Share News

Bathukamma Festival Gift: పండుగ కానుక అందేనా..

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:04 AM

ఈ ఏడాది పేద మహిళలకు బతుకమ్మ పండుగ చీరల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. గత ఏడేళ్లుగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన బతుకమ్మ చీరల పథకం ఏడు సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగింది.

Bathukamma Festival Gift: పండుగ కానుక అందేనా..
Bathukamma Festival Gift

ఆడపడుచులకు బతుకమ్మ చీరల పంపిణీ ప్రశ్నార్థకం

పవర్‌ లూమ్స్‌కు ఆర్డర్స్‌ ఇవ్వని సర్కార్‌

స్వశక్తి సంఘాల ద్వారా పంపిణీ చేస్తామంటున్న సీఎం

ఒక్కో మహిళకు రెండు చీరలు ఇస్తామంటూ ప్రకటన

భూపాలపల్లి, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పేద మహిళలకు బతుకమ్మ పండుగ చీరల పంపిణీపై సందిగ్ధం నెలకొంది. గత ఏడేళ్లుగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వమే ఉచితంగా చీరలను పంపిణీ చేస్తోంది. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రారంభించిన బతుకమ్మ చీరల పథకం ఏడు సంవత్సరాల పాటు నిరాటంకంగా కొనసాగింది. కొవిడ్‌ సమయంలోనూ ఈ సంప్రదాయాన్ని ఆపలేదు. కానీ, ఈ ఏడాది తయారీదారులకు ఆర్డర్లు ఇవ్వకపోవడం.. బతుకమ్మ పండుగ ఇంకా కొద్ది రోజు లు మాత్రమే ఉన్నప్పటికీ చీరల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లను ప్రారంభించక పోవడంతో ఈసారి లేనట్టేనని అధికారులు అంటున్నారు. ప్రతీ ఏటా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక కోటి చీరలను 250 రకాల డిజైన్‌లలో, 10కిపైగా ఆకర్షణీయమైన రంగుల్లో మహిళలకు పంపిణీ చేసేవారు. ఈ ఏడాది మాత్రం ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం వల్ల పేద మహిళలు ఉచితంగా చీరల నందుకోవడమే కాకుండా, నేత కార్మికులు, కార్మికులు, వాహనదారులు కూడా ఆర్థికంగా లబ్ధి పొందేవారు. ఈ పథకం ఆపివేయడం వల్ల ఆయా వర్గాలు ప్రభావితమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది. 2017 నుంచి ఏటా ప్రభుత్వం సుమారు రూ.330 కోట్ల నుంచి రూ.350 కోట్ల వరకు బడ్జెట్‌తో సుమారు ఒక కోటి చీరల కో సం ఆర్డర్లు ఇచ్చేది. అందులో 90 శాతం సిరిసిల్లలో తయారు చేయించేవారు, మిగతావి కరీంనగర్‌, వరంగల్‌లో తయారయ్యాయి. ఈ చీరల పంపిణీని రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకు కూడా కొనసాగించారు. గత ఏడాది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 250 డిజైన్‌లలో 1.02 కోట్ల చీరలు పంపిణీ కేంద్రాలకు పంపింది. ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో పంపిణీని నిలిపివేశారు. అవి ఇప్పటికీ అలాగే ఉన్నాయని చెబుతున్నారు.


అయితే స్వసక్తి సంఘాల మహిళలకు కోటి 30 లక్షల చీరలు పంపిణీ చేసేందుకు త్వరలో ఆర్డర్‌ ఇవ్వబోతున్నట్లు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల స్వయం శక్తి సంఘాల మహిళలు ఉన్నారని, గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరల నాణ్యత సరిగ్గా లేకపోవడం వల్ల ఆ చీరలు ఎందుకు పనికిరాకుండా పోయాయని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఈ చీరల పంపిణీపై నేత కార్మికులు, ఇతర వర్గాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉన్నందున అన్నీ బేరీజు వేసుకొని ఒక్కో మహిళకు రెండు చీరలు చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇప్పటికిప్పుడు ఆర్డర్‌ ఇచ్చినాఆ చీరలు తయారు కావడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుందని, ఈ నిర్ణయం ఏప్రిల్‌, మే మాసాల్లో తీసుకొని ఉంటే బతుకమ్మ పండుగకు చీరలు అందేవని నేత కార్మిక వర్గాలు చెబుతున్నాయి. బతుకమ్మ చీరల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బేషజాలకు పోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైందని అంటున్నారు.


జిల్లాలో 1.14లక్షల మంది అర్హులు

భూపాలపల్లి జిల్లాలో ఈ ఏడాది బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియకు బ్రేక్‌ పడినప్పటికీ త్వరలో ఒక కోటి 30లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దరిమిలా జిల్లాలో ఉన్న తెల్ల రేషన్‌ కార్డుదారులందరూ చీరలు ఉచితంగా పొందేందుకు అర్హులుగా గుర్తించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ లెక్కన భూపాలపల్లి జిల్లాలో మొత్తం 1.14లక్షల మంది అర్హులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో అత్యధికంగా భూపాలపల్లిలో 19,401 మంది, అత్యల్పంగా పలిమెల మండలంలో 2,087 మంది లబ్ధిదారులు ఉన్నారు. అయితే స్వశక్తి సంఘాల మహిళలని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.


సంప్రోక్షణ చేయండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News Click Here

Updated Date - Sep 21 , 2024 | 11:47 AM