైతే ఎన్ని సార్లు అయినా..
అయితే తాను 28 సార్లు ఢిల్లీ వెళ్లానని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీలా పైరవీలు చేయడానికి.. బెయిల్ కోసం తాను ఢిల్లీ వెళ్లడం లేదని బీఆర్ఎస్ అగ్రనేతలను పరోక్షంగా విమర్శించారు. కానీ కేంద్రాన్ని కలిసి మనకు రావాల్సినవి రాబట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం అవసరమైతే ఎన్నిసార్లు అయినా.. ఢిల్లీ వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. అదానీకి ఎన్నో ప్రాజెక్టులు కట్టబెట్టిందని గుర్తు చేశారు. అదానీ సంస్థపై లంచాల విమర్శల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై విధంగా స్పందించారు.
For Telangana News And Telugu News