Share News

గృహయోగం ఎప్పుడో ?

ABN , Publish Date - Jul 04 , 2024 | 12:05 AM

పేద, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల సాకారమయ్యేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుందనే ఆశతో ‘గృహలక్ష్మి’ పథకంలో భాగం గా గృహనిర్మాణాన్ని చేపట్టగా.. ఈ స్కీమ్‌ను ఇప్పటి కాం గ్రెస్‌ సర్కారు రద్దు చేసింది. దీంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పథకం మంజూరైందన్న ఆశ తో ఉన్నఇల్లును తొలగించుకొని, నిర్మాణం చేపట్టగా అర్థాంతరంగా పథకం నిలిచిపోవడంతో లబ్ధిదారులు వీధినపడినట్లయింది.

గృహయోగం ఎప్పుడో ?

అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘గృహలక్ష్మి’ పథకంలో ఇళ్లకు హడావిడిగా అనుమతి పత్రాలు

జిల్లా వ్యాప్తంగా 8,670 మంజూరు

శాసనసభ ఎన్నికల ఫలితాల అనంతరం రద్దు

అసంపూర్తి నిర్మాణాలతో లబ్ధిదారులకు ఇబ్బందులు

కేసముద్రం, జూలై 3 : పేద, మధ్య తరగతి వర్గాలకు సొంతింటి కల సాకారమయ్యేలా లేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేస్తుందనే ఆశతో ‘గృహలక్ష్మి’ పథకంలో భాగం గా గృహనిర్మాణాన్ని చేపట్టగా.. ఈ స్కీమ్‌ను ఇప్పటి కాం గ్రెస్‌ సర్కారు రద్దు చేసింది. దీంతో లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పథకం మంజూరైందన్న ఆశ తో ఉన్నఇల్లును తొలగించుకొని, నిర్మాణం చేపట్టగా అర్థాంతరంగా పథకం నిలిచిపోవడంతో లబ్ధిదారులు వీధినపడినట్లయింది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణం కోసం అప్పులు తీసుకురాగా, పథకం నుంచి ఒక్క రూపాయి రాకపోవడం తో వారు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో సొంతస్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.3 లక్షల ఆర్థిక సహా యం అందించేందుకు ‘గృహలక్ష్మి’ పథకం రూపొందించిం ది. ఈ పథకంలో ఇచ్చిన ఆర్థిక సహాయం వందశాతం రాయితీతో తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇందుకోసం ప్రత్యేక బ్యాంకుఖాతాను లబ్ధిదారుని పేరిట తీయాల్సిఉంటుంది. ఇంటిని బేస్‌మెంట్‌ స్థాయి నిర్మాణం అయ్యా క రూ.లక్ష, రూఫ్‌లెవల్‌లో రూ.లక్ష, నిర్మాణం అంతా పూర్తయ్యాక మిగిలిన రూ.లక్ష అందజేస్తారు. కొత్తగా మంజూ రు చేసే ఇళ్లు పూర్తిగా మహిళల పేరిటే నమోదు ఉండాలనే నిబంధనలు పెట్టారు. లబ్ధిదారులు తమసొంత డిజైన్‌ ప్రకారం ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం ఆమోదించిన గృహలక్ష్మి పథకం లోగోను ఇంటి పై ఏర్పాటు చేయాలనే నిబంధన విధించారు. లబ్ధిదారు లు ఖచ్చితంగా ఆహారభద్రత కార్డుతోపాటు సొంత స్థలం కలిగి ఉండాలి. స్థానికురాలై, ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యతనిస్తూ ప్రతీ నియోజకవర్గంలో ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 10 శాతం, బీసీలు, మైనార్టీలకు 50 శాతానికి తగ్గకుండా కేటాయించాల్సి ఉంది. దరఖాస్తుదారులు, కుటుం సభ్యులు ఇప్పటికే ఇళ్ల పథకంలో లబ్ధిపొంది ఉం టే ఈ స్కీంకు అనర్హులుగా ప్రకటిస్తారు.

నియోజకవర్గానికి 3000 ఇళ్లు..

మహబూబాబాద్‌ జిల్లాకు 8,670 ఇళ్లను గృహలక్ష్మి పథకం కోసం కేటాయించారు. వీటిలో నియోజకవర్గానికి 3000 ఇళ్లు చొప్పున కేటాయించగా.. జిల్లాలో మహబూబాబాద్‌, డోర్నకల్‌ పూర్తిస్థాయిలో ఉన్న నియోజకవర్గాలు కావడంతో 6వేల ఇళ్లు కేటాయించారు. ఇక జిల్లాకు పొరుగున ఉన్న పాలకుర్తి నియోజకవర్గంలోని ఈ జిల్లా మం డలాలైన తొర్రూరు అర్బన్‌, తొర్రూరు రూరల్‌, పెద్దవంగరకు 1500 ఇళ్లు కేటాయించారు. ఇల్లందు నియోజకవర్గ పరిధిలో ఉన్న జిల్లాలోని మండలాలైన బయ్యారం, గార్ల కు 670, ములుగు నియోజకవర్గంలోని కొత్తగూడ, గం గారం మండలాలకు 500 ఇళ్లు కేటాయించారు.

ఈ పథకానికి గత ఏడాది ఆగస్టు 8 నుంచి 10 వరకు దరఖాస్తులను స్వీకరించారు. చివరిరోజు వరకు జిల్లాలో 52,241 దరఖాస్తులు రాగా, మరుసటి రోజుకూడా దరఖాస్తులను స్వీకరించడంతో 57, 129కి చేరాయి. జిల్లాలో 18 బృందాలను ఏర్పాటు చేసి అదేనెల 11 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించారు. వాటిలో దాదాపు 23వేల మందిని అర్హులుగా గుర్తించగా 21వేల మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశా రు. అర్హులైన వారిలో జిల్లాకు కేటాయించిన 8,670 ఇళ్లకు ప్రొసీడింగ్‌లను జారీ చేశారు.

అర్ధాంతరంగా నిలిచిన నిర్మాణాలు..

‘గృహలక్ష్మి’ పథకంలో ఇళ్లు మంజూరైన లబ్ధిదారు లు హడావుడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఉన్న ఇం టిని తొలగించుకొని అక్కడే టార్పాలీన్లతో తాత్కాలిక గుడారం ఏర్పాటు చేసుకున్నారు. మరికొంతమంది నిర్మాణం చేసే ఇంటికి సమీపంలోనే మరో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. ఇక తమఇంటి నిర్మాణం పూర్త యి సొంతఇంటి కల నెరవేరుతుందని భావించిన లబ్ధిదారులకు చుక్కెదురైంది. బ్యాంకు ఖాతాలుతీసి ఇళ్లను బేసిమెంట్‌లెవల్‌ వరకు నిర్మాణం పూర్తి చేసి రూ.లక్ష ఆర్థిక సహాయం కోసం ఎదురుచూశారు. అప్పటికే అసెంబ్లీ ఎన్నికల కోడ్‌ సమీపిస్తుండడంతో అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధులను విడుదల చేయకుండా జాప్యం చేసింది. ఈలోగా కోడ్‌ రావడంతో నిధుల విడుదల నిలిచిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓటమి పాలై కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే గృహలక్ష్మి పథకాన్ని రద్దు చేసింది. అర్హులైన వారి సంఖ్య అధికంగా ఉండడం, మంజూరైన గృహాలు తక్కువగా ఉండడంతో లబ్ధిదారుల ఎంపికలో పార్టీపరంగా ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ పైరవీలు ఉన్నవారికే మంజూరయ్యాయనే ఆరోపణలు ఉండడంతో పథకాన్ని నిలిపివేశారు. అయితే ఇందు లో ఇల్లు నిర్మించుకునే వారంతా పేద, మధ్యతరగతి వర్గాలకు చెందినవారే ఉండడంతో ఆర్థికంగా సతమతమవుతున్నారు.

‘ఇందిరమ్మ పథకం’పైనే ఆశలు..

కొత్తగా వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎప్పుడు అమలవుతుందా? అని ఈ లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైనా ఇందిరమ్మ పథకంలో తమకు ఇళ్లను మంజూరు చేసి, ఆదుకోవాలని గృహలక్ష్మి పథకంలోని లబ్ధిదారులు కోరుతున్నారు.

ఇంటికోసం వ్యవసాయభూమి అమ్ముకున్నా..

- గుగులోత్‌ హైమా, బ్రహ్మంగారితండా, కేసముద్రం స్టేషన్‌

‘గృహలక్ష్మి’ పథకంలో ఇల్లు మంజూరైందని ఉన్నఇంటిని తొలగించి టార్పాలిన్లతో గుడారం వేసుకొని జీవిస్తున్నాం. ఇంటినిర్మాణానికి డబ్బులు లేకపోతే 20 గుంటల వ్యవసాయ భూమిని అమ్ముకున్నా. ఫిల్లర్ల వరకు నిర్మాణం పూర్తయ్యేసరికి డబ్బులు అయిపోయాయి. ప్రభుత్వ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆగిపోయిన ఇంటి నిర్మాణాన్ని పూర్తి చేయించి, ఆదుకోవాలి.

Updated Date - Jul 04 , 2024 | 12:05 AM