BC Population: బీసీ కులగణనకు డెడికేటెడ్ కమిషన్
ABN , Publish Date - Nov 04 , 2024 | 03:46 AM
రాష్ట్రంలో బీసీ జనాభా గణనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల లెక్కలు తీసేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
నేడే ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశం
హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మంత్రులతో ముఖ్యమంత్రి భేటీ
కమిషన్ ఏర్పాటుకు నిర్ణయం.. చైర్మన్, ముగ్గురు సభ్యులు!
చిత్తశుద్ధితో ఉన్నామన్న రేవంత్.. 6 నుంచి రాష్ట్రంలో కులగణన
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీసీ జనాభా గణనకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల లెక్కలు తీసేందుకు బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సోమవారంలోగా కమిషన్‌ను ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన జీవో జారీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలను శాస్త్రీయమైన పద్ధతిలో తేల్చేందుకు డెడికేటెడ్ కమిషన్‌ను రెండు వారాల్లో నియమించాలంటూ హైకోర్టు అక్టోబరు 30న ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
బీసీల జనాభాను లెక్కించే పనిని బీసీ కమిషన్‌కు అప్పగించడం చెల్లదని, ఇందుకు రాజ్యాంగంలోని నిబంధనలు అంగీకరించవని పేర్కొంటూ మాజీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా లెక్కలు తేల్చేందుకు ప్రత్యేక కమిషన్ తప్పనిసరి అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో అందుబాటులో ఉన్న మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కులగణన, స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు లేవనెత్తిన అంశాలపై సమీక్షించారు. అందరి ఏకాభిప్రాయం మేరకు బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
బీసీ కులగణనపై చిత్తశుద్ధితో ఉన్నాం..
బీసీ కులగణనపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఈ విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. స్థానిక సంస్థల రిజర్వేషన్ల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి కులగణన ప్రారంభించనున్న నేపథ్యంలో.. బీసీ రిజర్వేషన్లపై భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా కోర్టు తీర్పులకు అనుగుణంగా నడచుకోవాలని అన్నారు. కాగా, బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య స్వాగతించారు. రాష్ట్రంలోని బీసీ సమాజం తరఫున ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉందని, బీసీలపై ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని అన్నారు.
కమిషన్‌కు చైర్మన్, ముగ్గురు సభ్యులు..
బీసీ డెడికేటెడ్ కమిషన్‌ను చైర్మన్, ముగ్గురు సభ్యులు, ఒక మెంబర్ సెక్రటరీతో ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఏర్పాటైన రాష్ట్ర బీసీ కమిషన్‌కు కూడా చైర్మన్, ముగ్గురు సభ్యులతోపాటు ఒక మెంబర్ సెక్రటరీ ఉన్న విషయం తెలిసిందే.