Share News

Mahesh Kumar Goud: రేవంత్ తర్వాత పీసీసీ కావడం బిగ్ టాస్క్.. తొలిసారి ఏబీఎన్‌తో మహేశ్ గౌడ్

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:24 AM

తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కాక సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్ తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు..

Mahesh Kumar Goud: రేవంత్ తర్వాత పీసీసీ కావడం బిగ్ టాస్క్.. తొలిసారి ఏబీఎన్‌తో మహేశ్ గౌడ్

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి దక్కాక సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) తొలిసారిగా ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ‘నాది నలభై ఏండ్ల నిరీక్షణ. రేవంత్ రెడ్డి తర్వాత పీసీసీ చీఫ్ కావడం బిగ్ టాస్క్. బీఆర్ఎస్ పార్టీ బీసీ నేతకు పార్టీ పగ్గాలు ఇవ్వగలదా?. నా కష్టాన్ని గుర్తించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు. రేవంత్, మహేశ్ జోడిగా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేస్తాం. పదవి కోసం ఎలాంటి నేను పైరవీలు చేయలేదు. బీఆర్ఎస్, బీజేపీ గురించి తెలంగాణ ప్రజలు మర్చిపోయారు. నాకు పార్టీ మాత్రమే ప్రధానం. మంత్రులు, పార్టీ సీనియర్లు నాకు మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉంది. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాను’ అని ఏబీఎన్‌తో మహేశ్ గౌడ్ పంచుకున్నారు.


mahesh-kumar-goud.jpg

ఊహించినట్టుగానే..!

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) నూతన అధ్యక్ష నియామకంపై ఊహాగానాలకు కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎట్టకేలకు తెరదించింది. అందరూ ఊహించినట్లుగానే బీసీ నేతకే పట్టం కట్టింది. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా బొమ్మ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్న మహేశ్‌కుమార్‌ గౌడ్‌కు సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నిర్ణయం తీసుకున్నారని, ఈ నియామకం వెంటనే అమల్లోకి వస్తుందని పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు. ఇంతకాలం పీసీసీ అధ్యక్షుడిగాముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అందించిన సేవలను పార్టీ ప్రశంసిస్తోందని ఆయన పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో గౌడ సామాజికవర్గం నుంచి ఎంపికైన తొలి పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ నిలిచారు. అలాగే టీపీసీసీకి నాలుగో అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న మహేశ్‌కుమార్‌గౌడ్‌.. మూడేళ్లుగా టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీ సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నారు. కాగా, టీపీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్‌రెడ్డి పదవీకాలం పూర్తయిన దగ్గర్నుంచి నూతన అధ్యక్ష నియామకంపై అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది. రెడ్డి సామాజిక వర్గానికి సీఎం పదవి ఉన్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్ష పదవిని బీసీలకు కేటాయించాలంటూ ఆ వర్గానికి చెందిన పలువురు నేతలు అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ నేతలూ తమ సామాజిక వర్గాలకు కేటాయించాలని హైకమాండ్‌ను అడిగారు.


Mahesh-Gowd.jpg

విధేయతకు దక్కిన గౌరవం..

టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు. ఇది విధేయతకు దక్కిన గౌరవమని పేర్కొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియామకంతో బలహీన వర్గాలకు సముచిత ప్రాధాన్యం దక్కిందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇది బీసీల పట్ల కాంగ్రెస్‌ పార్టీ నిబద్దతకు నిదర్శనమన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మార్గదర్శకత్వం, మహేశ్‌కుమార్‌గౌడ్‌ నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ మరింత బలపడుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కాగా, మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సారథ్యంలో బీసీలకు పూర్వవైభవం వస్తుందని ఆశిస్తున్నట్లు మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహేశ్‌కుమార్‌ గౌడ్‌ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడం సరైనదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మహేశ్‌కుమార్‌గౌడ్‌ నియామకం పట్ల టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తూర్పు జగ్గారెడ్డి, గీతారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, బీసీ కమిషన్‌ చైర్మన్‌ గోపిశెట్టి నిరంజన్‌ తదితరులు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు అభినందనలు తెలిపారు. గాంధీభవన్‌లో పలువురు నేతలు బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 07 , 2024 | 10:42 AM