Share News

తాగునీరు అందుతోందా?

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:54 PM

మిషన్‌ భగీరథ అనే బృహత్‌ పథకం కింద రాష్ట్రంలో ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని గత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులను నిలిపివేసింది. ఇంటింటికీ తాగునీరు అందుతున్నపుడు ప్రత్యేకంగా మళ్లీ నిధులెందుకని అభ్యంతరం తెలిపింది. మరోవైపు గత ప్రభుత్వం ప్రకటించినట్లుగా రాష్ట్రంలో వందశాతం తాగునీరు అందడం లేదు. క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టాలంటే ఇంటింటా సర్వే చేసి కేంద్రానికి నివేదించాలని ప్రస్తుత సర్కారు భావించి అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఈ నెల 10వ తేదీనుంచి జిల్లాలో సర్వే కొనసాగుతోంది.

తాగునీరు అందుతోందా?
జఫర్‌గడ్‌లో ఇంటింటా తాగునీటి వివరాలు సేకరిస్తున్న జీపీ సిబ్బంది

‘మిషన్‌ భగీరథ’పై కొనసాగుతున్న సర్వే

పదిరోజుల పాటు ఇంటింటా నిర్వహణ

పథకం అమలు తీరుపై ఆరా తీస్తున్న సిబ్బంది

11 అంశాలపై క్షేత్రస్థాయిలో వివరాల సేకరణ

ఎప్పటికప్పుడు ప్రత్యేక యాప్‌లో నమోదు

తాగునీటి సమస్య పరిష్కారమే లక్ష్యం

జిల్లాలో 1.34 లక్షల నల్లా కనెక్షన్లు

జఫర్‌గడ్‌, జూన్‌ 12: గత ప్రభుత్వం లక్షల కోట్లు వెచ్చించి గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో మిషన్‌ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఈ పథకం కింద ట్యాంకులను నిర్మించి పైపులైన్లు వేసి ఇంటింటా నల్లాలను ఏర్పాటు చేసింది. ఒక్కో మనిషికి కనీసం వంద లీటర్ల నీటిని అందించేందుకు ప్రణాళికలు తయారు చేసింది. కానీ, ఈ పథకం అమలులో క్షేత్ర స్థాయిలో అనేక సమస్యలు వస్తున్నాయి. అనేక చోట్ల నల్లాలను అమర్చలేదు. కొన్ని ప్రాంతాల్లో గ్రామానికి దూరంగా ట్యాంకులను నిర్మించి నివాసాలకు పైపులైన్లు వేయకుండా వదిలేశా రు. పాత పైపులైన్ల ద్వారానే తాగునీరు సరఫరా చేస్తు న్నారు. పైపులైన్ల లీకేజీలు అధికంగా ఉన్నా యి. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో వందశాతం ఇళ్లకు తాగునీరు సరఫరా చేస్తున్నామని గత ప్రభుత్వం ప్రకటించినందున కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావడం లేదు. జల్‌ జీవన్‌ మిషన్‌ పథకం కింద రాష్ర్టానికి రావాల్సిన నిఽధులను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిషన్‌ భగీరథ పథకంపై పూర్తి వివరాలను సేకరించి తద్వారా కేంద్రం నుంచి నిధులను రాబట్టుకోవాలనే ఉద్దేశంతో సమగ్ర సర్వేకు పూనుకుంది. ఇందులో భాగంగా జిల్లాలో ఈ నెల 10వ తేదీ నుంచి సర్వే ప్రారంభమైంది. పది రోజు ల పాటు నిర్వహించే ఈ ప్రక్రియ కలెక్టర్‌ నేతృత్వంలో కొనసాగుతోంది. అనంతరం తుది నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో 281 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 1,34,971 నల్లా కనెక్లన్లు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

వివరాల సేకరణ, యాప్‌లో నమోదు..

ఇంటింటి సర్వేకు గాను ఎంపిక చేసిన సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. గ్రామస్థాయిలో కార్యదర్శి నేతృత్వంలో జరిగే ఈ సర్వేలో భాగంగా అంగన్‌వాడి టీచర్లు, మహి ళా సంఘాల సభ్యులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. భగీరథ నీటి సరఫరాకు నల్లా కనెక్షన్‌ ఉందా? నీళ్లు సక్రమంగా వస్తున్నాయా? పైపులైన్ల లీకేజీలు ఉన్నాయా? శుద్ధమైన నీరు అందుతోందా? నల్లా పని చేస్తోందా? నీళ్లు ఎన్ని రోజులకు వస్తున్నాయి? కుటుంబ సభ్యులకు సరిపోతున్నాయా? వంటి 11 అం శాలపై వివరాలు సేకరిస్తున్నారు. అదేవిధంగా కుటుం బ యజమాని పేరు, చిరునామా, మొబైల్‌ నంబరు, ఆధార్‌, ఇంటి నంబరు తీసుకుంటున్నారు. కుటుంబ యజమానితో కలిసి ఇంటి ఫోటో, నల్లా ఫొటోను తీసుకుని ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు.

తాగునీటి సమస్య పరిష్కారమయ్యేనా..?

జిల్లాకు మల్లన్న సాగర్‌, ధర్మసాగర్‌లోని రెండు మి షన్‌ భగీరథ గ్రిడ్‌ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో మిషన్‌ భగీరథ పథకం ద్వారా 1.34,971 నల్లా కనెక్షన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అయితే నాసిరకమైన పైపు ల వల్ల లీకేజీలు ఏర్పడడం, కొన్ని చోట్ల గ్రామాలకు దూరంగా ట్యాంకులను నిర్మించడం, పైపులైన్లను సక్రమంగా వేయకపోవడం వంటి సమస్యల మూలంగా ప్రజలకు భగీరథ నీరు ఆశించిన స్థాయిలో అందడం లే దు. పలు గ్రామాల్లో పాత నల్లాల ద్వారానే నీటిని సరఫరా చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో భగీరథ నీళ్లు సరిపోకపోవడంతో పంచాయతీ బోరు బావుల నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ సర్వే ద్వారా లోపా లను గుర్తించి సరిదిద్దుతారా.. లేక తూతూ మంత్రంగానే సర్వే నిలిచిపోతుందా? అని ప్రజలు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో సర్వే కొనసాగుతోంది...

- అనిల్‌కుమార్‌, ఇన్‌చార్జి డీపీవో, జనగామ

మిషన్‌ భగీరథ ప థకంపై జిల్లాలో ఇంటిం టా సర్వే గత సోమవారం నుం చి ప్రారంభమైంది. కలెక్టర్‌ పర్యవేక్షణలో ఈ సర్వే కొనసాగుతోంది. సర్వే కోసం ఎంపిక చేసి న ఉద్యోగులకు శిక్షణ ఇచ్చాం. వారు ఇంటింటికీ వెళ్లి వివరాలు తెలుసుకుని యాప్‌లో నమో దు చేస్తున్నారు. సర్వే పది రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. క్షేత్ర స్థాయిలో సర్వేను పక్కాగా నిర్వహించేలా చూస్తున్నాం. సర్వే ద్వారా గుర్తించిన సమస్యలు, అంశాలు, వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తాం.

తాగునీటి సమస్య పరిష్కారానికి దోహదం..

- వి.శ్రీకాంత్‌, ఈఈ, ఇంట్రా డివిజన్‌, జనగామ

తాగునీటి సరఫరాలోని లోపాలను, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఈ సర్వే దోహదపడుతుంది. జిల్లాలో రెండు మిషన్‌ భగీరథ గ్రిడ్‌ల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా అవుతోంది. అయితే ఇందులో ఉన్న సమస్యలపై వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నాం. సర్వే కోసం జిల్లాలో 763 మందికి శిక్షణ ఇచ్చాం. కలెక్టర్‌ పర్యవేక్షణలో.. డీపీవో ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది.

Updated Date - Jun 12 , 2024 | 11:54 PM