Bathukamma Fest: పూలనే దేవుళ్లుగా కొలిచే ఆడబిడ్డల పండుగ.. బతుకమ్మ విశేషాలు తెలుసా
ABN , Publish Date - Sep 23 , 2024 | 03:48 PM
దేవుళ్లను పూలతో పూజించడం మనకు తెలుసు. పూలనే దేవుళ్లుగా కొలిచి పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. అలాంటి పండుగ తెలంగాణలో ఉండటం గర్వకారణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి.
హైదరాబాద్: దేవుళ్లను పూలతో పూజించడం మనకు తెలుసు. పూలనే దేవుళ్లుగా కొలిచి పూజించే సంస్కృతి బహుషా ప్రపంచంలో ఎక్కడా ఉండకపోవచ్చు. అలాంటి పండుగ తెలంగాణలో ఉండటం గర్వకారణం. మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలు షురూ కానున్నాయి. తెలంగాణ ఉద్యమ కాలంలో పాటకు ఎంత ప్రాధాన్యత ఉండేదో.. బతుకమ్మ కూడా అంతే. మిలియన్ మార్చ్ నుంచి వంటావార్పు వరకు ఇలా చరిత్రలో ఎన్నో తెలంగాణ ఉద్యమాలకు బతుకమ్మ కేరాఫ్‌గా నిలిచింది. తెలంగాణ అస్తిత్వ పోరాట చిహ్నంగా 'బతుకమ్మ' మారిందనడంలో అతిశయోక్తి లేదు. మరి అంతటి ప్రాధాన్యత కలిగిన బతుకమ్మ గురించి మీకు తెలుసా. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
విశిష్టత..
ప్రకృతితో మమేకమై ఆటపాటలతో, ఆనందోత్సాహాల మధ్య పండుగ జరుపుకోవాలనేదే బతుకమ్మ ప్రధాన ఉద్దేశం. ఏటా ఈ పండుగ సమీపించే సమయానికి ప్రకృతి అంతా పూలవనంగా మారిపోతుంది. ప్రకృతిలో సేకరించిన పూలను ప్రకృతికే సమర్పించుకోవాలనే బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేసి విడిచిపెడతారు. నిత్యనూతనమై తెలంగాణ వాకిట్లో సిరులొలికించే ప్రకృతి పండుగ బతుకమ్మను మహిళలు భక్తి పారవశ్యంతో జరుపుకోవడం ఆనవాయితీ. వర్షాకాలపు చివర్లో, శీతాకాలపు తొలిరోజుల్లో వచ్చే ఈ పండుగ వేళ వర్షాలతో జలాశయాలు కళకళ లాడుతుంటాయి. రకరకాల పువ్వులు, రంగురంగులతో ఆరుబయళ్లలో వికసించి ప్రకృతికే కనువిందు చేస్తుంటాయి. గునుగుపూలు, తంగేడు పూలు ఎక్కడ చూసినా విరబూసే ఉంటాయి. బంతి, చేమంతి, నందివర్థనం లాంటి పూలకు కూడా ఇదే సీజన్. సీతాఫలాలు కూడా ఈ సమయంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణ. గుమ్మడి, కట్లాయి, అల్లీపూలు ఇదే సమయంలో బాగా విరబూస్తాయి.
పితృ అమవాస్యతో ప్రారంభమై..
అశ్వయుజ మాసం పెత్రమాస (మహాలయ అమావాస్య, పితృ అమావాస్య)తో బతుకమ్మ వేడుకలు ఆరంభమవుతా యి. అష్టమి వరకు కొనసాగే ఈ పండుగలో కేవలం ఆచారమే కాదు.. శాస్త్రీయత దాగి ఉంది. కొత్త బట్టలు ధరించి, ఇత్తడి తాంబూలంలో గుమ్మడి ఆకులు పరిచి, వాటిమీద తంగేడు పూలు పేరుస్తారు. కాస్తఎత్తులో పూలను పేర్చిన తర్వాత గునుగు, బంతి, చామంతి, అడవి చామంతి, ముత్యాలపువ్వు, రుద్రాక్ష, నీల గోరింట, పట్టుకుచ్చులు, కట్ల, బీర ఇలా బతుకమ్మలను పేర్చడంలో రకరకాల పూలను వినియోగిస్తారు.
ఔషధ గుణాలు..
బతుకమ్మకు వాడే పూలన్నీ ఎన్నో ఔషధగుణాలు కలిగి ఉంటాయి. తంగేడు పూలు గొంతు, మూత్ర సంబంధిత సమస్యలకు ఔషధం. గునుగు పువ్వు యాంటీ డయేరియా, యాంటీ డయోబెటిక్ లక్షణాలు కలిగి ఉంటుంది. బంతిపువ్వు క్రిమిసంహారిణి, దోమలను నివారించే శక్తికలిగి ఉంటుంది. చామంతిని కాలిన గాయాలకు, దెబ్బలకు, కంటి సంబంధిత రోగాలకు, జీర్ణానికి ఔషధంగా వాడతారు. ఇది యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు కలిగి కాలుష్య కారకాలను బెంజిన్, అమ్మోనియా వాయువులను పీల్చుకుని గాలిని శుద్ధి చేస్తుంది. ఇలా బతుకమ్మ పేరిట వాడే ప్రతీ పువ్వుకు అనేక ఔషధ గుణాలున్నాయి. ఈ పూలన్నింటినీ గోపురంలా పేర్చాక పైన గుమ్మడి పువ్వుగొడుగు పెడతారు. తమల పాకులో పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పక్కనే దీపం వెలిగిస్తారు. పసుపు శుభసూచకం. అంతేకాదు క్రిమి సంహారిణి కూడా. ఇక దీపం జ్ఞానానికి సంకేతం. అది గాలిని శుద్ధి చేస్తుంది. క్రిములను హరిస్తుంది. బతుకమ్మల్లోని పూలకున్న ఔషధగుణాలు నిమజ్జనం సందర్భంగా నీటిని శుద్ధి చేసి, నీటి ద్వారా వచ్చే రోగాలను హరిస్తాయి.
విశిష్టత ఇలా..
తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగలో ఎన్నో విశిష్టతలు దాగి ఉన్నాయి. అడపడుచులు తమ మనోభావాలను పాటల ద్వారా వెల్లడిస్తారు. సంతోషాన్ని అడుగులు, చప్పట్ల ద్వారా ప్రదర్శిస్తూ పారవశత్వం చెందుతారు. స్త్రీల సౌందర్య ఆరాధనం, అలంకార నైపుణ్యం, కళాత్మక దృష్టి, బతుకమ్మను పేర్చడంలో ఉట్టిపడుతుంది. పండుగలో తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మలు పేర్చడం ద్వారా తల్లి పక్కనే పిల్ల ఉండాలనే స్త్రీమాతృ హృదయం ఎలాంటిదో అవగతమవుతుంది. త్రికోణం స్త్రీకి సంకేతం. త్రికోణం (పిరమిడ్ ఆకారం)లోని పసుపుముద్ద సంతాన, సౌభాగ్య ప్రదాయిని అయిన గౌరీదేవికి చిహ్నమని పూర్వీకులు ఆడపడుచులకు అర్థమయ్యే రీతిలో చెబుతుంటారు. ‘బతుకమ్మ బ తుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో’ అంటూ సాయంత్రం ఇంటి ముందు కానీ, వీధిలో కానీ, దేవాలయంలో, చెరువు, వాగుల్లో ఇలా ప్రతి చోటా ఆడపడుచులంతా చేరి బతుకమ్మలను మధ్యలో ఉంచి పాటలు పాడతారు. ఒకరు పాడుతుంటే మిగతా మహిళలంతా వంతపాడుతుంటారు.
ఏ రోజు ఏ బతుకమ్మ అంటే..
తొలిరోజు ఎంగిలిపూల బతుకమ్మ, రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నాన బియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ, ఆరోరోజు అలిగిన బతుకమ్మ, ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ ఇలా రోజుకో పేరుతో అమ్మవారిని కొలుస్తారు. ఆరో రోజున అలిగిన బతుకమ్మకు నివేదన ఉండదు. మిగిలిన రోజుల్లో రకరకాల పదార్థాలను అమ్మకు నైవేధ్యంగా సమర్పిస్తారు.
For Latest News and National News click here