BRS: జైనూర్ బాధితురాలిని పరామర్శించిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు.. ఆమె కుమారుడు ఏం చెప్పాడంటే..
ABN , Publish Date - Sep 06 , 2024 | 12:03 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నేడు బాధితురాలిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు.
కొమురం భీం ఆసిఫాబాద్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో ఓ మహిళపై ఆటో డ్రైవర్ అత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. నేడు బాధితురాలిని బీఆర్ఎస్ నేతలు హరీష్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి పరామర్శించారు. తన తల్లిపై జరిగిన అఘాయిత్యంపై బాధితురాలి కుమారుడు మాట్లాడుతూ.. రాఖీ కట్టేందుకు తన తల్లి ఆటోలో వెళ్తుంటే అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి దాడి చేశారని వివరించాడు. హత్యాచార యత్నం చేయడంతో, తన తల్లి ప్రతిఘటించిందని.. దీంతో ఆమెకు గాయాలు అయ్యాయని తెలిపాడు. ఈ ఘటనపై హరీష్ రావు మాట్లాడుతూ.. జైనూర్ ఘటన అత్యంత పాశవికంగా జరిగిందన్నారు. ఈ మధ్య కాలంలో తరుచుగా ఇటువంటి ఘటనలు అనేకం చోటుచేసుకుంటున్నాయన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత 1900 అత్యాచారం కేసులు నమోదు అయ్యాయన్నారు. మా ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో మాట్లాడితే... స్పందన లేదన్నారు. ఆ మరుసటి రోజు మరొక ఘటన చోటుచేసుకుందన్నారు. హైద్రాబాద్ అంటే ఒకప్పుడు మతకలహాలు జరుగుతాయని అనేవారని... అప్పట్లో కేసీఆర్ లా అండ్ ఆర్డర్‌నీ అదుపులోకి తెచ్చారన్నారు. కానీ ఇప్పుడు అస్తవ్యస్తం అయ్యిందన్నారు.
ముఖ్యమంత్రికి సమయం లేదా?
దేశంలో అనేక సంస్థలు ఇక్కడ క్రైమ్ రెట్ తక్కువ అని ప్రశంసించారన్నారు. ఇప్పుడు హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నారన్నారు. కేసీఆర్ అద్భుతంగా పరిపాలించారని హరీష్ రావు కొనియాడారు. అసలు ఈ రాష్ట్రం లో ఏం జరుగుతోందని ప్రశ్నించారు. యువకుల చేతుల్లో తుపాకులు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్రంలో తుపాకులు రాజ్యమేలుతున్నాయని.. ఈ 9 నెలల్లో నాటు తుపాకులు ఇప్పటికే వందల సంఖ్యలో దొరికాయన్నారు. కొత్త డీజీపీ వచ్చిన తరువాత మతకలహాలు జరుగుతున్నాయన్నారు. మెదక్‌లో లా అండ్ ఆర్డర్‌లో ఫెయిల్ అయిన తరువాత ఒక అధికారిని తీసుకుని వచ్చి హైదరాబాద్‌లో మంచి స్థానంలో అపాయింట్ చేశారన్నారు. డయల్100 కూడా పనిచెయ్యడం లేదని.. పోలీసులను సైతం పని చెయ్యనియ్యడం లేదన్నారు. వారిని ఇతర కార్యక్రమాలకు వాడుతున్నారని హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ వరద విపత్తు సహాయం చెయ్యడంలో విఫలం అయ్యారని విమర్శించారు. రోజు అత్యాచారాలు, ప్రతిపక్షాలను వేధించడం... ఇవే కనిపిస్తున్నాయన్నారు. నిన్న ఎన్‌కౌంటర్ జరిగిందని.. కేసీఆర్ హయంలో ఒక్క ఎన్‌కౌంటర్ కూడా జరగలేదని.. కాంగ్రెస్ వచ్చిందని హరీష్ రావు పేర్కొన్నారు. జైనూర్ ఘటన పై ప్రభుత్వం స్పందించాలన్నారు. గిరిజన మహిళపై అత్యాచార యత్నం జరిగితే పరామర్శించడానికి ముఖ్యమంత్రికి సమయం లేదా? అని ప్రశ్నించారు. వెంటనే ఆమెకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.
ప్రాణం తరుక్కుపోతోంది..
ఘటనపై సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. జైనూరు ఘటన బాధితురాలిని పరమర్శించామని ఆమెకు మంచి వైద్యాన్ని అందించాలని కోరారు. ఆమెపై దాడి దారుణంగా జరిగిందని.. ఒళ్ళంతా గాయాలు... చూస్తేనే ప్రాణం తరుక్కుపోతుందన్నారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని.. సీరియస్ యాక్షన్ తీసుకోవడం లేదని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. దాడికి పాల్పడ్డ వారిని కఠిన చర్యలు తీసుకోవాలని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా న్యాయం చెయ్యాలని సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బాధితురాలిని పరామర్శించామని ఆమెను చూస్తే ఎంత బాధించబడిదో అర్ధం అవుతోందన్నారు. రాష్ట్రంలో గడిచిన 8 నెలల్లో మహిళలపై అరాచకాలు, అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. ఈ అంశాలపై అసెంబ్లీలో నోరెత్తినా కూడా స్పందన లేదన్నారు. హైద్రాబాద్ లో మహిళలకు భరోసా కానీ భద్రత కానీ లేదన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చిన మహిళలు, అమ్మాయిలు ఎలా వస్తారో అని భయంగా ఉందన్నారు. మా హయంలో షీ టీమ్ పకడ్బంధీగా పనిచేసిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలపై చులకన భావం ఉందని సబిత అన్నారు.