డబుల్ రోడ్డున్నా... సింగిల్ బస్సు రాదాయె..
ABN , Publish Date - Jun 24 , 2024 | 11:37 PM
రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానకి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్తున్న నాయకుల మాటలు నీటి ముటలుగా మిగులు తున్నాయి. నర్మెట మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు రాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు.
రవాణా సౌకర్యం లేక ఇబ్బందిపడుతున్న విద్యార్థులు, ప్రజలు
ఉచిత బస్సు ప్రయాణం మాకేది అంటున్న మహిళలు
నర్మెట, జూన్ 24: రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానకి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్తున్న నాయకుల మాటలు నీటి ముటలుగా మిగులు తున్నాయి. నర్మెట మండలంలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సులు రాకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదు ర్కొంటున్నారు. మండలంలో 17 గ్రామాలున్నా మండలకేంద్రంతో పాటు, హన్మంతాపూర్ గ్రామ ప్రజలు తప్ప మిగతా గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రావాలంటే నానా యాతనపడి చేరుకోవాల్సి వస్తోంది. జనగామ, రఘునాథ్‌పల్లి నుంచి మచ్చుపహాడ్ మీదుగా నర్మెట మండలకేంద్రానికి డబుల్ రోడ్డు సౌకర్యం ఉన్నా సింగిల్ బస్సు కూడా రావడం లేదు. అదేవి ధంగా అమ్మాపురం, గండిరామవరం, మల్కపేట, బొమ్మకూర్, గుంటూరు పల్లి, లోక్యతండ, మాన్‌సింగ్‌తండ గ్రామాల కు బీటీ రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సు సౌకర్యం లేదు. జనగాం నుంచి రఘనాథ్‌పల్లి, నర్మెట, చేర్యాల మీదుగా సిద్దిపేట వరకు బస్సులు నడిపించాలని గతంలో మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి మండల ప్రజలు వినతిపత్రం అందించినా ఇంతవరకు ప్రయోజనం లేదు. మండల పరిషత్‌లో ప్రతీ మూడు నెలలకు నిర్వహించే సర్వసభ్య సమావేశంలో అన్ని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని మండల ప్రజాప్రతినిధులు సభ దృష్టికి తీసుకువచ్చి ఆర్టీసీ అధికారులకు విన్నవించినా ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. ఇటీవల బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ మచ్చుపహాడ్ కాంగ్రెస్ నాయకులు జనగామ డిపో మేనేజర్‌కు వినతిపత్రం కూడా అందించారు.
ప్రైవేట్ వాహనాలే దిక్కు..
బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాల ప్రజలు ప్రవైట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. అధిక వ్యయంతో ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ప్రభు త్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణం మాకు అందడం లేదని ఆయా గ్రామాల మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలకేంద్రంలో ప్రభు త్వ జూనియర్ కళాశాల, ప్రైవేట్ జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండడంతో నర్మెట మండలం నుంచే కాక ఇతర మండలాల నుంచి కూడా నిత్యం వెయ్యి మందికి పైగా విద్యార్థులు వచ్చిపోతున్నారు. విద్యార్థులతో పాటు మండలకేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కూడా ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోం ది. ఇప్పటికైనా అదికారులు స్పందించి అన్ని గ్రామాలకు బస్సు సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
మచ్చుపహాడ్ మీదుగా బస్సులు నడిపించాలి..
- పరీదుల లింగరాజు, మచ్చుపహాడ్
మచ్చుపహాడ్ గ్రామానికి డబుల్ రోడ్డు సౌక ర్యం ఉన్నప్పటికీ ఆర్టీసీ బస్సులు రావడం లేదు. గ్రామం చూట్టూ తండాలు ఉన్నాయి. బస్సులు రాకపోవడంతో ఆటో, జీపు ప్రవైట్ వాహానాలల్లోనే వెళ్తున్నాం. విద్యార్థులు ఉదయం, సాయంత్రం సమయాల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సులు నడిపించాలని జనగామ డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందించాము. త్వరలో బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.