Suryapet: ట్యూటర్ మాటలు నమ్మి.. బావిలో ఈతకు దిగి హాస్టల్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:56 AM
తనకు ఈత రాదని విద్యార్థి చెప్పినా వినని ఓ ట్యూటర్ ‘నేనున్నాను నీకేమీ కాదు దూకు’ అంటూ అతడిని రెచ్చగొట్టి బావిలోకి దింపి విద్యార్థి మృతికి కారణమయ్యాడు. ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది.
సూర్యాపేట జిల్లా అనంతగిరిలో ఘటన
అనంతగిరి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): తనకు ఈత రాదని విద్యార్థి చెప్పినా వినని ఓ ట్యూటర్ ‘నేనున్నాను నీకేమీ కాదు దూకు’ అంటూ అతడిని రెచ్చగొట్టి బావిలోకి దింపి విద్యార్థి మృతికి కారణమయ్యాడు. ఆదివారం సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం శాంతినగర్‌లో ఈ ఘటన జరిగింది. చింతలపాలెం మండలం నక్కగూడెం గ్రామానికి చెందిన గుగులోతు తిరుమలేశ్ (15) శాంతినగర్‌లోని సమీకృత హాస్టల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్నాడు. ఇదే హాస్టల్లోశాంతినగర్ గ్రామానికి చెందిన వీరబాబు విద్యార్థులకు రోజూ ట్యూషన్ చెబుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ట్యూషన్ పూర్తయిన అనంతరం విద్యార్థులు తిరుమలేశ్, రాజేశ్‌లను పొలంలో టేకు చెట్లు నరికేందుకు వీరబాబు తీసుకెళ్లాడు. చెట్లు నరికిన అనంతరం పొలం పక్కన ఉన్న బావిలో స్నానం చేసేందుకు వీరబాబు మొదట దిగాడు.
తిరుమలేశ్ని కూడా బావిలో దిగి స్నానం చేయాలని కోరాడు. తనకు ఈత రాదని తిరుమలేశ్ చెప్పినా వినకుండా ‘నేనున్నాను నీకేమి కాదు దూకు’ అంటూ వీరబాబు అతడిని రెచ్చగొట్టాడు. వీరబాబు మాటలు నమ్మిన తిరుమలేశ్ బావిలో దూకి ఈత రాక ప్రాణాలు కోల్పోయాడు. గజ ఈతగాళ్లు, గ్రామస్థులు బావి వద్దకు చేరుకుని తిరుమలేశ్ మృతదేహాన్ని బయటికి తీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.