UTF: ఎయిడెడ్ టీచర్ల నవంబరు వేతనాలు విడుదల చేయాలి: యూటీఎఫ్
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:43 AM
ఎయిడెడ్ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నవంబరు నెల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) డిమాండ్ చేసింది.
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎయిడెడ్ విద్యా సంస్థల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు నవంబరు నెల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శికి గురువారం వినతిపత్రాన్ని అందజేశారు. వేతనాలు అందక ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, వారందరూ క్రిస్మస్ పండుగకు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
పెండింగ్‌లో ఉన్న వేతనాలను ఆర్థికశాఖ వెంటనే విడుదల చేయాలని వారు కోరారు. కాగా, ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) 6వ ద్వైవార్షిక విద్యా వైజ్ఞానిక మహాసభలు డిసెంబరు 28, 29, 30వ తేదీల్లో నల్లగొండలో నిర్వహించనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి వెల్లడించారు. సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డితో కలిసి మహాసభల పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు.