Share News

CM Revanth Reddy: ఖైరతాబాద్ గణేశుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్

ABN , Publish Date - Sep 07 , 2024 | 11:54 AM

ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ పూర్తైంది. ఖైరతాబాద్ గణనాధుడి వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు.

CM Revanth Reddy: ఖైరతాబాద్ గణేశుడికి పూర్తైన తొలి పూజ.. హాజరైన రేవంత్

హైదరాబాద్: ఖైరతాబాద్ మహా గణపతికి తొలి పూజ పూర్తైంది. ఖైరతాబాద్ గణనాధుడి వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు చేరుకుని తొలి పూజలో పాల్గొన్నారు. రేవంత్‌కు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మహా గణపతి తొలిపూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు. ఇవాళ ఉదయమే ఒగ్గుడోలు, బోనాలెత్తుకున్న మహిళలతో పద్మశాలీయులంతా ఊరేగింపుగావచ్చి ఖైరతాబాద్ గణేశునికి చేనేత నూలు కండువా, గాయత్రి సమర్పించారు. గత ఏడాది 63 అడుగుల ఎత్తున్న వినాయకుడిని ప్రతిష్టించగా.. ఈ ఏడాది 70 వసంతాల సందర్భంగా.. ఈ ఏడాది 70 అడుగుల ఎత్తులో బడా గణేష్ కొలువుదీరాడు.


పది రోజుల పాటు మహా గణపతి భక్తుల పూజలు అందుకున్న మీదట ఈ నెల 17 వ తేదీన ఘనంగా నిమజ్జన వేడుక జరుగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పూజలో పాల్గొననున్నారు. ఈ ఏడాది శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణనాథుడు భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పూర్తిగా మట్టితో చేసిన ఎకో ఫ్రెండ్లీ బడా గణేష్. గణేష్ ప్రతిను రూపొందించే పనులు ఆలస్యంగా ప్రారంభమయినా తక్కువ సమయంలోనే విగ్రహాన్ని ఉత్సవ కమిటీ పూర్తి చేసింది. ఈసారి ఖైరతాబాద్ విగ్రహ తయారీలో 190 మంది కళాకారులు పాల్గొన్నారు. ఖైరతాబాద్ మహాగణపతికి ఇరువైపులా శ్రీనివాస కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం ప్రతిమలు ఉన్నాయి.


బడా గణేష్ విగ్రహ పాదాల చెంత ప్రత్యేక ఆకర్షణగా అయోధ్య బాలరాముడి విగ్రహం రూపొందింది. ఇక మహా గణపతిని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేయనున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకునేందుకు రానున్నారు. వారి కోసం ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. వర్షంలో భక్తులు తడవకుండా ప్రత్యేకంగా షెడ్లను సైతం నిర్వాహకులు ఏర్పాటు చేశారు. గతేడాది బడా గణేష్‌ని దాదాపు 22 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. ఈ ఏడాది 30 లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని ఉత్సవ్ కమిటీ భావిస్తోంది.

Updated Date - Sep 07 , 2024 | 12:09 PM