TGPSC: గ్రూప్-4 ఫలితాలు విడుదల
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:56 AM
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-4 పరీక్ష ఫలితాలను వెల్లడించింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను గురువారం విడుదల చేసింది.
8,084 మందికి ఉద్యోగాలు..96 పోస్టుల భర్తీ పెండింగ్
హైదరాబాద్, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-4 పరీక్ష ఫలితాలను వెల్లడించింది. పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను గురువారం విడుదల చేసింది. ఆ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని.. అభ్యర్థులు పరిశీలించుకోవచ్చని అధికారులు సూచించారు. మొత్తం 8,180 గ్రూప్-4 పోస్టుల భర్తీ కోసం 2022 డిసెంబర్ 1న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు 9,51,321 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది జూలై 1న అభ్యర్థులకు పరీక్షలను నిర్వహించారు.
ఆ తర్వాత అభ్యర్థులను షార్ట్ లిస్టు చేసి, ఈ ఏడాది జూన్ నుంచి నవంబరు 10వ తేదీ వరకు దశల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫలితాలను వెల్లడించారు. ప్రస్తుతం 8,084 మంది అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న మరో 96 పోస్టులను భర్తీ చేయలేదు. ఇందులో 59 పోస్టులను వివిధ కారణాలతో ‘విత్ హోల్డ్’లో ఉంచారు. మరో 37 పోస్టులకు సంబంధించి ఆయా కేటగిరీల్లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో భర్తీ చేయలేదు. ఇక పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలోనే నియామక పత్రాలను అందించనున్నారు.