పంటల సర్వే సందిగ్ధం!
ABN , Publish Date - Oct 01 , 2024 | 12:21 AM
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ క్రాప్ సర్వేపై సందిగ్ధత ఏర్పడింది. పంటల సర్వేకు తాము ముందు కు రాలేమంటూ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విస్తరణా ధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో మండలాల వారీగా సరిపడా ఏఈవోలు లేకపోవడం తో పనిభారం అవుతుందంటూ చేతులెత్తేశారు.
డిజిటల్ క్రాప్ సర్వేకు ఏఈవోల విముఖత
సరిపడా సిబ్బంది లేకపోవడంతో చేతులేత్తేసిన వైనం
ఈ సీజన్‌లో సర్వే జరగడం కష్టమే?
జనగామ, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన డిజిటల్ క్రాప్ సర్వేపై సందిగ్ధత ఏర్పడింది. పంటల సర్వేకు తాము ముందు కు రాలేమంటూ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ విస్తరణా ధికారులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో మండలాల వారీగా సరిపడా ఏఈవోలు లేకపోవడం తో పనిభారం అవుతుందంటూ చేతులెత్తేశారు. ఇదే విషయంపై రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏఈవోలు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు వినతిపత్రాలు ఇస్తుండగా, తాజాగా జనగామ జిల్లాలోనూ ఏఈవోలు పంటల సర్వేకు దూరంగా ఉంటున్నామంటూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డాక్టర్ రామారావుకు సోమవారం లేఖ ఇచ్చారు. దీంతో డిజిటల్ క్రాప్ సర్వేపై అయోమయం నెలకొంది.
భవిష్యత్తు ప్రణాళికల కోసం..
దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగానికి సంబంధించి అవసరమైన పక్కా ప్రణాళికలను తయారు చేసేందు కు గానూ కేంద్ర ప్రభుత్వం ‘డిజిటల్ అగ్రి మిషన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్)ను తీసుకొచ్చింది. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో ఏయే పంటలు, ఎంత విస్తీర్ణం లో సాగవుతున్నాయన్న పక్కా సమాచారాన్ని క్రోడీక రించి భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నది కేం ద్రం ఉద్దేశ్యం. ఇందులో భాగంగా గత ఏడాది తీసుకొ చ్చిన ఈ కార్యక్రమం దేశంలోని ఆంధ్రప్రదేశ్, మహారా ష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఒడిషా వంటి రాష్ట్రాలలో గత ఏడాది నంచే అమలు అవుతోంది. తె లంగాణలో మాత్రం ఈ ఏడాది నుంచి పూర్తి స్థాయి లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
సరిపడా సిబ్బంది లేక..
పంటల సర్వే నేపథ్యంలో జిల్లాలో సరిపడా సిబ్బం ది లేకపోవడంతో తాము సర్వే చేయలేమంటూ ఏఈవోలు చేతులేత్తేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 12 మండలాల పరిధిలో 62 క్లస్టర్లు ఉన్నాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో సుమారు 6 వేల నుంచి 10 వేల ఎకరాల వరకు భూములు ఉంటాయి. ఒక్కో క్లస్టర్‌కు ఒక్కో ఏఈవో ఉండగా జిల్లాలో 62 మంది ఏఈవోలు ఉన్నారు. ఇందులో 40 మంది మహిళా ఏఈవోలే ఉన్నారు. కాగా.. ఒక్కో ఏఈవో తమ క్లస్టర్ పరిధి మొత్తాన్ని సర్వే చేయడం కష్టతరమైన పనిగా చెబు తున్నారు. గత ఏడాది క్రాప్ బుకింగ్‌కు సంబంధించి జనగామ జిల్లాలో జనగామ మండలాన్ని పైలట్ కింద తీసుకొని సర్వే నిర్వహించారు. ఆ సమయంలో జనగామ మండలంతో పాటు నర్మెట్ట, బచ్చన్నపేట మండలాలకు చెందిన 14 మంది ఏఈవోలకు పైలట్ మండలంలో క్రాప్ బుకింగ్ బాధ్యతలు ఇచ్చారు. ఈ 14 మంది ఏఈవోలు ఒక్క జనగామ మండలంలో సర్వే పూర్తి చేయడానికి మూడు నెలల సమయం పట్టింది. ఈ లెక్కన ఒక్కో ఏఈవో తమ క్లస్టర్‌లో సర్వే పూర్తి చేయాలంటే ఆరు నెలల పడుతుందని ఏఈవోలు అంటున్నారు.
పంటల ఫోటోలతో సహా సర్వే
ప్రభుత్వం చెబుతున్న సర్వే విధివిధానాలపై ఏఈవోలు అయిష్టంగా ఉన్నారు. గతంలో పైలట్ కింద చేసిన సర్వేలో కేవలం పంటల వివరాలను మాత్రమే నమోదు చేయాల్సి ఉండగా ఈసారి చాలా వరకు మార్పులు చేశారు. ప్రతి ఏఈవో తమ క్లస్టర్ పరిధిలోని ప్రతి రైతు, ప్రతి ఎకరం, ప్రతి పొలం వద్దకు వెళ్లి సర్వే చేయాల్సి ఉంటుంది. రైతు పేరు, సర్వే నంబర్, సబ్ సర్వే నంబర్, ఆయా సర్వే నంబర్ల లో ఏయే పంటలు సాగు చేశారు అన్న వివరాలతో పాటు పంట ఫొటోలు కూడా యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ క్రమంలో ఏఈవో ఉన్న ప్రాంతం నుంచి ఆక్షాంశాలు, రేఖాంశాలు యాప్‌లో నమోదు అవుతా యి. దీని వల్ల ఏఈవో కచ్చితంగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సి న పరిస్థితి ఏర్పడింది. దీనితో పాటు పలు ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య వల్ల క్రాప్ బుకింగ్ సర్వే ఆలస్యం అవుతోంది. రిమోట్ ప్రాంతాల్లో ఫోన్లలో ఛార్జింగ్ అయిపోవడంతో పాటు మహిళా ఏఈవోలకు వ్యక్తిగ తంగా ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో ఏఈవోలు పంటల సర్వేకు విముఖత వ్యక్తం చేస్తు న్నారు. కాగా.. ఇతర రాష్ట్రాల్లో పంటల సర్వే కోసం ఏఈవోలకు సహాయకులను కేటాయించారు. దీంతో ఆయా రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ అధికారులపై పని ఒత్తిడి పడడం లేదు. కొన్ని రాష్ట్రాల్లో ఏజెన్సీల ద్వారా సహాయకులను నియమించారు. ఇదే క్రమంలో తెలం గాణలో ఏఈవోకు సహాయకులను కేటాయిస్తే సర్వేకు తాము సిద్ధమేనని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కాగా.. ప్రస్తుతం వానాకాలం సీజన్ సాగు పూర్తయి వరి పంట కోతల సీజన్ కూడా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఏఈవోలు సర్వేకు సిద్ధపడి ఇప్పటికిప్పుడు ప్రారంభించినా వానాకాలం పంటల సాగు సర్వే పూర్తి చేయడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఈ క్రమంలో ఏఈవో సమస్యలను పరిష్కరించి వారికి అవసరమైన శిక్షణ, ట్యాబ్‌లు అందించి రబీ సీజన్ నుంచి సర్వే ప్రారంభిస్తే బాగుటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఏఈవోలకు సహాయకులను ఇవ్వాలి..
- గుగులోత్ యాకూబ్, ఏఈవో, చిల్పూరు
పంటల సర్వే కోసం ఏఈవోలకు సహాయ కులను కేటాయించాలి. ఎలాంటి సహాయకులను ఇవ్వకుండా సర్వే చేయడం కష్టమైన పని. కొన్ని చోట్ల ఒక్కో ఏఈవోకు తన క్లస్టర్ పరిధిలో 12 వేల ఎకరాల విస్తీర్ణం ఉంది. దీని వల్ల పనిభారం అధికంగా పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని 5 వేల ఎకరాలకు ఒక్క ఏఈవోను నియమిచాలి. అవసరమైతే అదనంగా ఏఈవోల నియామకం జరపాలి. ఏఈవోలు క్షేత్రస్థాయిలో తిరుగుతున్నందున ఇన్య్సురెన్స్ సౌకర్యం కల్పించాలి.