Tummala Nageswara Rao: బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని సందర్భం
ABN , Publish Date - Jul 18 , 2024 | 12:57 PM
దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఒక ప్రభుత్వం రూ.2లక్షల రుణ మొత్తాన్నీ మాఫీ చేయడం మీరు అందరూ ఈ రోజు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
హైదరాబాద్: దేశ చరిత్రలోనే మొట్ట మొదటిసారి ఒక ప్రభుత్వం రూ.2లక్షల రుణ మొత్తాన్నీ మాఫీ చేయడం మీరు అందరూ ఈ రోజు చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు తుమ్మల కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. తనకు తెలిసి మీ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది కనీవినీ ఎరుగని సందర్భమని అన్నారు. మేము ఈ పథకం ప్రకటించి ఓకేసారి మాఫీ చేస్తామని చెప్పినప్పుడు చాలా మంది బ్యాంకర్లు కు కూడా నమ్మకం కుదరలేదని.. దానికి కారణం కూడా లేక పోలేదని తుమ్మల అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం రెండు విడతలలో చేసిన రుణమాఫీని మీరు ప్రత్యక్షంగా చూశారు కావున నమ్మలేదని తుమ్మల అన్నారు.
అనేక మంది బ్యాంకర్స్ కూడా పలు సందర్భాల్లో గత రెండు పర్యాయాలు అమలు చేసిన తీరుతో రుణమాఫీ వల్ల రైతులకు ప్రయోజనం చేకూరలేదన్న అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తున్న 2లక్షల రుణ మాఫీ వంటి బృహత్తర కార్యక్రమంలో మీరందరు కూడా భాగస్వామ్యులేనన్నారు. మా ప్రభుత్వం ఈ రుణ మాఫీ పథకాన్ని ఆగస్ట్ కల్లా పూర్తి చేయడానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అన్న మాట ప్రకారం.. మొదటి విడతలో కుటుంబానికి లక్ష వరకూ ఉన్న పంట రుణాలన్నీ ఏకకాలంలో మాఫీ చేస్తున్నామని తుమ్మల పేర్కొన్నారు. 10,83,004 కుటుంబాలకు 6098.93 కోట్ల రూపాయలు ఈ రోజు వారి రుణఖాతాలలో జమ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా బ్యాంకర్లు అందరికీ మా ప్రభుత్వం తరఫున ఒకటే విజ్ఙప్తి చేస్తున్నట్టు తుమ్మల పేర్కొన్నారు.
రైతు రుణాన్ని రెన్యువల్ చేసుకున్నట్లయితే వారికి నగదు రూపంలో ఖాతాలకు జమచేయబడిన మొత్తాన్ని చెల్లించాలని తెలిపారు. ఒకవేళ రైతు పంటరుణాన్ని బాకీ పడ్డట్లైతే వారికి ప్రభుత్వాలు విడుదల చేసిన మొత్తాన్ని రుణం కింద జమ చేసుకొని, కొత్త రుణాన్ని వెంటనే మంజూరు చేయాలని తుమ్మల సూచించారు. ప్రభుత్వం నుంచి పంట రుణమాఫీకి చెల్లించే మొత్తం రైతులకు తప్పకుండా చేరే బాధ్యత ప్రతి ఒక్క బ్యాంకు తీసుకోవాలి. ఆ విధంగా మీ శాఖలన్నింటికి అదేశాలు ఇవ్వాలని తుమ్మల సూచించారు. ప్యాక్స్‌లకి సంబంధించి డీసీసీబీలకి విడుదల చేసే మొత్తం ఒకటి లేదా రెండు రోజుల్లో సంబంధిత రైతుల ఖాతాలకు జమ చేయాల్సిందేనన్నారు. వచ్చే నెల రోజులు బ్యాంకులలో రద్దీని తట్టుకొనే విధంగా ఏర్పాట్లు చేసుకోండి. రుణాల రెన్యువల్, నగదు చెల్లింపులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయించాలని సూచించారు. ఏ బ్యాంక్ అయినా ప్రభుత్వ ఉత్తర్వులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి రైతులను ఇబ్బందులకు గురిచేస్తే ఈ ప్రభుత్వం ఎట్టిపరిస్థితులలోనూ ఉపేక్షించబోదని తుమ్మల అన్నారు.
ఇవి కూడా చదండి...
Tomato prices: ఠారెత్తిస్తున్న టమాటా!
High Court: బీఆర్‌ఎస్‌కు ఇచ్చిన 11 ఎకరాలు మావే..
Read Latest Telangana News And Telugu News