Share News

Telanagana : హుజూరాబాద్‌లో ఉద్రిక్తత

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:26 AM

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది.

Telanagana : హుజూరాబాద్‌లో ఉద్రిక్తత

  • హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి,

  • కాంగ్రెస్‌ నేత ప్రణవ్‌ హౌస్‌ అరెస్టు

  • నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసు చర్య

  • చెల్పూర్‌ హనుమాన్‌ గుడి వద్ద లాఠీచార్జి

హుజూరాబాద్‌/హుజూరాబాద్‌ రూరల్‌, వీణవంక: జూన్‌ 25: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం మంగళవారం ఉద్రిక్తతలకు దారి తీసింది. నాయకుల సవాళ్ల నేపథ్యంలో ఇరుపార్టీల ముఖ్యనేతల హౌస్‌ అరెస్టు, కార్యకర్తలపై లాఠీ చార్జీకి కారణమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్‌ అండదండలతో ఎన్టీపీసీ నుంచి హుజూరాబాద్‌ మీదుగా ఖమ్మంకు ఫ్లైయా్‌షను అక్రమంగా తరలిస్తున్నారని బీఆర్‌ఎస్‌ నేత, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి ఇటీవల ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై స్పందించిన హుజూరాబాద్‌ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ రెండ్రోజుల క్రితం విలేకరులతో మాట్లాడుతూ ప్రచారం కోసమే కౌశిక్‌ రెడ్డి ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే అవ్వకముందు ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి, అలాగే మానేరు నుంచి ఇసుక తీసుకెళ్లే లారీల వద్ద నుంచి లక్షల రూపాయలు వసూళ్లు చేశారని విమర్శించారు.

ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని, కౌశిక్‌ రెడ్డి చెల్పూర్‌లోని హనుమాన్‌ ఆలయానికి వస్తే నిరూపిస్తానని ప్రణవ్‌ సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌ను స్వీకరించిన కౌశిక్‌ రెడ్డి ఆలయానికి వస్తానని ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. చెల్పూర్‌ ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్‌ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ నాయకులు రాత్రికిరాత్రే ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఆలయం వద్దకు రావద్దని బీఆర్‌ఎస్‌ నాయకులను హెచ్చరించారు.


మరోపక్క, కాంగ్రెస్‌ శ్రేణులు మంగళవారం ఉదయం చెల్పూర్‌కు చేరుతుండడంతో ఆలయానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయితే, తన పెళ్లి రోజు అని చెప్పి ఆలయానికి వెళ్లిన చెల్పూర్‌ మాజీ సర్పంచ్‌ నేరేళ్ల మహేందర్‌గౌడ్‌ పూజల అనంతరం మాట్లాడుతూ కౌశిక్‌రెడ్డి సవాల్‌కు రాలేదంటూ ఆరోపించారు. ఈ క్రమంలో ఆలయం వద్దకు వెళ్లేందుకు కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రయత్నించగా లాఠీచార్జి చేసిన పోలీసులు వారిని చెదరగొట్టారు. సిగలత అనే మహిళా కార్యకర్తను అదుపులోకి తీసుకున్నారు. మరోపక్క, శాంతిభద్రతలు అదుపు తప్పే ప్రమాదం ఉండడంతో ప్రణవ్‌, కౌశిక్‌ రెడ్డి హనుమాన్‌ ఆలయానికి రాకుండా పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.

హుజూరాబాద్‌ మండలం సింగాపూర్‌లో వొడితెల ప్రణవ్‌ను, కౌశిక్‌ రెడ్డిని ఆయన స్వగ్రామమైన వీణవంకలోనే పోలీసులు అడ్డుకున్నారు. కాగా, పోలీసులు హౌస్‌ అరెస్టు చేయడంతో ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి తన ఇంటి వద్దే తడి దుస్తులతో ఆంజనేయ స్వామి చిత్రపటంపై ప్రమాణం చేశారు. అనంతరం కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని అడిగారు. ఫ్లైయాష్‌ రవాణా అంశంలో తాను చేసిన ఆరోపణలు అవాస్తవాలని మంత్రి ఎందుకు నిరూపించడం లేదని ప్రశ్నించారు.

Updated Date - Jun 26 , 2024 | 04:30 AM