Share News

కొనుగోళ్లకు సన్నద్ధం!

ABN , Publish Date - Sep 24 , 2024 | 11:51 PM

జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు కసరత్తు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో దిగుబడి అయ్యే ధాన్యం, సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే ధాన్యం, అందుకు తగ్గ ఏర్పాట్లకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు ఇటీవల సిద్ధం చేసుకున్నారు. మరో 15 రోజుల నుంచి వానాకాలం వరి ఽకోతలు ఊపందు కోనున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అయ్యారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో అవసరమైన వసతుల కల్పన, నిర్వాహకులకు శిక్షణ వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.

కొనుగోళ్లకు సన్నద్ధం!
ధాన్యం కొనుగోలు కేంద్రం (ఫైల్‌)

వానాకాలం వడ్ల సేకరణకు ప్రణాళిక

జిల్లాలో 180 కేంద్రాల ఏర్పాటు చేసే యోచనలో అధికారులు

2.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అంచనా

జనగామ, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి అధికారులు కసరత్తు పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో దిగుబడి అయ్యే ధాన్యం, సేకరణ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే ధాన్యం, అందుకు తగ్గ ఏర్పాట్లకు సంబంధించిన యాక్షన్‌ ప్లాన్‌ను అధికారులు ఇటీవల సిద్ధం చేసుకున్నారు. మరో 15 రోజుల నుంచి వానాకాలం వరి ఽకోతలు ఊపందు కోనున్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం అయ్యారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో అవసరమైన వసతుల కల్పన, నిర్వాహకులకు శిక్షణ వంటి అంశాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వానాకాలం సీజన్‌ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు సజావుగా సాగేలా అధికారులు ప్లాన్‌ చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మరో పది, పదిహేను రోజుల్లో వరి కోతలు ప్రారంభం అవుతుండడంతో కొనుగోలు ప్రక్రియను మొదలు పెట్టాలని యంత్రాంగం నిర్ణయించింది. జిల్లాలో గత వానాకాలం వచ్చిన దిగుబడి, సేకరణను బట్టి ఈ ఏడాది దిగుబడిని అంచనా వేసుకొని అందుకు తగ్గట్లుగా కొనుగోళ్ల కోసం ఏర్పాట్లు చేశారు.

జిల్లావ్యాప్తంగా 180 కొనుగోలు కేంద్రాలు

వానాకాలం వడ్ల కొనుగోలు కోసం జిల్లావ్యాప్తంగా 180 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని 12 మండలాల పరిధిలో ఐకేపీ ఆధ్వర్యంలో 94, పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో 84, మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో 2 కేంద్రాలను తెరవనున్నారు. గత ఏడాది వానాకాలం సీజన్‌లో 177 కేంద్రాలను ఏర్పాటు చేయగా ఈ ఏడాది 180 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాది వానాకాలం సీజన్‌లో 2.10 లక్ష ఎకరాల్లో వరి సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ ఈ సీజన్‌లో వరి సాగు విస్తీర్ణం కొంత మేర తగ్గింది. సాగు సమయంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో సాగుకు రైతులు పెద్దగా ముందుకు రాలేదు. దీంతో ఈ సీజన్‌లో కేవలం 1.50 లక్షల ఎకరాలకే వరి సాగు పరిమితమైనట్లు అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ సీజన్‌లో మొత్తంగా 4.74 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో 3.29 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం, 1.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం వస్తుందని భావిస్తున్నారు. కాగా.. ఇందులో 2.05 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేస్తున్నారు. సన్నరకం ధాన్యాన్ని బియ్యం చేసి అమ్ముకునేందుకు రైతులు మొగ్గు చూపే అవకాశం ఉంది. దీంతో కొనుగోలు కేంద్రాలకు సన్నరకం ధాన్యం వచ్చే అవకాశం తక్కువేనని అధికారులు భావిస్తున్నారు. కాగా.. ఈ సీజన్‌ నుంచి సన్నరకం ధాన్యానికి రూ. 500 బోనస్‌ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు సన్నరకం ధాన్యాన్ని కేంద్రాల్లో అమ్ముకుంటారా.. మరాడించి బియ్యంగా మార్చి అమ్ముకుంటారా అన్నది చూడాలి.

51.27 లక్షల గన్నీ సంచులు అవసరం

ధాన్యం కొనుగోలు కోసం 51.27 లక్షల గన్నీ సంచులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఇందులో పాత గన్నీలు 23.58 లక్షలు కాగా కొత్తగా 27.68 లక్షల గన్నీలు అవసరం అవుతాయని భావిస్తున్నారు. కాగా.. ప్రస్తుతం 9.32 లక్షల గన్నీలు మార్కెటింగ్‌ శాఖ వద్ద అందుబాటులో ఉండగా మిల్లర్ల వద్ద ఉన్న మరో 41.94 లక్షల గన్నీలను తెప్పించనున్నా రు. దీనితో పాటు ధాన్యం కొనుగోలుకు 5400 టార్పాలిన్లు, 360 మాయిశ్చర్‌ మిషన్లు, 360 ఎలకా్ట్రనిక్‌ కాంటాలు, 360 ప్యాడీ క్లీనర్లు అవసరం అవుతాయని అంచనా వేశారు.

దసరా తర్వాత కేంద్రాల ప్రారంభం

జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను దసరా తర్వాత ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నా రు. జిల్లాలో పలుచోట్ల ఎడగారు పంట కోతలు జరుగుతున్నాయి. ఈ ధాన్యాన్ని మార్కెట్లలో, మిల్లర్ల వద్ద రైతులు అమ్ముకుంటున్నారు. జిల్లా మొత్తంగా ఎడగారు ధాన్యం సుమారు 15 వేల మెట్రిక్‌ టన్ను లు దిగుబడి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. ఈ కోతలు మరో పది రోజుల్లో పూర్తి కాగా.. ఆ తర్వాత వానాకాలం కోతలు ప్రారంభం కానున్నాయి. దసరా తర్వాత కోతలు ఊపందుకోనున్నాయి. దీంతో దసరా పండగ తర్వాత కేంద్రాలను తెరవాలని అధికారులు ఆలోచనలో ఉన్నారు.

సజావుగా ధాన్యం కొనుగోళ్లు

- రోహిత్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) కలెక్టర్‌, జనగామ

కలెక్టర్‌ షేక్‌ రిజ్వాన్‌ బాషా ఆదేశాలతో జిల్లాలో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రణాళికను సిద్ధం చేశాం. ఈ సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కొనుగోళ్లు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. జిల్లాలోని 12 మండలాల పరిధిలో 180 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్ణయించాం. కేంద్రాల నిర్వాహకులకు శిక్షణ ఇచ్చి దసరా తర్వాత కేంద్రాలను తెరవాలని భావిస్తున్నాం.

Updated Date - Sep 24 , 2024 | 11:51 PM