Share News

అంగన్‌వాడి సేవలపై సర్కారు సర్వే

ABN , Publish Date - May 28 , 2024 | 11:54 PM

అంగన్‌వాడి కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు తెలంగాణ సర్కార్‌ చర్యలు చేపట్టింది. ఈ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్ఠికాహారం పక్కదారి పట్టకుండా ఉండేలా, పక్కాగా సాగేందుకు కార్యాచరణ రూపొందించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వేను ప్రారంభించింది. న్యూట్రిషియన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌హెచ్‌టీఎస్‌) ద్వారా అంగన్‌వాడి టీచర్లు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ సర్వే ప్రక్రియకు ఎన్నికల కారణంగా కొం త జాప్యం జరిగింది.

అంగన్‌వాడి సేవలపై సర్కారు సర్వే
కొడకండ్ల మండలం పెద్దబాయి తండాలో సర్వేపై అవగాహన కల్పిస్తున్న ఐసీడీఎస్‌ అధికారులు

అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు

ఎన్‌హెచ్‌టీఎస్‌ పేరుతో ఇంటింటా వివరాల సేకరణ

ఆన్‌లైన్‌ యాప్‌లలో వివరాల నమోదు

పౌష్టికాహార పంపిణీలో అవినీతిపై ఆరా

జిల్లాలో 695 అంగన్‌వాడీ కేంద్రాలు

జఫర్‌గడ్‌, మే 28 : అంగన్‌వాడి కేంద్రాల్లో అక్రమాలకు అడ్డుకట్టవేసేందుకు తెలంగాణ సర్కార్‌ చర్యలు చేపట్టింది. ఈ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్న పౌష్ఠికాహారం పక్కదారి పట్టకుండా ఉండేలా, పక్కాగా సాగేందుకు కార్యాచరణ రూపొందించేందుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ సర్వేను ప్రారంభించింది. న్యూట్రిషియన్‌ హెల్త్‌ ట్రాకింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌హెచ్‌టీఎస్‌) ద్వారా అంగన్‌వాడి టీచర్లు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ సర్వే ప్రక్రియకు ఎన్నికల కారణంగా కొం త జాప్యం జరిగింది. ఎన్నికలు పూర్తి కావడంతో జిల్లా లో కుటుంబ సర్వే వేగవంతం చేసినట్లు అఽధికారులు తెలిపారు. జూన్‌ రెండో వారంలో సర్వే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్‌, పాలకుర్తి ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 695 అంగన్‌వాడి కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 3-6 ఏళ్ల పిల్లలు 13,800 మంది, ప్రీ స్కూల్‌ పిల్లలు 9,561 మంది, గర్భిణులు 2,976 మంది, బాలింతలు 2,854 మంది ఉన్నారు.

లబ్ధిదారులకు పౌష్ఠికాహారం...

చిన్నారులకు పరిశుభ్రతతో పాటు పాలు, గుడ్లు, బాలామృతం వంటి పౌష్ఠికాహారం అందించడంతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించి వారి మానసిక ఎదుగుదలకు అంగన్‌వాడి కేంద్రాలు దోహదపడుతున్నాయి. వారికి ఆటపాటలతో విద్యనందిస్తూ వారు పాఠశాలలకు వచ్చేలా ఆకర్షితులయ్యేలా చేస్తున్నాయి. గర్భిణులు, బాలింతలకు సైతం పోషక విలువలు గల ఆహారాన్ని, సరుకులను అందజేస్తూ సిబ్బంది ఆరోగ్య సలహాలు, సూచనలు ఇస్తున్నారు. అయితే అనేక కేంద్రాల్లో భోజనం, గుడ్లు, పాలు అందించడంలో నిర్వాహకులు అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పదార్థాలు, సరుకులను మార్కెట్‌లో విక్రయించడం లేదా ఇళ్లకు తీసుకువెళ్లడం వంటివి చేస్తున్నారని, తద్వారా లబ్ధిదారులకు సక్రమంగా పోషకాహారం అందడంలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రతీ నెల చిన్నారుల ఎత్తు, బరువు, వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.

జిల్లాలో కొనసాగుతున్న కుటుంబ సర్వే...

జిల్లాలో కుటుంబ సర్వే ముమ్మరంగా కొనసాగుతోం ది. గ్రామాల్లో అంగన్‌వాడి టీచర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలను సేకరిస్తున్నారు. కుటుంబ యజమాని పేరు, కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు తదితర వివరాలను సేకరిస్తున్నారు. ఈ సర్వే వివరాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన రెండు రకాల యాప్‌లలో అంగన్‌వాడి టీచర్లు పొందుపరుస్తున్నారు. అంగన్‌వాడి కేంద్రం ఆధారంగా ఇంటి నంబరు, వీధి పేరు, కుటుంబ యజమాని, చిన్నారులు, తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు, కుటుంబ సభ్యుల ఆధార్‌ నంబర్లు, కులము, వయసు, మొబైల్‌నంబర్లు, జనన మరణాలు, ప్రస్తుతం ఇంటి పరిధిలోని అంగన్‌వాడి కేంద్రం, తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. దీంతో కుటుంబాల సమగ్ర సమాచారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియనుంది. ఈ సర్వే సమగ్రంగా చేపట్టేందుకు గాను అంగన్‌వాడి టీచర్లకు సెల్‌ఫోన్‌లు అందించి ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చారు.

పౌష్టికాహార పంపిణీలో అవకతవకలు..

కుటుంబ సమగ్ర సర్వే ద్వారా అంగన్‌వాడి కేంద్రాల లబ్ధిదారుల వివరాలను ప్రత్యేక యాప్‌లలో నమోదు చేయడం ద్వారా పౌష్ఠికాహారం, సరుకులు, వస్తువులు పక్కదారి పట్టకుండా ఉంటాయని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో అంగన్‌వాడి కేంద్రాలకు గర్భిణులు, బాలింతలు, పిల్లలు హాజరు కాకపోయినా.. హాజరైనట్లు రిజిస్టర్లలో నమోదు చేసేవారు. ఇక నుంచి కేంద్రాలకు వారు హాజరు కాని ఎడల.. భోజనం చేయలేదని, పోషకాహార సరుకులు తీసుకువెళ్లలేదని లబ్ధిదారుల మొబైల్‌ నంబరుకు సమాచారం(మెసేజ్‌) వస్తుంది. ఆన్‌లైన్‌లో వివరాలను పొందువరపడంతో అధికారులకు సైతం క్షణాల్లో సమాచారం తెలిసిపోతుంది. ఫలితంగా కేంద్రాల్లో జరిగే అవవతవకలు, అక్రమాలకు ఈ సర్వే ద్వారా అడ్డుకట్ట పడనుంది. అలాగే ఆయా కుటుంబాల్లో వయసుల వారీగా పోషకాపౌష్ఠికాహార లోపం ఉన్నవారి వివరాలు ఈ సర్వేతో తెలుస్తుంది. తద్వారా తీవ్ర పోషక లోపం ఉన్న పిల్లలు, బాలింతలు, గర్భిణులకు ప్రత్యేకంగా పౌష్ఠికాహార సదుపాయం కల్పించే వీలుంటుంది. అంతేకాకుండా సర్వే అనంతరం అంగన్‌వాడి కేంద్రాల పరిధిలోని ఇళ్లను సర్దుబాటు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రాలకు దూరంగా ఉండే ఇళ్లను సమీప అంగన్‌వాడీ కేంద్రాలకు బదిలీ చేసి ఆయా కుటుంబాల పిల్లలను కేంద్రాల్లో చేర్పించనున్నారు.

పారదర్శకతకు అవకాశం..

- జెట్టి జయంతి, జిల్లా మహిళా శిశుసంక్షేమాధికారి

కుటుంబ సర్వే ద్వారా అంగన్‌వాడి కేంద్రాల్లోని పిల్లలు, బాలింతలు, గర్భిణులకు అందించే పౌష్ఠికాహార పంపిణీలో అవకతవకలకు అడ్డుకట్ట పడుతుంది. ఇప్పటి వరకు 90 శాతం వరకు సర్వే పూర్తయింది. జూన్‌ రెండో వారంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ఆయా కుటుంబాల సమగ్ర వివరాలతో పాటు చిన్నారుల బరువు, ఎత్తులను సైతం అంగన్‌వాడి టీచర్లు ప్రత్యేక యాప్‌లలో నమోదు చేస్తున్నారు. తద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, వారి ఆరోగ్య పరిస్థితి, కుటుంబ వివరాల సమాచారం సంబంధిత అధికార యంత్రాంగానికి క్షణాల్లో తెలిసిపోతుంది. అలాగే పోషకాహార లోపం గల వారిని గుర్తించి వారికి సరైన పౌష్ఠికాహారాన్ని అందించేందుకు ఉపకరిస్తుంది. అంగన్‌వాడీల ద్వారా లబ్ధిదారులకు మెరుగైన సేవలందించేందుకు ఈ సర్వే దోహపడుతుంది.

Updated Date - May 28 , 2024 | 11:54 PM