హెచ్ఆర్ఏ కోసం అడ్డదారులు
ABN , Publish Date - Jul 09 , 2024 | 11:53 PM
కొందరు ఉపాధ్యాయులు చేసే తప్పిదాలు మొత్తం ఆ వర్గానికే మచ్చ తెస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేదాకా ఒక ఆరాటం.. వచ్చాక విద్యపై కాకుండా పదోన్నతులు, బదిలీల కోసం పోరాటం.. అందులోనూ వీలైనంత ఎక్కువ వేతనం పొందేందుకు అడ్డదారులు తొక్కడం.. ఇది ప్రస్తుతం కొంతమంది ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్న తీరు. జిల్లాలో ఇటీవల జరిగిన బదిలీల్లో హెచ్ఆర్ఏ కోసం కొందరు ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
స్పౌజ్ బదిలీల్లో నిబంధనలకు నీళ్లు
ఇంటి అద్దె వర్తించే చోటికే స్పౌజ్ పాయింట్ల వినియోగం
విచారణ చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్
లింగాలఘణపురం, జూలై 9: ఎన్నో ఏళ్లుగా ఎదురుచూసిన ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల పర్వంలో కొంతమంది ఉపాధ్యాయులు అక్రమాలకు తెరలేపారు. బదిలీల ప్రక్రియలో మానవీయ కోణంలో వాడుకోవాల్సిన స్పౌజ్పాయింట్లను దుర్వినియోగం చేశారు. హెచ్ఆర్ఏ కోసం అడ్డదారులు తొక్కారు. ఉపాధ్యాయుల బదిలీలు జూన్ 8న ప్రారంభం కాగా మొదట స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెచ్ఎంలుగా పదోన్నతులు కల్పించారు. ఆ తర్వాత సాధారణ బదిలీలు కొనసాగాయి. కాగా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉపాధ్యాయులైతే వారికోసం ప్రభుత్వం స్పౌజ్ కింద ప్రత్యేకంగా 10 పాయింట్లను కేటాయించింది. దీంతో భార్యాభర్తలు వేర్వేరు ప్రాంతాల్లో కాకుండా ఒకే చోట లేదా ఒకే మండలంలోని సమీప ప్రాంతాల్లో పని చేసేలా వెసులుబాటు కల్పించింది. భార్యాభర్తల్లో ప్రతీ ఎనిమిదేళ్లకోసారి ఎవరికో ఒకరికి మాత్రమే అదనంగా ఇచ్చే పదిపాయింట్లు వర్తిస్తాయి. ఈలెక్కన భర్త పనిచేసే చోటుకు భార్య లేదా భార్య పనిచేసే చోటికి భర్త వెళ్లాలనుకుంటే స్పౌజ్పాయింట్లను వినియోగించుకోవచ్చు. ఒకవేళ అక్కడ ఖాళీలు లేకపోతే అదే మండలంలో సమీపంగా ఎక్కడ ఖాళీలు ఉంటే అక్కడికి బదిలీ చేసుకోవచ్చు. కానీ ఈ నిబంధనలను ఉపాధ్యాయులు తుంగలో తొక్కుతున్నారు. భర్త/భార్య పనిచేసే చోటుకు లేదా సమీప ప్రాంతానికి కూడా కాకుండా హెచ్ఆర్ఏ వర్తించే ప్రాంతాలకు బదిలీ చేసుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి.
ప్రేక్షక పాత్రలో అధికారులు..
స్పౌజ్పాయింట్లను అడ్డగోలుగా వినియోగించుకోకుండా అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు ప్రేక్షకపాత్రను పోషించినట్లు ఉపాధ్యాయ వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం మాణవీయ కోణంలో కల్పించిన 10 పాయింట్లను నిబంధనల ప్రకారమే వినియోగించుకుంటున్నారా.. లేక హెచ్ఆర్ఏ కోసం వాడుకుంటున్నారా అనే కోణంలో విచారణ చేయాల్సి ఉంటుంది. కానీ జిల్లా విద్యాశాఖాధికారులు అవేమీ పట్టించుకోకుండా ఎక్కడికి ఎంచుకుంటే అక్కడికే బదిలీ చేసి చేతులు దులుపుకున్నారని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్ఆర్ఏ కోసం స్పౌజ్ పాయుంట్లను వాడుకొని పట్టణప్రాంతాల్లో అక్రమంగా బదిలీలను పొందిన ఉపాధ్యాయులను గుర్తించి వాళ్ల బదిలీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
మచ్చుకు కొందరు..
దేవరుప్పుల మండలంలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు నిబంధనల ప్రకారం తన భర్త పనిచేస్తున్న లింగాలఘణపురం మండలానికి బదిలీ అయ్యేందుకు స్పౌజ్ కింద 10 పాయింట్లను వినియోగించుకోవాలి. కానీ జనగామ మండలంలోని ఓ గ్రామానికి బదిలీ అయ్యేందుకు అక్రమంగా వాడుకున్నారు. అదేవిధంగా దేవరుప్పుల మండలంలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయురాలు తన భర్త పనిచేసే రఘునాథపల్లి మండలానికి వెళ్లాల్సి ఉండగా అక్రమంగా లింగాలఘణపురం మండలానికి బదిలీ చేసుకునేందుకు స్పౌజ్ పాయింట్లను వాడుకున్నారు. లింగాలఘణపురం మం డలంలో పనిచేసే మరో ఉపాధ్యాయురాలు తన భర్త పనిచేసే జనగామ మండలానికి వెళ్లకుండా అక్కడ ఖాళీగా ఉన్నప్పటికీ లింగాలఘణపురం మండలాన్నే ఎంచుకున్నారు. లింగాలఘణపురం మండలంలో పనిచేసిన ఓ ఉపాధ్యాయురాలు జనగామ మండలంలోని ఓ గ్రామంలో తన భర్త పనిచేసే పాఠశాలలోనే ఖాళీగా ఉన్నప్పటికీ మరో గ్రామానికి బదిలీ చేసుకున్నారు. ఇవి కేవలం మచ్చుకు మాత్రమే. జిల్లాలో 41 మంది ఎస్జీటీలు, 26 మంది స్కూల్ అసిస్టెంట్లు స్పౌజ్ పాయింట్లను వాడుకుని బదిలీ అయ్యారు. ఇలాంటి అక్రమాలు జిల్లాలో ఇంకా అనేకం ఉండొచ్చని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
తక్షణమే విచారణ చేపట్టాలి..
- బుర్ర రమేశ్, టీయూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
స్పౌజ్ పాయింట్లను దుర్వినియోగం చేసి అక్రమం గా బదిలీ చేయించుకున్న ఉపాధ్యాయులను గుర్తించి విచారణ చేపట్టాలి. వారి బదిలీలను రద్దు చేసి లెఫ్ట్ఓవర్ వెకెన్సీలు భర్తీ చేయాలి. మానవీయ కోణంలో ప్రభుత్వం కేటాయించిన స్పౌజ్పాయింట్లను అడ్డదారిలో హెచ్ఆర్ఏ పొందేందుకు వాడుకున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి.
డీఈవోకు ఫిర్యాదు చేశాం..
- నూకల ఎల్లారెడ్డి, పీఆర్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శి
స్పౌజ్ పాయింట్లను అక్రమంగా వాడుకుని అడ్డగోలుగా బదిలీ చేసుకున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డీఈవోకు ఫిర్యాదు చేశాం. అంతేగాకుండా సర్వీ్సబుక్లో ఎంట్రీ చేయాలని కూడా పీఆర్టీయూ పక్షాన డీఈవోకు లెటర్ ఇచ్చాం. ఈ విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి.
చర్యలు తీసుకుంటాం..
- రాము, జిల్లా విద్యాశాఖ అధికారి
స్పౌజ్ పాయింట్లను వాడుకుని బదిలీ అయిన వారి డేటాను పరిశీలిస్తున్నాం. స్పౌజ్పాయింట్లను దుర్వినియోగం చేసి వెబ్ ఆప్షన్లలో అక్రమాలకు పాల్పడ్డవారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం. పూర్తిస్థాయి విచారణ అనంతరం స్పౌజ్పాయింట్లను దుర్వినియోగం చేసినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు సర్వీస్ బుక్లో కూడా నమోదు చేస్తాం.