Ponnam Prabhakar: నేడు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అందిస్తున్నాం
ABN , Publish Date - Aug 15 , 2024 | 12:55 PM
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజి మైదానంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు.
సిద్దిపేట: సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజి మైదానంలో 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొని పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, పోలీస్ కమిషనర్ అనురాధ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వివిధ ప్రభుత్వ పథకాలపై అధికారులు శకటాల ప్రదర్శన చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలతో చిన్నారులు అలరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాపాలన, పారదర్శక పాలన సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు దక్కలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఆడపడుచులు, ట్రాన్స్ జెండర్‌లకు ఆర్టీసీ బస్సులో ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకూ 2 కోట్ల 23 లక్షల మంది మహిళలు ఉచిత రవాణా సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచామన్నారు. నిరుపేదలకు ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నిజం చేయాలనీ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. పెరుగుతున్న ధరల ప్రభావం పెద ప్రజలపై పడ వద్దని మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సరఫరా చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గృహ జ్యోతి కార్యక్రమం కింద 200 లోపు విద్యుత్ వినియోగదారులకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోందని పొన్నం ప్రభాకర్ తెలిపారు.
జిల్లాలో మొదటి విడత 53,129 రైతులకు 290 కోట్లు, రెండవ విడత 27875 మంది రైతులకు 277 కోట్ల రూపాయలు రుణమాఫి చేశామన్నారు. నేడు రెండు లక్షల రూపాయల రుణమాఫి అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మహిళలందరినీ కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంగా స్వయం సహాయక సంఘాలను బలోపేతం చేస్తూ జీవనోపాధి పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ మహిళా శక్తి పథకం ప్రవేశ పెట్టామన్నారు. జిల్లాలోని 499 గ్రామ పంచాయితీలలో ఈ నెల 5 నుంచి 9 వరకూ 5 రోజుల పాటు స్వచదనం పచ్చదనం విజయవంతంగా నిర్వహించామన్నారు. గంజాయి, డ్రగ్స్ , కొకైన్ లాంటి మత్తు పదార్థాలపై జిల్లాలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి జిల్లాను మాదకద్రవ్యా రహిత జిల్లాగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నామని పొన్నం ప్రభాకర్ తెలిపారు.