చరిత్ర ఘనం.. శిథిల జ్ఞాపకం..
ABN , Publish Date - Sep 18 , 2024 | 11:42 PM
ములుగు అభయారణ్య గర్భం వందల ఏళ్ల చరిత్రను పదిలంగా దాచుకుంది. ఎక్కడ తడిమి చూసినా.. తవ్వి శోధించినా అడుగడుగునా విస్తుగొలిపే వింతలు, విశేషాలే కనిపిస్తాయి. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపుతో కీర్తిపొందిన రామప్ప దేవాలయం కంటే పురాతనమైన చరిత్ర సాక్ష్యాలు అనేకం శిథిల జ్ఞాపకాలుగా ఉన్నాయి. తాడ్వాయి మండలంలోని దామెరవాయి, మంగపేట మండలంలోని మల్లూరు అడవుల్లో వెలుగుచూసిన డోల్మన్ సమాధులు ఆదిమ మానవుడి ఆనవాళ్లకు దారి చూపిస్తాయి.
ములుగు మండలం కొత్తూరు దేవునిగుట్టపై పురాతన ఆలయం
ఆంగ్‌కోర్ వాట్ తరహా నిర్మాణ శైలి
1500ఏళ్లనాటిదిగా భావిస్తున్న పురావస్తు పరిశోధకులు
ఆలయ పునరుద్ధరణ విషయంలో జాప్యం
రెండేళ్లక్రితం కలెక్టర్ నిధుల నుంచి రూ.1.80కోట్ల కేటాయింపు
టెండర్ దశలోనే నిలిచిన పనులు
‘ఫారెస్టు’ టూరిజానికి మొదటి అడుగు
రాళ్లతో మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్న అటవీశాఖ
ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్ నిర్వహణకు సన్నాహాలు
ములుగు, సెప్టెంబరు 18: ములుగు అభయారణ్య గర్భం వందల ఏళ్ల చరిత్రను పదిలంగా దాచుకుంది. ఎక్కడ తడిమి చూసినా.. తవ్వి శోధించినా అడుగడుగునా విస్తుగొలిపే వింతలు, విశేషాలే కనిపిస్తాయి. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపుతో కీర్తిపొందిన రామప్ప దేవాలయం కంటే పురాతనమైన చరిత్ర సాక్ష్యాలు అనేకం శిథిల జ్ఞాపకాలుగా ఉన్నాయి. తాడ్వాయి మండలంలోని దామెరవాయి, మంగపేట మండలంలోని మల్లూరు అడవుల్లో వెలుగుచూసిన డోల్మన్ సమాధులు ఆదిమ మానవుడి ఆనవాళ్లకు దారి చూపిస్తాయి. ఇదే తరహాలో అత్యంత విశిష్టమైన రాతి నిర్మాణమొకటి ములుగు మండలం కొత్తూరు సమీపంలోని దేవునిగుట్టపై ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా ప్రసిద్ధిగాంచిన కంబోడియాలోని ఆంగ్‌కోర్ వాట్ నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో దర్శనమిస్తోంది. నాలుగు దశాబ్దాలుగా ఈ కట్టడంపై విస్తృత పరిశోధనలు జరుగుతుండగా పరిరక్షణ, పునరుద్ధరణకు అడుగులు ముందుకు సాగడంలేదు. తాజాగా అటవీశాఖ ఆధ్వర్యంలో గుట్టపైకి మెట్ల మార్గాన్ని నిర్మిస్తుండటం ఈ ఆలయ మనుగడపై ఆశలు పెంచుతోంది.
ఆరో శతాబ్దం నాటి నిర్మాణం..
ములుగు జిల్లాకేంద్రానికి 18కిలోమీటర్ల దూరంలోని కొత్తూరు గ్రామ శివారులోగల దేవునిగుట్టపై ఈ రాతి నిర్మాణం ఉంది. వందేళ్లక్రితమే ఈ ఆలయం వెలుగులోకి వచ్చినా చుట్టూ ఉన్న దట్టమైన అడవిలో క్రూరమృగాల సంచారం ఎక్కువగా ఉండటంతో ప్రజలెవరూ అటువైపునకు వెళ్లేవారు కాదు. అయితే గత మూడు దశాబ్దాలుగా దీనిపై విస్తృత చర్చ జరుగుతోంది. గత పదేళ్ల కాలంలో దేశ విదేశాలకు చెందిన పురావస్తు, చరిత్ర పరిశోధకులు వచ్చివెళ్లారు. చూసిన వారంతా ఒకింత సంభ్రమాశ్చర్యానికి లోనయ్యారు. ఆంగ్‌కోర్ వాట్ ఆలయం నమూనాలో ఉండటాన్ని గుర్తించి.. 6, 7శతాబ్దాల కాలంలో నిర్మించి ఉంటారని, విష్ణుకుండినుల కాలంలోని శైలిని పోలి ఉందని అభిప్రాయపడ్డారు. దక్షిణ ఆసియాలోని పురాతన కట్టడాలపై పరిశోధన చేస్తున్న బ్రిటన్‌కు చెందిన చరిత్రకారుడు ఆడమ్ హార్డీ, జర్మనీకి చెందిన కొరీనా, ఇటలీకి చెందిన ఆండ్రీతోపాటు దేశీయ పరిశోధకులు అనేకమంది దేవునిగుట్ట ఆలయాన్ని సందర్శించి చరిత్ర లోతుల్లో అన్వేషించారు. యావత్ భారత దేశంలోనే ఇలాంటి నిర్మాణం ఎక్కడాలేదని తేల్చిచెప్పారు. ఫొటోలు, వీడియోలు తీసుకొని వెళ్లి ఇంకా అధ్యయనం జరుపుతూనే ఉన్నారు.
శిథిలావస్థలో ఆలయం
దేవునిగుట్ట ఆలయం నిర్మాణం చూడగానే మనసును కట్టి పడేస్తుంది. ఆ శైలి ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతోంది. 30మీటర్ల ఎత్తులో ఉండే ఈ ఆలయం రాతి ఇటుకలను పేర్చినట్లు కనిపిస్తుంది. శైవం, వైష్ణవం కలబోతగా శిల్పాకృతులున్నాయి. తాండవం చేస్తున్నట్లుగా పరమశివుడు, నిలువెత్తు విష్ణుమూర్తి, దేవతల ఆకృతులు కనిపిస్తాయి. అనేక రాళ్లపై దేవతామూర్తుల రూపాన్ని చెక్కి వరుసక్రమంలో పేర్చిన తీరు ఆనాటి మేధస్సుకు అద్దం పడుతోంది. కాలక్రమంలో ఆలయం శిథిలావస్థకు చేరగా.. గోపురం పైభాగం ధ్వంసమై వర్షపునీరు లోపలికి చేరుతోంది. చెట్లు పెరగడం, తీగలు అల్లుకోవడంతో రాళ్లమధ్య పగుళ్లు వచ్చాయి. 60నుంచి 70ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రహరీ ధ్వంసమైంది. ఆలయానికి వెళ్లే మార్గంలో గండశిలపై ఉన్న కోనేరు కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది. ఇదిలా ఉంటే గుప్తనిధుల కోసం ఇక్కడ అన్వేషణ సాగుతోంది. గతంలో అనేక మంది రహస్యంగా తవ్వకాలు జరిపినట్టు స్థానికులు చెబుతారు. అయితే ఇటీవల ఆలయానికి సందర్శకులు వస్తుండటం, జనసంచారం పెరుగుతుండటంతో కొంతమేరకు తగ్గుముఖం పట్టినట్టు స్పష్టమవుతోంది.
సంరక్షిస్తున్న స్థానికులు
కొత్తూరు గ్రామస్థుల ఆరాధ్య దైవమైన లక్ష్మీనర్సింహస్వామి తమను ప్రకృతి విపత్తులు, వైపరీత్యాల నుంచి కాపాడుతున్నాడని నమ్ముతున్నారు. దేవునిగుట్టపై సాక్షాత్తు నర్సింహస్వామియే కొలువున్నాడనే విశ్వాసంతో వారు 2012లో దేవుని విగ్రహాన్ని ప్రతిష్టించుకొని ఏటా హోలీ సమయంలో వేడుకలు జరుపుతూ లక్ష్మీనర్సింహస్వామికి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తరలివచ్చి దేవున్ని దర్శించుకుంటారు. ఈక్రమంలో భక్తులు వింత ఆచారాన్ని పాటిస్తున్నారు. వర్షాలు కురవాలని, అంటువ్యాధులు దూరం కావాలని వేడుకుంటూ వరదపాశం వేడుక నిర్వహిస్తున్నారు. బెల్లం, బియ్యం, పాలతో వండిన పరమాన్నాన్ని ఆలయం ఎదుట బండరాయిపై పోసి నాకుతారు. ఇలా ఇన్నేళ్లుగా కొత్తూరువాసులు ఈ పురాతన కట్టడాన్ని సంరక్షిస్తున్నారు. గుడి వద్దకు వెళ్లాలంటే కాలినడకన దట్టమైన తుప్పలు, చెట్లను దాటాలి. ప్రతీ ఏటా ఉత్సవాల సమయంలో అప్పటికప్పుడు ముళ్లపొదలు, తుప్పలను కొంతమేరకు తొలగించి తాత్కాలిక దారిని ఏర్పాటు చేసుకుంటారు.
రూ.10లక్షలతో మెట్లు, బేంచీలు..
ఆలయ పునరుద్ధరణ కోసం రెండేళ్ల క్రితం అప్పటి కలెక్టర్ కృష్ణఆదిత్య రూ.1.80కోట్లను కేటాయించారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్టు, తెలంగాణ పురావస్తు శాఖ సంయుక్త పర్యవేక్షణలో పనులు చేయాలని నిర్ణయించారు. అయితే ఆ ప్రయత్నం టెండర్ల దశలోనే నిలిచిపోయింది. తాజాగా జిల్లా అటవీశాఖ అడుగు ముందుకు వేసింది. బొగత, లక్నవరం, తరహాలో దేవునిగుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని సంకల్పించింది. దారి, సదుపాయాల కల్పనకోసం రూ.10లక్షల వ్యయంతో పనులు మొదలుపెట్టారు. 2కిలోమీటర్ల మేర మెట్ల మార్గాన్ని నిర్మిస్తున్నారు. స్థానికంగా లభించే రాళ్లతోనే మెట్లను కడుతున్నారు. గుట్టపై పగోడాలు, సందర్శకులు సేదతీరేందుకు బెంచీలను ఏర్పాటు చేయనున్నట్టు ములుగు ఫారెస్టు రేంజ్ అధికారి శంకర్ తెలిపారు. వారాంతాల్లో ట్రెక్కింగ్, క్యాంప్ ఫైర్, తదితర సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుందని వెల్లడించారు. దేవునిగుట్ట విశేషాలను పర్యాటకులకు తెలిపేందుకు గైడ్‌ను నియమిస్తామని తెలిపారు. పనులు పూర్తయిన తర్వాత నిర్ణీత టిక్కెట్ ధరతో సందర్శనకు అనుమతించనున్నట్టు పేర్కొన్నారు.