Share News

ఆశలు ఆవిరి!

ABN , Publish Date - Apr 14 , 2024 | 11:10 PM

ఇన్నాళ్లుగా వికసించిన పైర్ల పచ్చదనం.. ఈ ఏడాది నీళ్ల కరువుతో పటాపంచలై అన్నదాతను అప్పులపాల్జేస్తోంది. తాతల కాలం నుంచి నమ్ముకున్న వ్యవసాయం ఇప్పుడుప్పుడే గాడినపడుతుందనుకున్న ఆనందం.. అంతలోనే తిరగబడి పాడు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. పదిహేనేళ్ల క్రితం మసకబారిన కరువు మళ్లీ దర్శనమిస్తూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది.

ఆశలు ఆవిరి!
కుందారంలో సాగునీరు లేక ఎండిపోయిన వరిచేనులో మేస్తున్న గొర్రెలు

పొట్ట దశలో ఎండిపోతున్న పంటపొలాలు

ఎన్ని బోర్లు వేసినా కానరాని నీటి జాడలు

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు

అప్పులభారంతో సతమతం

సర్కారు సాయం కోసం ఎదురుచూపులు

పొట్ట దశలో ఉన్న రెండెకరాల వరి ఎండి పోతుంటే చూడలేక దొరికిన చోటల్లా అప్పు చేసి మూడు బోర్లు వేయించా. ఎందులోనూ చుక్క నీరు రాలేదు. రూ. 1.20 లక్షల ఖర్చయింది. పెట్టుబడికి మరో రూ.60 వేలు అయింది. ఏం చేయాలో అర్ధం కావట్లేదు.

- ఓ రైతు ఆవేదన

లింగాలఘణపురం, ఏప్రిల్‌14: ఇన్నాళ్లుగా వికసించిన పైర్ల పచ్చదనం.. ఈ ఏడాది నీళ్ల కరువుతో పటాపంచలై అన్నదాతను అప్పులపాల్జేస్తోంది. తాతల కాలం నుంచి నమ్ముకున్న వ్యవసాయం ఇప్పుడుప్పుడే గాడినపడుతుందనుకున్న ఆనందం.. అంతలోనే తిరగబడి పాడు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. పదిహేనేళ్ల క్రితం మసకబారిన కరువు మళ్లీ దర్శనమిస్తూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ పథకాలు అన్నదాతకు అండగా నిలుస్తున్నప్పటికీ వెన్నుచూపుతున్న ప్రకృతి మాత్రం సాగుబడిని సాగిలపడేలా చేస్తోంది. జిల్లా వ్యాప్తంగా సాగు చేసిన పంటపొలాలు సరిగ్గా చేతికందే స్థాయిలోనే చేజారిపోతున్న తీరు అన్నదాతకు పుట్టెడు దుఃఖాన్ని మిగులుస్తోంది.

కానరాని నీటి జాడలు..

జిల్లాలో ప్రధానంగా చీటకోడూరు, నవాబుపేట, మల్లన్నగండి, బొమ్మకూరు, కన్నెబోయినగూడెం, వెల్దండ, అశ్వరావుపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌ రిజర్వాయర్లు ఉండగా ఒక్క చీటకోడూరు రిజర్వాయర్‌ మాత్రం తాగునీటి సరఫరా కోసం ఉద్దేశించినది. మిగతా రిజర్వాయర్లన్నీ సాగునీటి కోసం ఏర్పాటు చేసినవే. అయితే ఏటా సాగునీటి రిజర్వాయర్లను నింపి కాలువల ద్వారా పంట పొలాలకు వదిలేసే అధికారులు ఈ ఏడాది కేవలం రిజర్వాయర్లకు మాత్రమే పరిమితం చేయడంతో పంటపొలాలకు నీళ్ల కరువు ఏర్పడింది. నవాబుపేట రిజర్వాయర్‌ విషయానికి వస్తే నీళ్లు లేక రిజర్వాయర్‌ పూర్తిగా అడుగంటే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆయకట్టు పరిధి చెరువులు, కుంటలు పూర్తిగా ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో కోటి ఆశలతో సాగు చేసిన పంటపొలాలన్నీ మొదట్లో సాగునీటితో కళకళలాడినా ఎండలు తీవ్రమయ్యేనాటికి ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. సాగు చేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు దొరికిన చోటల్లా అప్పులు తెచ్చి బోరు బావులు తవ్వినా నిష్ప్రయోజనంగా మారిపోతోంది.

పదేళ్ల కాపాయం కరువు పాలు..

లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన చిర్ర యాదయ్య అనే రైతు తనకున్న రెండు ఎకరాల్లో ఏటా వరిపంటను సాగు చేస్తున్నాడు. పెట్టుబడి ఖర్చులు పోగా కాస్తో కూస్తో.. ఎకరాకు రూ. 10వేల లెక్కన మిగులుబాటు చేసుకుని ఉన్నదాంట్లో కాపాయం చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవాడు. ఈఏడాది రెండెకరాల పంట సాగుకు సుమారుగా రూ. 60వేల పెట్టుబడి పెట్టి పంటలను కంటికి రెప్పలా కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అయితే చివరి దశలో తనకున్న బోరుబావి అడుగంటిపోయింది. దీంతో పొరుగు రైతుల సూచనతో వెంటనే 250 ఫీట్ల లోతు బోరుబావిని తవ్వించినా చుక్కనీరు రాలేదు.. మళ్లీ మొండి ధైర్యం చేసి కాస్త దూరంగా మరో 230 ఫీట్ల బోరు బావిని తవ్వించినా ఫలితం శూన్యం. చివరిగా దింపుడు కల్లం ఆశలతో మూడో బోరు 230 ఫీట్ల లోతుగా తవ్వించినా కూడా రాతి పొడి తప్ప చుక్కనీటి జాడలేకపోవడంతో ఆశలు చాలించుకున్నాడు. మూడు బోరుబావులు తవ్వించగా మొత్తం రూ. 1.20 లక్షల ఖర్చు నెత్తిన అప్పుల కుప్పగా మిగిలిందని ఆవేదన చెందుతున్నాడు. చివరిగా చేసేదేమిలేక రెండెకరాల పంటపొలంలో పశువులను మేపుతున్నాడు. ఇది ఒక్క యాదయ్య అనుభవం మాత్రమే కాదు.. ఊరూరా ఇలాంటి యాదయ్యలు ఎంతోమంది ఉన్నారు.

ఆశలన్నీ ఆవిరైపోయాయి : చిర్ర యాదయ్య, రైతు, కుందారం

కోటి ఆశలతో రూ. 60వేల పెట్టుబడి పెట్టి రెండెకరాల పొలంలో వరిసాగు చేశాను. పంట చేతికి అందుతుందని ఆశపడుతున్న లోపే బోరుబావులు పూర్తిగా వట్టిపోయి సాగునీటికి తీవ్రమైన సమస్య ఏర్పడింది. ఏం చేయా లో తోయక రూ. 1.20 లక్షలు అప్పు లు తెచ్చి వరుసగా మూడు బోర్లు వేస్తే చుక్క నీరు రాకపోగా దుమ్ములేచింది. ఇలాంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా ఊహించలేదు. గత పదేళ్లుగా పెట్టుబడి ఖర్చులు పోను ఏటేటా రూ. 10వేలు మిగులు కనిపిస్తే ఈ సారి పదేళ్ల కాపాయం వడ్డీతో సహా కరువు పాలైపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలి. లేదంటే మా బతుకులు ఆగమే.

Updated Date - Apr 14 , 2024 | 11:11 PM