Share News

Food Poisoning: బడిలో కలుషిత ఆహారం ప్రాణం తీసింది

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:12 AM

కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (14) సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతు న్న 20 మంది విద్యార్థులు.. అక్టోబరు 30న పాఠశాలలో వాంతులు విరేచనాలతో అ స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

Food Poisoning: బడిలో కలుషిత ఆహారం ప్రాణం తీసింది

  • గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని మృతి

  • కలుషిత ఆహారంతో తీవ్ర అస్వస్థత

  • 20 రోజులుగా నిమ్స్‌లో వెంటిలేటర్‌పై.. పాప మృతికి ప్రభుత్వమే కారణం: హరీశ్‌

వాంకిడి, హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25: కలుషిత ఆహారం తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థిని చౌదరి శైలజ (14) సోమవారం సాయంత్రం మృతి చెందింది. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతు న్న 20 మంది విద్యార్థులు.. అక్టోబరు 30న పాఠశాలలో వాంతులు విరేచనాలతో అ స్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వారిలో తొమ్మిదో తరగతి చదువుతున్న శైలజ, మరో ఇద్దరు తప్ప మిగతా అందరూ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ ముగ్గురికీ మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స అందించి.. మరింత మెరుగైన వైద్యం కోసం ఈ నెల 5న హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి మెరుగుపడడంతో డిశ్చార్జ్‌ చేశారు. శైలజను దాదాపు 20 రోజులుగా వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. శైలజ మరణవార్త వినగానే ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.


పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే శైలజ మృతిచెందిందని ఆమె కుటుంబసభ్యులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. విద్యార్థులు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురై దాదాపు 27 రోజులు కావస్తున్నా అందుకుగల కారణాలను అధికారులు తెలుపకపోవడంపై మండిపడుతున్నారు. ప్రభుత్వం శైలజ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇల్లు, నష్టపరిహారం అందించాలని మాలీ సంఘం నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. కాగా.. శైలజ మృతికి ప్రభుత్వమే బాధ్య వహించి, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌చేశారు. సర్కారు నిర్లక్ష్యానికి, అధికారుల అలసత్వానికి శైలజ బలైందని ఆయన ధ్వజమెత్తారు. గురుకులంలో నాణ్యత లేని భోజనం పెట్టడం ఒక పాపం కాగా.. అస్వస్థతకు గురైన విద్యార్థులకు సకాలంలో మెరుగైన చికిత్స అందించకపోవడం మరో పాపమని హరీశ్‌ మండిపడ్డారు.

Updated Date - Nov 26 , 2024 | 04:12 AM