Share News

Vemula Veeresham: ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి

ABN , Publish Date - Sep 05 , 2024 | 04:42 AM

మంత్రులను ఆహ్వానించేందుకు వెళుతున్న తనని అడ్డుకుని అవమానించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.

Vemula Veeresham: ఆ పోలీసులపై చర్యలు తీసుకోండి

  • భువనగిరి ఘటనపై స్పీకర్‌కు ఎమ్మెల్యే వేముల ఫిర్యాదు

నార్కట్‌పల్లి, సెప్టెంబరు 4: మంత్రులను ఆహ్వానించేందుకు వెళుతున్న తనని అడ్డుకుని అవమానించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని నకిరేకల్‌ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. సదరు అధికారులను ప్రివిలేజ్‌ కమిటీ ముందు హాజరుపరచి నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు బుధవారం ఫిర్యాదు అందజేశారు. తనని అవమానించడమంటే తన నియోజవర్గ ప్రజలను అవమానించినట్టేనని ఈ సందర్భంగా వాపోయారు.


యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో ఆగస్టు 30న నీటి పారుదలశాఖకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్‌లో వచ్చిన రాష్ట్ర మంత్రులకు ఆహ్వానం పలికేందుకు వెళుతుండగా హెలీప్యాడ్‌ వద్ద విధి నిర్వహణలో ఉన్న పోలీసులు వేముల వీరేశాన్ని అడ్డుకున్నారు. పోలీసులు ఆయన్ను గుర్తించకపోవడంతోనే ఇలా జరిగిందని తెలుస్తోంది. అయితే, పోలీసులు అడ్డుకోవడాన్ని అవమానంగా భావించిన వీరేశం అక్కడి నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. ఈ ఘటనపైనే ఆయన స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే వీరేశం ఫిర్యాదును స్వీకరించిన స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌.. జరిగిన ఘటనపై వివరాలు తెప్పించుకుని తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Updated Date - Sep 05 , 2024 | 04:43 AM