నిగ్గు తేలేనా..!
ABN , Publish Date - Sep 20 , 2024 | 11:58 PM
గత కొన్నేళ్లుగా చెరువులు, కుంట శిఖాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చెరువు శిఖాల్లో వెంచర్ల పేరిట అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా కూడా అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఎఫ్‌టీఎల్ హద్దుల ఏర్పాటుకు అనువైన సమయం
కబ్జాకు గురవుతున్న చెరువు శిఖాలు
చెరువులు, కుంటల ఆక్రమణలపై నియంత్రణ శూన్యం
లింగాలఘణపురం సెప్టెంబరు 20: గత కొన్నేళ్లుగా చెరువులు, కుంట శిఖాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. చెరువు శిఖాల్లో వెంచర్ల పేరిట అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా కూడా అధికారులు అటువైపుగా కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటుగా సూర్యాపేట రోడ్డు, హన్మకొండ రోడ్డు, హైదరాబాద్ రోడ్డు, సిద్దిపేట రహదారులకు ఆనుకుని ఉన్న శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు దర్జాగా కబ్జాకు గురవుతున్నప్పటికీ అధికారులు తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఒకవేళ ఎక్కడైనా కబ్జాకు గురైనట్లుగా అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేసినా అలాంటి ఫిర్యాదులను బుట్టదాఖలు చేయడం తప్ప చర్యలు తీసుకోవడంలో ఆసక్తి చూపడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు ఎఫ్‌టీఎల్ హద్దులు ఏర్పాటు చేసి అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఇదే సరైన తరుణమని జిల్లా ప్రజలు భావిస్తున్నారు.
జోరుగా కొనసాగుతున్న అక్రమణల పరంపర
గత పదేళ్లుగా రియల్‌ఎస్టేట్ భూమ్ ఊపందుకో వడంతో రియల్ వ్యాపారులు, బడాపారిశ్రామిక వేత్తలు జనగామ జిల్లా కేంద్రానికి చుట్టూ పరిసర గ్రామాల్లో వేలాది ఎకరాల భూములను కొనుగోలు చేసి వెంచర్ల పేరిట భూవ్యాపారాలు చేస్తున్నారు. అయితే పనిలో పనిగా కొందరు సందు దొరికినప్పు డల్లా చెరువు శిఖాలు, కుంటశిఖాలను తమ స్వాధీ నంలోకి అక్రమంగా తెచ్చుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వాటికి ఎఫ్‌టీఎల్ హద్దులు ఏర్పాటు చేశాకే ఆక్రమణలు నిజమా.. కాదా..? అనే విషయాలు నిగ్గుతేలుతాయని అధికారులు ప్రజల విజ్ఞప్తులను పరిశీలించకుండా తాత్సారం చేస్తున్నారు.
హద్దుల ఏర్పాటుకు అనుకూల తరుణం
రెండు మాసాలుగా జిల్లా వ్యాప్తంగా విస్తారమైన వర్షాలతో చెరువులు, కుంటలు చాలాచోట్ల నిండుకం డను తలపిస్తున్నాయి. అయితే ఇప్పటికే చెరువు శిఖాలు, కుంట శిఖాల ఆక్రమణలతో పాటుగా ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నా యి. ప్రస్తుతం నిండు కుండలను తలపిస్తున్న నీటివనరులకు ఫుల్‌ట్యాంక్ లెవల్(ఎఫ్‌టీఎల్) హద్దులను ఏర్పాటు చేయడానికి అనువైన తరుణమని సూచిస్తున్నారు.
అక్రమాలపై పట్టింపు శూన్యం
జిల్లాలోని 12 మండలాల పరిధిలో 965 చెరువు లు ఉండగా ఇందులో సుమారు 100 చెరువుల వర కూ రహదారుల పక్కనే ఉండటం గమనార్హం. ప్రధా నంగా రహదారుల పక్కనే ఉన్న చెరువులను లక్ష్యం గా చేసుకుంటున్న కొందరు రియల్ వ్యాపారులు నీటివనరుల పక్కనే ఉన్న భూములను కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలోని జనగామ, లింగాలఘణపురం, బచ్చన్నపేట, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల, పాలకుర్తి మండలాల పరిధి రహదారి పక్కన గ్రామాలకు చెందిన చెరువులు, కుంటశిఖాలు ఆక్రమణకు గురవుతున్నట్లు తెలుస్తోంది.
అక్రమాలపై కలెక్టర్ దృష్టిసారించాలి
రహదారుల పక్కన చెరువు శిఖాల అక్రమాలు, ఎఫ్‌టీఎల్ పరిధిలోని అక్రమనిర్మాణాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్షేత్రస్థాయి అధికారుల కనుసన్నుల్లో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శల నేపథ్యంలో కలెక్టర్ రంగంలోకి దిగితే అక్రమాల నిగ్గుతేలే అవకాశం ఉందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.